ఇంటర్వ్యూ : రచ్చ రవి – నా కెరీర్లో ఈ 2017 ఒక స్పెషల్ ఇయర్ గా నిలుస్తుంది !

ఇంటర్వ్యూ : రచ్చ రవి – నా కెరీర్లో ఈ 2017 ఒక స్పెషల్ ఇయర్ గా నిలుస్తుంది !

Published on Dec 20, 2017 10:45 AM IST

‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రచ్చ రవి బుల్లి తెరపై తన కామెడీతో ఎంతలా నవ్వించారో ఇప్పుడు సినిమాల్లో కూడా అదే విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ ఏడాది వరుస సక్సెస్ లు అందుకుని ఈ 2017 తనకు బెస్ట్ ఇయర్ అంటున్న రచ్చ రవి విశేషాలు మీకోసం..

ప్ర) బుల్లి తెర నుండి వెండి తెర వరకు వచ్చారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది ?
జ) చాలా సంతోషంగా ఉంది. నాకు లైఫ్ ఇచ్చింది మల్లెమాలవారి ‘జబర్దస్త్’. ఆ షోను ఎప్పటికీ మర్చిపోను. ఎన్ని సినిమాలు చేసినా ‘జబర్దస్త్’ లో స్కిట్స్ చేస్తూనే ఉంటా.

ప్ర) సినిమా పరంగా మీ కెరీర్ ఎలా ఉంది ?
జ) నా మొదటి సినిమా తేజగారి ‘1000 అబద్దాలు’. ఆ సినిమా తర్వాత వరుసగా ఇంకొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా పెద్ద ఆఫర్లు చేతిలో ఉన్నాయ్. సినిమా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను.

ప్ర) మీకు మంచి పేరు తెచ్చిన సినిమాల గురించి చెప్పండి ?
జ) నాకు బ్రేక్ ఇచ్చిన సినిమాలన్నీ 2017 లో వచ్చాయి. ‘శతమానం భవతి, నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెం 150, రాజా ది గ్రేట్’ ఇలాంటివన్నీ నాకు మంచి సక్సెస్ ను ఇచ్చాయి. అందుకే ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకమైంది.

ప్ర) మీ తర్వాతి సినిమాలేంటి ?
జ) నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, సునీల్ ‘2 కంట్రీస్’ సినిమాల్లో మంచి రోల్స్ చేశాను. అవి ఈ డిసెంబర్ నెలలోనే రిలీజ్ కానున్నాయి.

ప్ర) కెరీర్ పరంగా మీకు ప్రోత్సాహం అందించిన వారెవరు ?
జ) మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు ‘జబర్దస్త్’ ద్వారా నాకు జీవితాన్ని , రచ్చ రవి అనే పేరును ఇచ్చారు. ఇక నాగబాబు గారైతే ఒకసారి టీమ్ లీడ్ పొజిషన్ చేజారిపోయినప్పుడు ఇంకో అవకాశామిచ్చి ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోలేను.

ప్ర) సినిమాల పరంగా మీకు సహకారం ఇచ్చింది ?
జ) దిల్ రాజుగారు, శిరీష్ గారు.. ఇద్దరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ బ్యానర్లో మంచి మంచి అవకాశాలిచ్చారు. వాళ్ళకెప్పుడూ నేను రుణపడే ఉంటాను. నన్ను ప్రోత్సహించిన వాళ్లలో ఇంకా చాలా మంది నిర్మాతలు ఉన్నారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. దర్శకుల్లో అయితే అనిల్ రావిపూడి ఎప్పుడో ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుని ‘రాజా ది గ్రేట్’ సినిమాలో నాకు రోల్ ఇచ్చారు. అలాగే సతీష్ వేగేశ్న కూడా నన్ను బాగా ప్రోత్సహిస్తారు.

ప్ర) నటుడిగా మీరు ఎక్కువ అందాన్ని పొందిన క్షణాలు ?
జ) నాకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అయన సినిమాలన్నా, నటనన్నా చొక్కాలు చించుకునేంత అభిమానం. అలాంటి ఆయన ‘ఖైదీ నెం 150’ షూటింగ్ అప్పుడు నన్ను రవి అంటూ ఆప్యాయంగా పిలిచి మాట్లాడటం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాగే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైం లో కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను ట్రీట్ చేసిన తీరు ఎంతో గొప్పగా అనిపించింది.

ప్ర) నటుడిగా మీ టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా ?
జ) ఉన్నాయి. తమిళం, హిందీ పరిశ్రమల్లో సినిమాలు చేయాలనేది నా కోరిక. తప్పకుండా చేస్తాను. ఇప్పటికే కొన్ని తమిళ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.

ప్ర) టాప్ కామెడియన్లలా లీడ్ రోల్స్ ఎప్పుడు చేస్తారు ?
జ) అవి కూడా ఉన్నాయి. నా గురువు బ్రహ్మానందంగారితో ‘కత్తి రెడ్డి – ఎత్తితే దించడు’ అనే ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇంకా అది డిస్కషన్స్ లోనే ఉంది.

ప్ర) మీకు సామాజిక కార్యాక్రమాల పట్ల కూడా స్పృహ ఎక్కువని విన్నాం ?
జ) అవును .. హరిత హారం, రక్తదానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటాను. సొసైటీలో అనాథలు లేకుండా చేయాలనేది నా లక్ష్యం. ఆ దిశగా కృషి చేస్తున్నాడు కూడ.

ప్ర) పలానా రోల్స్ మాత్రమే చేయాలనే ఉద్దేశ్యాలేమైనా ఉన్నాయా ?
జ) అలాంటివేం లేవు. నేను నటుడ్ని. ఎలాంటి పాత్రైనా చేస్తాను. ఒక్క నటనకు మాత్రమే పరిమితమవ్వాలనే ఆలోచన లేదు. కొత్త దర్శకులతో వర్క్ చేయాలని ఉంది.

ప్ర) మీలా సినిమాల్లోకి రావాలనుకునే ఔత్సాహికులకు మీ సలహా ఏంటి ?
జ) సినిమాల్లోకి రావాలనుకోవడంలో తప్పులేదు. ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆ ప్రయత్నం నిజాయితీగా, సరైన మార్గంలో ఉంటే ఎప్పటికైనా సక్సెస్ దక్కుతుంది. అదే నేనిచ్చే సలహా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు