చిట్‌చాట్ : మిస్తీ చక్రవర్తి – ‘కొలంబస్’ తరహా కథ ఇప్పటివరకూ రాలేదు!

చిట్‌చాట్ : మిస్తీ చక్రవర్తి – ‘కొలంబస్’ తరహా కథ ఇప్పటివరకూ రాలేదు!

Published on Oct 19, 2015 4:25 PM IST

Mishti-Chakraborty
‘చిన్నదాన నీ కోసం’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన బెంగాలీ భామ మిస్తీ చక్రవర్తి, తాజాగా ‘కొలంబస్’ అనే సినిమాతో మనముందుకు వస్తున్నారు. సుమంత్ అశ్విన్, శీరత్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రమేష్ సామల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రేక్షల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మిస్తీ చక్రవర్తిరో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) తెలుగులో మొదటి సినిమా ‘చిన్నదాన నీ కోసం’, రెండో సినిమా ‘కొలంబస్’.. ఇలా రెండూ ఒకే జానర్లో ఉన్న సినిమాలను ఎంచుకున్నారు. ప్రత్యేక కారణం?

స) ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. నిజానికి ఈ రెండు సినిమాలూ నేను కోరి ఎంచుకున్నవి కావు. ఆ కథలే నా వద్దకు వచ్చాయి. తెలుగు సినిమా అంటే మొదట్నుంచీ మంచి అభిప్రాయం ఉండేది. అలాంటి నేపథ్యంలోనే నితిన్ సరసన ‘చిన్నదాన నీ కోసం’లో నటించే అవకాశం రాగానే కథ నచ్చి వెంటనే ఓకే చేసేశా. ఆ తర్వాత ఈ ‘కొలంబస్’ ఆఫర్ వచ్చింది. రెండూ ఒకే జానర్ సినిమాలైనా, వేటికవే భిన్నమైనవి.

ప్రశ్న) ‘కొలంబస్’ సినిమా ఎలా ఉండబోతోంది?

స) నన్నడిగితే ‘కొలంబస్’ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిస్తుందని చెప్పగలను. నాకు తెలిసి ఇలాంటి కథను మనం ఇప్పటివరకూ చూసి ఉండం. కథాంశం ఆలోచనే చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం కూడా ఈ సినిమాను అన్ని రకాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుంది. ఫ్యామిలీ, యూత్.. ఇలా అందరూ ఈ సినిమాను చూడొచ్చు.

ప్రశ్న) ట్రైలర్ చూస్తే.. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలా కనిపిస్తోంది. కొలంబస్ అలాంటి నేపథ్యంలో నడుస్తుందా?

స) అలాంటిదే అనుకోండి. పూర్తి ట్రయాంగిల్ లవ్‌స్టోరీలా మాత్రం ఈ సినిమా ఉండదు. ఈ సినిమా ద్వారా మేం చెప్పిన పాయింట్ ఏంటనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే!

ప్రశ్న) హీరో సుమంత్ అశ్విన్ గురించి చెప్పండి?

స) సుమంత్ అశ్విన్ సూపర్బ్ యంగ్ టాలెంట్. సెట్లో కూడా చాలా సరదాగా ఉంటూ అందరూ కంఫర్ట్‌గా ఉండేలా చూస్తూ ఉంటాడు. నటన పరంగానూ ఇతర నటీనటులతో అతడి ఆలోచనలు పంచుకోవడం చూస్తే యాక్టింగ్‌పై సుమంత్ కమిట్‌మెంట్ కనిపిస్తుంది. ఫ్యూచర్‌లో అతనో పెద్ద స్టార్ అవుతాడు.

ప్రశ్న) తెలుగులో మీకిది రెండో సినిమా. భాష విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

స) తెలుగు భాష ప్రస్తుతం దాదాపుగా అర్థమవుతోంది. మొదటి సినిమాకు తెలుగు పెద్దగా అర్థమయ్యేది కాదు. ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది. మాట్లాడడం కూడా చిన్నగా నేర్చుకుంటున్నా.

ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు?

స) ప్రస్తుతం బాలీవుడ్‌లో వివేక్ ఒబెరాయ్ హీరోగా రూపొందుతోన్న ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ అనే సినిమాలో నటిస్తున్నా. తెలుగులో కొన్ని అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే మరో తెలుగు సినిమా కూడా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు