ముఖ్య అంశాలు (KEY TAKEAWAYS)
- క్వాలిఫైయర్-1లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. తన పక్కా వ్యూహాలతో జట్టును దర్జాగా ఫైనల్‌కు చేర్చాడు.
- 13వ ఓవర్ వరకు మ్యాచ్ తమ చేతుల్లోనే ఉన్నా.. ఒత్తిడికి లోనై సులభమైన క్యాచ్‌లు వదిలేయడమే తమ ఓటమికి ప్రధాన కారణమని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు.
- పవర్ ప్లేలో గుజరాత్ టాప్-3 బ్యాటర్లను పెవిలియన్ చేర్చాలన్న ప్లాన్‌తోనే బరిలోకి దిగామని, బౌలర్లు దాన్ని వంద శాతం అమలు చేశారని పాటిదార్ ప్రశంసించాడు.
క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సాధించిన ఘనవిజయం వెనుక పక్కా ప్లానింగ్ ఉంది. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాటు వ్యూహాత్మక నిర్ణయాలతో అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. జట్టును నేరుగా ఫైనల్‌కు చేర్చడంలో కీ రోల్ ప్లే చేశాడు. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు పంచుకున్న అభిప్రాయాలు ఈ హై-వోల్టేజ్ పోరులో అసలేం జరిగిందో స్పష్టం చేస్తున్నాయి.
ఒత్తిడిలో చేతులెత్తేసిన టైటాన్స్
కీలక మ్యాచ్‌లో ఫీల్డింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కుండబద్దలు కొట్టాడు. 12, 13 ఓవర్ల వరకు మ్యాచ్ తమ కంట్రోల్‌లోనే ఉన్నా.. ఆ తర్వాత ప్రెజర్‌ను హ్యాండిల్ చేయలేక సులభమైన క్యాచ్‌లు వదిలేయడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందన్నాడు. “పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వస్తే ఈ గ్రౌండ్‌లో ఎంత టార్గెట్ అయినా ఛేజ్ చేయొచ్చు. కానీ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. సాయి సుదర్శన్ అనూహ్య రీతిలో ఔట్ కావడం కూడా మా దురదృష్టమే. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని మొహాలీలో జరిగే తదుపరి మ్యాచ్‌లో పుంజుకుంటాం” అని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.
పాటిదార్ పక్కా స్కెచ్.. కంగారు పడ్డ బౌలర్లు
మరోవైపు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న రజత్ పాటిదార్.. తమ సక్సెస్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. ప్రత్యర్థి బౌలర్లను ముందు నుంచే మానసికంగా దెబ్బతీయాలన్నదే తమ ప్లాన్ అని చెప్పాడు. “పిచ్‌పై మంచి బౌన్స్ ఉండటంతో భారీ సిక్సర్లు కొట్టడం అంత సులువు కాలేదు. అందుకే క్రీజులోకి రాగానే తొలి 8-10 బంతులు పిచ్‌ను అర్థం చేసుకోవడానికి తీసుకున్నాను. ఆ తర్వాతే బౌలర్లపై ఎదురుదాడికి దిగి ప్రెజర్ పెంచాను” అని పాటిదార్ వివరించాడు.
గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌లో టాప్-3 బ్యాటర్లు అత్యంత ప్రమాదకరమని ముందే అంచనా వేశామన్నాడు. వారిని పవర్ ప్లేలోనే పెవిలియన్ చేర్చాలన్న వ్యూహాన్ని ఆర్సీబీ బౌలర్లు పర్ఫెక్ట్‌గా అమలు చేశారని కొనియాడాడు. ఇక ఫైనల్ మ్యాచ్ కోసం ముందుజాగ్రత్తగానే రొమారియో షెపర్డ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా దించి అతడి బౌలింగ్‌ను మిడిల్ ఓవర్లలో పరీక్షించినట్లు పాటిదార్ తన మాస్టర్ మైండ్‌ను బయటపెట్టాడు.


