ఇంటర్వ్యూ : అనిల్ గోపిరెడ్డి – క్రైమ్ ని కామెడీగా చూపించడమే ‘బిస్కెట్’ స్పెషాలిటీ..

ఇంటర్వ్యూ : అనిల్ గోపిరెడ్డి – క్రైమ్ ని కామెడీగా చూపించడమే ‘బిస్కెట్’ స్పెషాలిటీ..

Published on Dec 26, 2013 6:15 PM IST

anil_gopi_reddy
మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు దక్కించుకొని ఇండస్ట్రీకి పరిచయమై, ‘వైకుంఠపాళి’ అనే ఓ సీరియస్ సినిమా చేసి దర్శకుడిగా తెలుగు వారికి పరిచయమైన అనిల్ గోపిరెడ్డి చేసిన ద్వితీయ ప్రయత్నమే ‘బిస్కెట్’. అరవింద్ కృష్ణ, డింపుల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కొత్త సంవత్సరం కానునకా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ గోపిరెడ్డితో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మొదటి సినిమా పరాజయం తర్వాత ఈ సినిమా ఐడియా ఎలా వచ్చింది?

స) నా మొదటి సినిమా వైకుంఠపాళి సీరియస్ గా ఉంటుంది. ఆ సినిమా వల్ల మనం ఏం చేసినా ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందించాలని అర్థమైంది. అందుకే ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని కొన్ని కామెడీ చిత్రాలను స్పూర్తిగా తీసుకొని మినిమమ్ గ్యారంటీ ఉండేలా ఈ సినిమా కథని రాసుకున్నాను. ఈ సినిమా థియేటర్ కి వచ్చిన అందరూ బాగా నవ్వుకొని వెళ్లిపోవచ్చు, దానికి మాత్రం గ్యారంటీ ఇవ్వగలను.

ప్రశ్న) ‘బిస్కెట్’ సినిమా గురించి చెప్పండి?

స) ఈ మధ్య నేను చాలా చోట్ల చదివాను. ఫుడ్ ఐటమ్స్ పేర్ల మీద సినిమాలు తీస్తున్నారని. కానీ నా సినిమా ఫుడ్ ఐటెం కాదు. మాములుగా మనం ఓ పని జరగడానికి ఎదుటి వారికి ఏదో ఒక బిస్కెట్ వేసి పని జరిపించుకుంటాం. అలాగే ఈ సినిమాలో ఎవరికి ఎవరు బిస్కెట్ వేసి ఏమేమి పనులు చేయించుకున్నారనేది సినిమాలో చూడాలి.

ప్రశ్న) మరి బిస్కెట్ లో ఉన్న కొత్త దనం ఏమిటి?

స) ఈ సినిమాలో మేము ఇది వరకూ ఎవరూ ట్రై చెయ్యని ఓ ప్రయత్నం చేసాం. క్రైమ్ అనేదాన్ని కామెడీగా చూపించాం. సినిమాలో మన హీరో అందరికీ బిస్కెట్స్ వేస్తుంటాడు. కానీ ఒక టైంలో రివర్స్ లో హీరో బిస్కెట్ తినాల్సి వస్తుంది. దాంతో సినిమా మొత్తం క్రైమ్ లోకి వెళుతుంది. కానీ ఇప్పటి వరకూ క్రైమ్ అంటే గన్స్, మర్డర్స్, యాక్షన్ అనేవి మనకు తెలుసు. కానీ ఇందులో క్రైమ్ అనేది పూర్తి కామెడీగా ఉంటుంది. ఈ క్రైమ్ లో విలన్స్ ఎవ్వరూ ఉండరూ అందరూ కమెడియన్స్ మాత్రమే ఉంటారు. ఓవరాల్ గా అవుట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీ అంటారు..

ప్రశ్న) పోస్టర్స్ చూస్తుంటే యూత్ ని టార్గెట్ చేసినట్టున్నారనేడి తెలుస్తోంది. అంటే ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా?

స) యూత్ టార్గెట్ చేసే పోస్టర్స్ ని తయారు చేసాం. కానీ యూత్ ఈ సినిమా చూసి వారి ఫ్యామిలీని ఈ సినిమాకి తీసుకు వస్తారు. ఇందులో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. చెప్పాలంటే మా సినిమాకి నిర్మాత స్రవంతి. ఆమె లేడీ కావడంతో ఆమె స్క్రిప్ట్ లో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండ కూడదని చెప్పారు. మేము అలానే డైలాగ్స్ రాసుకున్నాం. సెన్సార్ నుంచి కూడా సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

ప్రశ్న) డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవంటున్నారు, మరి సినిమాకి యు/ఏ ఎందుకు వచ్చింది?

స) సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. కానీ ఈ కథలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అది సినిమాకి అవసరం. అలా అని ఆ సాంగ్ వల్గర్ గా ఉండదు. అందుకే యు/ఏ ఇచ్చారు.

ప్రశ్న) అరవింద్ కృష్ణ, డింపుల్ పాత్రల గురించి మరియు వారి నటన గురించి చెప్పండి?

స) నటన పరంగా ఇద్దరూ బాగా చేసారు. ఇక పాత్రల పరంగా అయితే అరవింద్ కృష్ణ రియల్ ఎస్టేట్ లో పనిచేస్తూ బాగా హుందాగా బతుకుతుంటాడు. హీరోయిన్ డింపుల్ పాత్ర దానికి విరుద్దంగా ఉంటుంది. బాగా పిసినారి పాత్ర. వీరిద్దరూ ఎలా కలిసారు అనేది బాగా కామెడీగా ఉంటుంది.

ప్రశ్న) ఇంకా ఈ సినిమాలో హైలైట్స్ ఏమిటి?

స) హీరో హీరోయిన్ తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర వెన్నెల కిషోర్ చేసాడు. ఈ సినిమాలో 53 సీన్స్ లో కనిపిస్తాడు. అతని పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అలాగే చివరి 30 నిమిషాలు తాగుబోతు రమేష్ పాత్ర హైలైట్ అవుతుంది. అలాగే 18 మంది కమెడియన్స్ పై వచ్చే 3 నిమిషాల 45 సెకన్ల క్లైమాక్స్ సీన్ ని సింగల్ షాట్ లో తీసేసాం. ఆ క్రెడిట్ మా సినిమాటోగ్రాఫర్ కి చెందుతుంది. అది కూడా హైలైట్ అవుతుంది.

ప్రశ్న) మీరు మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడేమో డైరెక్టర్ రెండింటిలో మీకు ఏది కష్టం మరియు మీకు ఏది అంటే ఇష్టం?

స) డైరెక్షన్ అనేదే కష్టం కానీ కెప్టెన్ అఫ్ ది షిప్ గా ఉండటానికే ఇష్టపడతాను. చెప్పాలంటే చాలా మందికి డైరెక్టర్ కావాలనేదే గోల్. దానికోసం పలు దారులని ఎన్నుకొని ఇండస్ట్రీకి వచ్చి చివరికి డైరెక్టర్ అవుతారు.

ప్రశ్న) సినిమా ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి గల కారణం ఏమిటి?

స) ఆగష్టు చివరికల్లా మా చేతిలో ఈ మూవీ ఫస్ట్ కాపీ ఉంది. ఆ టైంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత మాములుగా ఇది చిన్న సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో అనేలా ఉండకూడదని కాస్త ఫ్రీ టైంలో సోలోగా విడుదల చేద్దామని ఇన్ని రోజులు ఆగాము. చివరికి నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమాకి బిజినెస్ అయిపోయింది, మొత్తంగా 150 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నందుకు టీం అంతా సంతోషంగా ఉన్నారు.

ప్రశ్న) సినిమాని మళ్ళీ రీ షూట్ చేసారని అంటున్నారు?

స) సినిమాని రీ షూట్ చెయ్యలేదు.. కానీ రీ ఎడిట్ మాత్రం చేసాము. మొదట 2 గంటల 15 నిమిషాలు ఉండేది. కానీ సినిమాలో బోరింగ్ సీన్స్ ఏమీ ఉండకూడదు, మూవీ ఫాస్ట్ గా సాగిపోవాలని 15 నిమిషాలు ట్రిమ్ చేసి 2 గంటల సినిమా చేసాం.

ప్రశ్న) చివరిగా మా పాఠకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

స) కొత్తగా ఉండాలని క్రైమ్ కి కామెడీని మిక్స్ చేసి తీసిన సినిమా ‘బిస్కెట్’. నూతన సంవత్సరం రోజు ఈ సినిమా మీకు వినోదాన్ని పంచడానికి వస్తోంది. చూసి ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం నాకుంది.

అంతటితో అనిల్ గోపిరెడ్డితో మా ఇంటర్వ్యూని ముగించి సినిమా మంచి విజయం అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాం.

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు