ప్రత్యేక ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – నా సినిమాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ నేనే

ప్రత్యేక ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – నా సినిమాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ నేనే

Published on Jan 20, 2015 7:30 PM IST

Sundeep_Kishan
మనం ఎటువంటి సినిమాలలో నటించాలనుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులు కోరుకునే సినిమాలను అందించడం ముఖ్యం. ప్రస్తుతం ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ & కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే, కమర్షియల్ సినిమా విత్ న్యూ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాను అంటున్నారు యువ హీరో సందీప్ కిషన్. ‘ప్రస్థానం’, ‘గుండెల్లో గోదారి’, ‘డి ఫర్ దోపిడీ’, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఇలా వైవిధ్యమైన సినిమాలతో ప్రయాణం చేస్తున్నారు. తాజాగా కన్మణి దర్శకత్వంలో సందీప్ నటించిన ‘బీరువా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ తో సందీప్ ప్రత్యేకంగా సంభాషించారు. ‘బీరువా’ గురించి, తన కెరీర్ గురించి సందీప్ చెప్పిన విశేషాలు మీకోసం…

ప్రశ్న) ‘బీరువా’తో ఫ్రెండ్షిప్ చేయడానికి కారణం ఏంటి..?

స) సినిమాలో హీరో సంజుకి బీరువా బెస్ట్ ఫ్రెండ్. చిన్నతనంలో తప్పు చేసిన ప్రతిసారి తండ్రి నుండి తప్పించుకోవడానికి బీరువాలో దాక్కుంటాడు. తను కనపడకపోతే ఇంట్లో వాళ్లు పడే హైరానా.. వగైరా.. వగైరా.. ‘బీరువా’ కీ హోల్ నుండి ప్రపంచం అతనికి కొత్తగా కనిపిస్తుంది. చివరకు, తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ‘బీరువా’ను సంజు ఎలా ఉపయోగించుకున్నాడు అనేది సినిమా కథ. సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.

ప్రశ్న) దర్శకుడు కన్మణి ఈ పాయింట్ చెప్పినప్పుడు మీకు ఎలా ఫీలయ్యారు..?

స) మొదట కన్మణి కథను వినడానికి నేను కొత్త సందేహించాను. మా ఇద్దరి అభిరుచులు కలుస్తాయో..? లేదో..? అని .నేను పాయింట్ వినలేదు, కన్మణి కంప్లీట్ కథను వినిపించాడు. తర్వాత జెమినీ కిరణ్ గారు చెప్పడంతో కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. మరో ఆలోచన లేకుండా సినిమాను అంగీకరించాను. ఒక వినూత్నమైన కథను కమర్షియల్ బాణీలో చెప్పడానికి ప్రయత్నించాం. నా కెరీర్లో ఇదొక మంచి సినిమా అవుతుంది.

ప్రశ్న) మీకు చెప్పిన కథను తెరపై ఆవిష్కరించడంలో కన్మణి ఎంత వరకు సక్సెస్ అయ్యారు..?

స) కొందరు కథను అద్బుతంగా నేరేట్ చేసినా, సినిమా తీయడంలో విఫలం అవుతారు. కన్మణి అలా కాదు, నాకు చెప్పిన కథ కంటే 10 రెట్లు బాగా తెరపై ఆవిష్కరించాడు. అతని వర్క్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా సినిమాకు చోటా కె నాయుడు, గౌతమ్ రాజు వంటి టాప్ టెక్నీషియన్లు వర్క్ చేశారు. సినిమా బాగా రావడంలో వారి కృషి ఎంతో ఉంది. సినిమాపై అందరం నమ్మకంగా ఉన్నాం.

ప్రశ్న) చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మరి, ఈ సినిమాకు..?

స) సినిమా సక్సెస్ లో చోటా మామకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి. చోటా మామ హార్డ్ వర్క్, టాలెంట్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్ళింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ఇప్పుడు ‘బీరువా’, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘టైగర్’ సినిమాలకు చోటా మామ సినిమాటోగ్రఫీ పెద్ద అసెట్. నేను సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన సమయంలో మావయ్య సహాయం కోరలేదు. హీరో అయిన తర్వాత ఓ సినిమా చేసిపెట్టమని అడిగాను.

ప్రశ్న) ఉషా కిరణ్ మూవీస్ & ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ వంటి రెండు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు నిర్మించిన ‘బీరువా’ సినిమాలో నటించడం పట్ల మీ స్పందన..?

స) ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈటీవీ, జెమినీ టీవీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి సినిమా ఇది. అందులో నేను హీరో కావడం చాలా సంతోషంగా ఉంది. జెమినీ కిరణ్ గారి ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ను నా హోం బ్యానర్‌గా ఫీలవుతాను. కథపై నమ్మకంతో రెండు అగ్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాయి. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనేది మా లక్ష్యం.

ప్రశ్న) సురభి ఎలా నటించింది..?

స) సురభిలో ది బెస్ట్ క్వాలిటీ హార్డ్ వర్క్. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. సినిమాల పట్ల అమితమైన గౌరవం (జెన్యూన్ రెస్పెక్ట్). అద్బుతంగా నటించింది. భవిష్యత్లో టాప్ హీరోయిన్ అవుతుంది. గతంలో సుశీంద్రన్ దర్శకత్వంలో మేము ఇద్దరం కలిసి ఓ సినిమా చేయాల్సింది. డేట్స్ సమస్య వలన చేయలేకపోయం. ‘బీరువా’ సినిమాతో మా కాంబినేషన్ కుదరడం చాలా హ్యాపీగా ఉంది.

ప్రశ్న) మీది గోల్డెన్ హ్యాండ్ అంటున్నారు. మీతో నటించిన ప్రతి హీరోయిన్ అగ్ర స్థానానికి వెళ్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది..?

స) వేరి హ్యాపీ. వన్ థింగ్, హీరోయిన్లు అనడం కంటే వాళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. రెజినా, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా.. వాళ్ళను స్ట్రగ్లింగ్ డేస్ నుండి గమనిస్తున్నాను. టాలెంట్ తో పాటు కష్టపడే మనస్తత్వం ఉంది. మన స్నేహితులు మంచి పొజిషన్లో ఉండడం కంటే అనందం ఏముంటుంది. ఐ యాం ప్రౌడ్ & హ్యాపీ ఫర్ థైర్ సక్సెస్. ఎవరి సినిమా హిట్ అయినా మేమంతా కలిసి పార్టీ చేసుకుంటాం.

ప్రశ్న) మీ గత రెండు సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. వాటి ఫలితాల నుండి మీరు ఎం నేర్చుకున్నారు..?

స) కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు, ‘జోరు’ సినిమా ప్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ‘రా రా కృష్ణయ్య’ సినిమా బాగానే ఆడింది. కానీ, మేము ఆశించిన విజయం సాదించలేదు. ఇన్ ఫాక్ట్, ‘రా రా కృష్ణయ్య’ సినిమాలో యాక్టింగ్, క్యారేక్టరైజేషన్ బాగుంటాయి. వాటి పరాజయాలకు నేను ఎవరిని నిందించడం లేదు. ఇకపై, నటించే సినిమాల విషయంలో ప్రీ ప్రొడక్షన్ నుండి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి వంద శాతం కృషి చేస్తాను.

ప్రశ్న) మీ సినిమాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు..?

స) నేనే. ప్రతి సినిమా అంగీకరించే ముందు, స్క్రిప్ట్ డిస్కషన్స్ టైంలో ఎక్కువ ఆలోచిస్తాను. ‘అంతలా అలోచించి టెన్షన్ పడకు’ అని చోటా మామ చెప్తూ ఉంటారు. తప్పదు, ఓ మంచి సినిమా కోసం ఆమాత్రం కృషి చేయాలనదే నా ఉదేశ్యం.

ప్రశ్న) కమర్షియల్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు.. మీ ఛాయిస్ ఏది..?

స) నా ఛాయిస్ కంటే ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. ప్రస్తుతం ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ & సినిమాలో కొత్తదనం కోరుకుంటున్నారు. అలాగే, నన్ను నమ్మి నిర్మాతలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అందుకే, కమర్షియల్ సినిమా విత్ న్యూ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలలో నటించాలని కోరుకుంటున్నాను. క్యారేక్టరైజేషన్, కథ, కథనాలు బాగుండాలి. నాపై నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు వినోదం అందించడమే నా ప్రాధాన్యత. నేను నిర్మాతగా మారిన తర్వాత నాకు నచ్చిన సినిమాలు చేస్తాను.

ప్రశ్న) తమిళ హీరోలు ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి, ఒకటే రోజున రెండు భాషలలో విడుదల చేస్తున్నారు. మీ సినిమాలను కూడా తమిళంలో డబ్ చేస్తే బాగుంటుందేమో..?

స) మంచి సినిమాలను ఆదరించడం మన తెలుగు ప్రేక్షకుల గొప్పదనం. ఒక సినిమా బాగుంటే, అది స్ట్రెయిట్ సినిమానా లేక డబ్బింగ్ సినిమానా అని ఆలోచించరు. తమిళంలో ఆ సంస్కృతి లేదు. వాళ్ళ సినిమాలను, నేటివిటీని ఎక్కువ ప్రేమిస్తారు. త్వరలో తమిళ ప్రేక్షకులలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. వస్తుందనే నా నమ్మకం.

ప్రశ్న) మీ నెక్స్ట్ సినిమా ‘టైగర్’ ఫస్ట్ లుక్ టీజర్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించారు..?

స) ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ‘టైగర్’ అంటే అందరూ మాస్ హీరోఇజం అనుకుంటున్నారు. ‘టైగర్’ అనే పదంలో ఓ ఎటకారం కూడా ఉంది. దాన్ని మేము చూపించబోతున్నాం. న్యూ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్’.

ప్రశ్న) చివరగా, ‘బీరువా’ సినిమా గురించి ప్రేక్షకులకు ఎం చెప్తారు..?

స) 6 నుండి 60 సంవత్సరాల వయసు గల ప్రేక్షకులందరినీ ‘బీరువా’ సినిమా అలరిస్తుంది. హై ఎనర్జీ కామెడీతో సినిమాను తెరకెక్కించాం. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తరహాలో నా కెరీర్లో మరో విజయవతమైన సినిమా అవుతుంది. యాక్టర్ గా ఓ కొత్త సందీప్ కిషన్ ను ఈ సినిమాలో చూస్తారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరిని ‘బీరువా’ నవ్విస్తుంది.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు