సమీక్ష : యమహో యమః – ప్రేక్షకులతో ఆడుకున్న యముడు

yamaho_yama విడుదల తేదీ: 14 డిసెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : జితేందర్ వై
నిర్మాత : జీ .విజయకుమార్ గౌడ్
సంగీతం : మహతి
నటీనటులు : సాయి రామ్ శంకర్, శ్రీహర, పార్వతి మెల్టన్


శ్రీహరి అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు ఇంకా చేయడానికి బాలన్స్ ఉన్న పాత్రలన్నీ చేసే అవకాశం ఒకే సినిమాలో వచ్చింది. యముడు, బ్యాట్ మాన్, బంబుల్ బీ, లేడీ గెటప్ ఇలా విభిన్నమైన గెటప్స్ అన్నీ ఒకే సినిమాలో వేసాడు. ఆ సినిమా పేరే ‘యమహో యమః ఇన్ అమెరికా ‘. సాయిరామ్ శంకర్, శ్రీహరి, పార్వతి మెల్టన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన యమహో యమః ఈ రోజే విడుదలైంది. జితేందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మహతి సంగీత దర్శకుడు. జీవికే ఆర్ట్స్ బ్యానర్ పై జి. విజయ్ కుమార్ గౌడ్ ఈ సినిమాని నిర్మించాడు. యముడి మీద ఎన్నో సినిమాలు వచ్చాయి కదా మరి ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించారో చూద్దాం.

కథ :

హైదరబాదులో ఉండే బాలు (సాయిరామ్ శంకర్) చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవడంతో బామ్మ (రమాప్రభ) పెంచుతుంది. బాలుకి 25 ఏళ్ళు వచ్చేసరికి చనిపోతాడని ఒక సాధువు చెప్తాడు. యముడిని పూజిస్తే బాలు ఆయుష్షు పెరుగుతుందని బాలుని చిన్ననాటి నుండే యముడికి భక్తుడిని చేసి బాలుకి 25 ఏళ్ళు వచ్చే టైంకి అమెరికా పంపిస్తుంది బామ్మ. అమెరికా వెళ్ళిన బాలు పని పాట లేకుండా తిరుగుతుంటాడు. ఇది చూసిన యముడు (శ్రీహరి) బాలుకి బుద్ది చెప్పాలని అమెరికాకి వస్తాడు. బాలుని మార్చడం యముడి వల్ల కూడా కాదు. ఇలా లాభం లేదని ప్రేమలో పడితే మారతాడని బాలు, స్వప్న (పార్వతి మెల్టన్) ప్రేమించుకునేలా చేస్తాడు యముడు. మరి స్వప్న వల్ల బాలు మారాడా లేదా? 25 ఏళ్ళు వచ్చిన తరువాత బాలు చనిపోయాడా లేదా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

శ్రీహరి యముడిగా బాగా చేయకపోయినా పర్వాలేదనిపించాడు. భారీ డైలాగులు బాగానే చెప్పాడు. మిగతా వారిలో సాయిరామ్ శంకర్ నటన విషయం పక్కన పెడితే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకొవడానికి ట్రై చేస్తున్నాడు. టార్గెట్ ఆడియెన్స్ ని కొంత వరకు మెప్పించాడు. శ్రీహరి, సాయిరామ్ శంకర్ మధ్య కొన్ని సెంటిమెంట్ సీన్స్ బానే పండాయి. చివర్లో వచ్చే తాగుబోతు రమేష్ కామెడీ కొంత బెటర్. సంజన ఒక పాటలో విపరీతమైన అందాల ఆరబోత చేసింది. ఎం.ఎస్ నారాయణ బాత్ రూమ్ సీన్స్ కూడా బాగానే పండాయి.

మైనస్ పాయింట్స్ :

ఇప్పటికే యముడి కాన్సెప్ట్ మీద ఎన్నో సినిమాలు, ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించారు అంటే అమెరికా. యముడుకి ఆంధ్రప్రదేశ్ లో తిరిగి బోర్ కొట్టిందేమో ఈసారి అమెరికా బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. శ్రీహరి హాలీవుడ్ హీరోలు బ్యాట్ మాన్, బాంబుల్ బీ ఇలా చాలా గెటప్స్ వేసి భయపెట్టాడు. ఇవి చాలదన్నట్లు చివర్లో లేడీ గెటప్లో కూడా దర్శనం ఇచ్చాడు. హీరో సాయిరామ్ శంకర్ ఇంట్రడక్షన్ భారీగా ఉండాలనుకున్నాడేమో ఏకంగా పులి మీద ఎంట్రీ ఇచ్చాడు. సిటీలోకి వచ్చిన పులికి పాట పాడి ఆ పులిని మళ్ళీ అడివికి వెళ్ళిపోయేలా చేస్తాడు. పులి పాట వినలేక వెళ్ళిందా? పాట అర్ధమై వెళ్లిపోయిందా? అని ఎవరికి తోచినట్లు వాళ్ళు సర్ది చెప్పుకోవాల్సిందే. డైరెక్టర్ టేకింగ్, మేకింగ్ అన్నీ 20 ఏళ్ళ కింద వచ్చిన సినిమాల స్థాయిలో ఉన్నాయి. పార్వతి మెల్టన్ నటనకి కాదు కదా బక్క చిక్కి స్కిన్ షో కోసం పెట్టిన పాటలకి కూడా న్యాయం చేయలేకపోయింది. సంజనని ఒక స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటే మిగిలిపోయిన డేట్స్ తో ఎక్స్ట్రా సీన్స్ తీసినట్లున్నారు. సాంగ్ వరకు న్యాయం చేసింది కానీ ఎక్స్ట్రాగా చేసిన సీన్స్ మాత్రం అయిష్టంగా చేసింది. దానికి తోడు సొంత డబ్బింగ్ ఒకటి. మన్మధుడు గెటప్ వేసిన అనంత్ తో ‘దొబ్బించుకొంటున్నాం’ లాంటి పదాలు పెట్టడం ఏంటో దర్శకుడికి తెలియాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

యముడి సినిమా అంటే గ్రాఫిక్స్ బాగా ఉండాలి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ సీరియల్ గ్రాఫిక్స్ ని తలపించాయి. సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్ వరకు అస్సలు బాలేదు కానీ సెకండ్ హాఫ్ వరకు కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. చాలా సీన్స్ లో క్వాలిటీ వల్ల ఇంట్రస్ట్ దెబ్బ తీసాయి. ఎడిటింగ్, సాంగ్స్ సో సో. నేపధ్య సంగీతం కొంత వరకు బెటర్. క్లైమాక్స్ ఫైట్ తప్ప మిగతావి ఏవీ ఫైట్ అనిపించేలా లేవు.

తీర్పు:

యముడి కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయని ఒక నమ్మకం ఉండేది. ఈ సినిమాతో నమ్మకం బ్రేక్ అయినట్లే.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘Yamaho Yama’ English Review

సంబంధిత సమాచారం :