ఇంటర్వ్యూ : నాగార్జున – ఆ సినిమా గురించి నన్ను అడగొద్దు.!

ఇంటర్వ్యూ : నాగార్జున – ఆ సినిమా గురించి నన్ను అడగొద్దు.!

Published on Apr 29, 2013 4:16 PM IST

Nagarjuna-(7)
ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తున్న కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘గ్రీకు వీరుడు’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా నాగార్జున మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు. నాగార్జున ‘గ్రీకు వీరుడు’ సినిమా విశేషాలను, ఇండియన్ సినిమా 100 సంవత్సరాలు పూర్తయిన దాని గురించి మాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. సినిమా విషయంలో మీరేమన్నా టెన్షన్ గా ఉన్నారా?

స) అదేమీ లేదండి. సినిమా బాగా వచ్చింది ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. అలాగే ఇండియన్ సినిమా మే 3తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అదే రోజు నా ‘గ్రీకు వీరుడు’ సినిమా విడుదలవుతుండడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇలా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకోలేదు, అది అలా అనుకోకుండా జరిగిపోయింది.

ప్రశ్న) ఈ మధ్య జరిగిన 100 సంవత్సరాల ఇండియన్ సినిమా ప్రారంభోత్సవ సభకి వెళ్లినట్టున్నారు?

స) అవును వెళ్లాను. అక్కడ నేను ఓ షాక్ కి గురయ్యాను. అదేమిటంటే ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో సుమారు 100 సంవత్సరాల క్రితం తీసిన ‘త్రో ఆఫ్ డైస్’ అనే సినిమాను ప్రదర్శించారు. అది బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన మూకీ సినిమా కానీ ఈ సినిమాలో నాలుగైదు లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి. అది చూసి నేను, నాతో పాటు థియేటర్లో ఉన్న వారందరూ షాక్ అయ్యారు. అప్పుడనిపించింది అప్పట్లోనే లిప్ కిస్ సీన్స్ తీస్తే ఎలాంటి సెన్సార్ లేదు కానీ ఇప్పుడు మాత్రం సెన్సార్ సెన్సార్ అంటున్నారు.

ప్రశ్న) మరి ఈ సెన్సార్ కట్స్ విషయంలో ఏమీ చెయ్యలేమంటారా?

స) చెయ్యాలండి. కానీ అది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. 1952 లో సెన్సార్ వారు కొన్ని నియమ నిబందనలు రాసేసారు. అప్పటికి అవి ఓకే కానీ ఇప్పుడున్న ట్రెండ్ కి సరి కాదు. అందుకే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీలు కలిపి ఈ విషయం పై చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి సరికొత్త నియమ నిబందనలు రాసుకోవాలి. అప్పుడే ఈ సెన్సార్ బాధ నుండి బయటపడొచ్చు.

ప్రశ్న) ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ట్రై చేసే మీరు ‘గ్రీకు వీరుడు’ సినిమాలో ఎం నచ్చి ఓకే చేసారు?

స) ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ప్రేమ అంటే అదొక బాధ అని ఫీల్ అయ్యే మస్తత్వం ఉన్న వాడి పాత్ర. ఈ ఫీలింగ్ ఒక్క అమ్మాయిల విషయంలోనే కాదు అమ్మ, నాన్న, బ్రదర్, సిస్టర్, ఫెండ్స్ ఇలా ఏ రిలేషన్ షిప్ లోనూ ప్రేమ అంటే అదొక బాధ అని సింగల్ గా కెరీర్లో సక్సెస్ అయిన వాడి కథ. అలాగే సినిమాలో నెగటివ్ పాత్రలు ఏమీ ఉండవు. నా పాత్రలోనే పూర్తి నెగటివ్ షేడ్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా చేసాను.

ప్రశ్న) ఈ సినిమాలో డాన్సులతో యంగ్ జెనరేషన్ తో పోటీ పడినట్టున్నారు?

స) అదేమీ లేదండీ.. ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్ చాలా బాగా డాన్సులు చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, బన్ని మొదలైన వారు డాన్సులు చాలా బాగా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు అది కోరుకుంటున్నారు. ప్రేక్షకుల్ని మెప్పించడం కోసం నా వంతు నేనూ ట్రై చేసాను.

ప్రశ్న) ఈ మధ్య అందరూ యాక్షన్ సినిమాలకంటే ఎంటర్టైనింగ్ సినిమాలను ఎంచుకుంటున్నారు. ఎందుకో చెప్పగలరా?

స) ఈ విషయం చెప్పాలంటే మొదటి కారణం ప్రేక్షకుల్లో మార్పు రావడం. చిన్న నుంచి పెద్ద వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో బాగా బిజీగా ఉండటం, ఏవో టెన్షన్స్ అందువల్ల వారు థియేటర్ కి ఎంటర్టైనింగ్ కోసం వస్తున్నారు. అందుకే ఎంటర్టైనింగ్ సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ అంటే సేఫ్ సైడ్, ఇప్పుడేమో కామెడీ ఎంటర్టైనర్ అంటే సేఫ్ అందుకే అవే సినిమాలు తీసున్నారు.

ప్రశ్న) కానీ అవికూడా ఒకే తరహా సినిమాలను తిప్పి తిప్పి తీస్తున్నారు. ఇది ఎంతవరకూ కరెక్ట్ అంటారు?

స) (నవ్వుతూ) ఏమంటాను ఔననే అంటాను. ఏదైనా ఓ ఫార్మాట్ లో హిట్ వస్తే అదే ఫార్ములాని చంపి పాతి పెట్టేసేంత వరకూ అదే జోనర్ లో సినిమాలు తీయడం మన వారికి మామూలే కదా. ప్రస్తుతం ఉన్న ఫార్ములా బోర్ కొట్టేంత వరకూ, మరో కొత్త ట్రెండ్ వచ్చేంత వరకూ అవే సినిమాలు తీస్తారు.

ప్రశ్న) హీరోయిన్ నయనతార మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి చెప్పండి?

స) నయనతారతో రెండో సారి కలిసి పని చేసాను. నయనతార మంచి యాక్టర్, అలాగే పక్కా ప్రొఫెషనల్. ఆమెకి సీన్ చెబితే చాలు ఆమె తన లుక్, కాస్టూమ్స్ అన్నీ డిజైన్ చేసుకుంటుంది. సినిమా కోసం కష్టపడి పనిచేస్తుంది. సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వచ్చింది. ‘రగడ’ తర్వాత థమన్ తో రెండో సినిమా. ట్యూన్స్ కాచీ గా ఉన్నాయి. ట్యూన్స్ కి తగ్గట్టు గానే లిరిక్స్ కూడా కుదరడంతో సాంగ్స్ హిట్ అయ్యాయి. ఆడియో ఆల్బంలో ఇచ్చినవి కాకుండా రీ రికార్డింగ్ లో మరో పాటని యాడ్ చేసాము.

ప్రశ్న) ఈ మధ్య హీరోయిన్స్ ఆడియో ఫంక్షన్స్, మూవీ ప్రమోషన్స్ కి సరిగా రావటం లేదని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

స) నా వరకూ అది కరెక్ట్ కాదండి. హీరోయిన్ ఖాళీగా ఉంటే ఎందుకు రాదండి, మీరు చెప్పండి వాళ్ళకి మాత్రం వచ్చి వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలని ఉండదా? ఉంటుంది. మనం సడన్ సడన్ గా ఫంక్షన్స్ పెట్టుకుంటూ ఉంటాము. వాల్లెక్కడో షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోవచ్చు. ‘గ్రీకు వీరుడు’ ఆడియో లాంచ్ అనుకోకుండా జరగడంతో కేరళలో ఉన్న నయనతార రాలేకపోయింది. ‘తడాఖా’ కి ముందు నుంచి అన్ని ప్లాన్ చేసుకున్నాం అందుకే తమన్నా డేట్స్ సర్దుకొని ఆడియో ఫంక్షన్ కి రాగలిగింది.

ప్రశ్న) మీరు మల్టీ స్టారర్ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారా?

స) చేస్తానండి. చెయ్యాలనుకొని కొన్ని కథలు విన్నాను. ఏదీ ఫైనలైజ్ కాలేదు. సరైన కథ దొరకగానే ఖచ్చితంగా చేస్తాను.

ప్రశ్న) మీరు ఎప్పటికప్పుడు కొత్త వారికి చాన్స్ లు ఇచ్చి ప్రోత్సహిస్తారు. తాజాగా ‘మనం’ సినిమాలో హర్ష వర్ధన్ కి చాన్స్ ఇచ్చారని విన్నాం?

స) అవును. ఈ సినిమా కోసం అతను డైలాగ్స్ రాసి ఒక పది సీడీలు నాకు పంపాడు. డైలాగ్స్ ఎంత బాగున్నాయో అంతే డీసెంట్ గా ఉన్నాయి. అందుకే డైలాగ్స్ ఓకే చెప్పాను. కానీ స్క్రీన్ ప్లే మాత్రం రాయడం లేదు. డైరెక్టర్ విక్రం కె కుమార్ – హర్ష వర్ధన్ కి మంచి రిలేషన్ ఉంది. అలా రిలేషన్ ఉంటే ఆ కాంబినేషన్లో మంచి మంచి సినిమాలు వస్తాయి, ఉదాహరణకి విజయ భాస్కర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి.

ప్రశ్న) ఒక వేల నాగ చైతన్య మీ సినిమాలు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే మీరు ఏ ఏ సినిమాలను చెయ్యమంటారు?

స) నాగ చైతన్య నా సినిమాలు చెయ్యాలనుకుంటే ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్ళాడతా’, ‘మన్మధుడు’ లాంటి సినిమాలను ట్రై చెయ్యొచ్చు. కానీ ఇప్పుడే కాదు ఎందుకంటే నేను ఆ సినిమాలు చేసేటప్పటికి నటుడిగా మంచి పేరు తెచ్చుకొని ఉన్నాను. నాగ చైతన్య కూడా ఆ స్టేజ్ కి వచ్చాక ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు తను చేస్తున్న ‘తడాఖా’ సినిమాతో నాగ చైతన్యకి మంచి పేరు వస్తుంది.

ప్రశ్న) నాగ చైతన్య ‘ఆటో నగర్ సూర్య’ చాలా కాలంగా ఆగిపోయి ఉంది? ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పగలరా?

స) ఏమో నాకు తెలియదు. ఆ సినిమా గురించి నన్ను అడగొద్దు. ప్రస్తుతం నేను నా సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ బిజీగా ఉంటున్నాను.

ప్రశ్న) మీరు ఈ సారి ఎలక్షన్స్ లో ఓ పార్టీ తరపున ఎంపీగా నిలబడుతున్నారని కొన్ని చానల్స్, మీడియా చెబుతోంది. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా?

స) నేను రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ విషయాన్ని నేను ఇది వరకే చెప్పాను. రాజకీయాలపై నాకు అసలు ఎలాంటి ఆసక్తీ లేదు. కొన్ని టీవీ చానల్స్ నా పాపులారిటీని వాడుకుంటున్నాయి. టీడీపీ మొదలు పెట్టిన కొత్తలో నాన్నగారిని కూడా పాలిటిక్స్ లోకి రమ్మని చాలా చర్చలే జరిగాయి. కానీ ఆయన వెళ్ళలేదు. నాన్న గారికి నాకూ మొదటి నుంచి రాజకీయాలంటే ఇష్టం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఎలాంటి నాయకున్ని ఎన్నుకోవాలి అనే దానిపై ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి, వారి గురించి తెలుసుకొని ఓటెయ్యండి.

ప్రశ్న) చివరిగా సినిమా గురించి ప్రేక్షకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

స) సినిమా చాలా బాగా వచ్చింది. దశరథ్ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో కుటుంబసమేతంగా చూడదగిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘గ్రీకు వీరుడు’.. చూసి ఎంజాయ్ చెయ్యండి..

అంతటితో నాగార్జున గారితో మా ఇంటర్వ్యూని ముగించాము. మీకు కూడా బాగా నచ్చిందని ఆశిస్తున్నాము..

రాఘవ

CLICK HERE TO ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు