సమీక్ష : సింగం 3 – ‘యాక్షన్’ ప్రియులకు మాత్రమే!

Singam 3 review

విడుదల తేదీ : ఫిబ్రవరి 9, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : హరి

నిర్మాతలు : జ్ఞానవేల్ రాజా

సంగీతం : హరీస్ జైరాజ్

నటీనటులు : సూర్య, శృతి హాసన్, అనుష్క, ఠాకూర్ అనూప్ సింగ్..

‘సింగం 3’.. గత మూడు నెలలుగా సూర్య అభిమానులను ఎంతగానో ఎదురుచూయిస్తోన్న సినిమా. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ క్రేజీ సూపర్ హిట్ సీక్వెల్, వివిధ కారణాలతో వాయిదా పడుతూ ఇప్పటికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగం’, ‘సింగం 2’ల తరహాలోనే ఆకట్టుకుందా? చూద్దాం..

కథ :

ఆంధ్రప్రదేశ్‌లో పేరుమోసిన పోలీసాఫీసర్ అయిన నరసింహ (సూర్య)ను కర్ణాటక హోం మంత్రి (శరత్ బాబు) ప్రత్యేకంగా ఒక మిషన్ మీద మంగళూరుకు డెప్యుటేషన్‌పైన రప్పిస్తాడు. ఒక కమీషనర్ హత్యకు సంబంధించిన కేసును నరసింహకు అప్పగిస్తారు. నరసింహ ఆ కేసును తనదైన శైలిలో విచారించి హంతకులను తొందరగానే పట్టుకుంటాడు. అయితే ఈ క్రమంలోనే కమీషనర్ కేసు వెనుక చాలా పెద్ద కథ ఉందని, విఠల్ (అనూప్ సింగ్) అనే ఓ పెద్ద వ్యాపారవేత్త ఈ హత్య వెనుక ఉన్నాడని తెలుసుకుంటాడు.

ఆ తర్వాత ఈ కేసును పూర్తి చేయడం తన పర్సనల్ మిషన్‌గా పెట్టుకున్న నరసింహ ఏం చేశాడు? ఆస్ట్రేలియాలో ఉండే విఠల్‍పై ఎలా పోరాడాడు? కమీషనర్ హత్య వెనుక ఉన్న కథేంటీ? ఈ కథలో అగ్ని (శృతి హాసన్) ఎవరు? నరసింహ, తన భార్య కావ్య (అనుష్క)కు దూరంగా ఉన్నట్లు ఎందుకు నటిస్తాడు? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పాల్సింది హీరో సూర్య గురించి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఆయన నటన అద్భుతమనే స్థాయిలోనే ఉంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎగ్రెసివ్ గా కనిపిస్తూ ఆయన చెప్పిన డైలాగులు, చేసిన ఫైట్స్ బాగా అలరించాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన ఎమోషన్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాని చాలా వరకు తన పెర్ఫార్మెన్స్ మీదే నడిపించాడు సూర్య.

హీరోయిన్ శృతి హాసన్ పాత్ర కూడా ఆకట్టుకుంది. గ్లామరస్ గా కనిపిస్తూనే మంచి నటన ప్రదర్శించిందామె. ముఖ్యంగా పాటల్లో తన అందాలతో కనువిందు చేసింది. ఇక సినిమాకి ముఖ్యమైన విలన్ పాత్ర కూడా చాలా బలంగా ఉండి హీరో పాత్రకు చాలెంజింగా నిలబడింది. ఆ పాత్ర చుట్టూ దర్శకుడు అల్లిన నేపథ్యం ఆసక్తికరంగా అనిపించింది. అలాగే సెకండాఫ్ లో వచ్చే హెవీ యాక్షన్ సన్నివేశాలు చాలా పవర్ ఫుల్, రేసీగా ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఫారిన్ లొకేషన్లో చిత్రీకరించిన రెండు పాటలు లొకేషన్లపరంగా, టేకింగ్ పరంగా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా బలహీనతల్లో ముందుగా చెప్పాల్సింది కథ గురించి. ఎప్పటిలాగే పోలీస్ ఆఫీసర్ నరసింహం ఒక కేసును ఛేదించే పనిలో విదేశాల్లో ఉన్న విలన్ తో పోరాడి అతన్ని ఓడించడం అనేది ఈ సినిమాలో కథ. రెండవ భాగం ‘యముడు-2’ లో కూడా ఇదే కథ ఉండటంతో ఇక్కడ ఒక మోస్తారుగా కూడా కొత్తదనమున్న అనుభూతి కలగలేదు. చాలా సన్నివేశాల్లో ‘యముడు -2’ కళ్ళముందు కదిలినట్టే అనిపించింది. ప్రధాన హీరోయిన్ అనుష్క రోల్ పాతదే కనుక ఆమె ఎక్కువ సన్నివేశాల్లో కనిపించకపోవడం, అంత గ్లామరస్ గా కూడా ఉండకపోవడం నిరుత్సాహపరిచింది.

ఇక కొన్ని సన్నివేశాలైతే పూర్తిగా లాజిక్స్ కి అందకుండా కాస్త అయోమయానికి గురిచేశాయి. దీంతో సినిమాపై ఆసక్తి కొంచెం సన్నగిల్లింది. యముడు – 1, యముడు -2 సినిమాల్లోలాగే ఇక్కడ కూడా సిట్యుయేషనల్ కామెడీని పండించే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త బెడిసికొట్టి అస్సలు ఆకట్టుకోలేదు. పైగా సినిమా కథనానికి మధ్యలో అడ్డు తగులుతున్నట్టు అనిపించింది. ఇక సినిమాలో బాగా ఎక్కువ మోతాదులో ఉన్న యాక్షన్, ఛేజింగ్ ఎపిసోడ్లు ప్రేక్షకుడు తట్టుకునే స్థాయిని మించిపోయి కాస్త ఇబ్బంది పెట్టాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌నే ఈ సినిమాకు మేజర్ హైలైట్‍గా చెప్పుకోవాలి. లొకేషన్స్, ప్రతి సన్నివేశం భారీగా ఉండేలా చూసుకోవడంలో నిర్మాణ సంస్థ తీసుకున్న జాగ్రత్తలను అభినందించవచ్చు. ఇక భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోరుకునే వారికి ఈ సినిమాలో కొన్ని అలాంటి సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఈ ఫైట్ కంపోజిషన్స్‌ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక హరీస్ జైరాజ్ అందించిన పాటలేవీ గొప్పగా లేవు. విజువల్స్‌తో కలిపి చూస్తే రెండు పాటలు బాగున్నాయనిపించింది. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ఇక దర్శకుడు హరి విషయానికి వస్తే, ‘సింగం’ సిరీస్‌లో గత రెండు భాగాలను ఫార్ములా కథలతోనే నడిపించినా, ఎమోషన్, యాక్షన్, కామెడీ అన్నీ సమపాళ్ళలో ఉండేలా చూసుకున్నారు. ఈ సినిమాలో మాత్రం కాస్త ఎమోషన్‌ను తగ్గించి, భారీ యాక్షన్ సన్నివేశాలపైనే దృష్టి పెట్టారు. రొటీన్ కథను తీసుకొని దానికి యాక్షన్ సన్నివేశాలను అల్లుతూ ఆయన చేసిన ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.

తీర్పు :

‘సింగం’ సిరీస్ అనగానే.. రేసీ స్ర్కీన్‌ప్లే, అదిరిపోయే ఫైట్స్, భారీ డైలాగులు సాధారణంగానే గుర్తుకొస్తాయి. ఈ సిరీస్‌లో మూడో భాగంగా వచ్చిన ‘సింగం 3’లో ఫైట్స్, డైలాగ్స్ బాగానే ఉన్నా, అసలు కథ, దానికి రాసుకున్న స్క్రీన్‌ప్లే మరీ రొటీన్‌గా ఉండడం నిరుత్సాహపరచే అంశం. సూర్య అదిరిపోయే నటన, శృతి హాసన్ ప్రెజెన్స్, బలమైన విలన్ పాత్ర, కళ్ళు చెదిరే పలు యాక్షన్ ఎపిసోడ్స్ లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో మిగతా చెప్పుకోదగ్గ అంశాలేవీ లేకపోవడమే పెద్ద మైనస్. ఒక్కమాటలో చెప్పాలంటే.. యాక్షన్, యాక్షన్, యాక్షన్ అంటూ నడిచే ఈ సినిమా, యాక్షన్ ప్రియులను మాత్రం బాగానే ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 
Like us on Facebook