నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన 99వ సినిమా డిక్టేటర్ సంక్రాంతికి విడుదలై అభిమానుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా అయిపోవడంతో బాలయ్య, ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న 100వ సినిమా గురించి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగిన డిక్టేటర్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ బాలకృష్ణ తన వందవ సినిమా గురించి ప్రస్తావించారు.
తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిన ఆదిత్య 369కి సీక్వెల్ అయిన ‘ఆదిత్య 999’ అనే ప్రాజెక్టే తన వందవ సినిమా అవుతుందని బాలయ్య స్పష్టం చేశారు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్టోరీ బోర్డ్‌తో సహా స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని, త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్ళే ఆలోచన ఉందని తెలిపారు. ‘ఆదిత్య 369’ను తెరకెక్కించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తారని బాలయ్య స్పష్టం చేశారు. బాలకృష్ణ కెరీర్‌లో క్లాసిక్ అనిపించుకున్న సినిమాకు సీక్వెలే వందవ సినిమా కానుండడంతో ఇప్పట్నుంచే ఈ ప్రాజెక్టు ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు.


