ఇంటర్వ్యూ : ధన్‌రాజ్ – ‘జబర్దస్త్’ వల్లే నిర్మాతనయ్యా..!

ఇంటర్వ్యూ : ధన్‌రాజ్ – ‘జబర్దస్త్’ వల్లే నిర్మాతనయ్యా..!

Published on May 5, 2015 5:30 PM IST

dhan-raj
ధన్‌రాజ్.. వైవిధ్యమైన డైలాగ్ మాడ్యులేషన్‌తో, విలక్షణమైన హావభావాలతో సినీ పరిశ్రమలో కమెడియన్‍గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ‘జబర్దస్త్’ అనే కామెడీ షో తర్వాత ‘ధనాదన్ ధన్‌రాజ్‌’గా అందరికీ సుపరిచితులైపోయారు. దాదాపుగా డెబ్బై సినిమాల్లో నటించిన ఆయన తాజాగా నిర్మాతగానూ మారారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణతో కలిసి ధనరాజ్‌ ‘ధనలక్ష్మి తలుపు తడితే..!’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాను నిర్మాతగా మారి ప్రారంభించిన ఈ కొత్త ప్రయాణం పట్ల ధన్‌రాజ్‌ చెప్పిన విశేషాలు..

ప్రశ్న) జబర్దస్త్ మీ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చింది?

స) నాకు ఎన్నో సినిమాలు ఇవ్వలేకపోయిన పేరును జబర్దస్త్ ప్రోగ్రామ్ తెచ్చిపెట్టింది. ప్రతీ ఒక్కరూ నన్ను గుర్తు పడుతున్నారు. నేను ఏ రకమైన పాత్రనైనా చేయగలననే నమ్మకాన్ని నాకు, సినీ పరిశ్రమకు జబర్దస్తే కలిగించింది. డబ్బుల పరంగానూ జబర్దస్త్ ద్వారానే ఎక్కువ సంపాదించా. జబర్దస్తే లేకపోతే నేను ఈ సినిమాను నిర్మించేవాణ్ణి కాదు.

ప్రశ్న) ఇప్పుడిప్పుడే నటుడిగా సెటిల్ అవుతున్న మీరు నిర్మాతగా మారడానికి గల కారణం.?

స) నిర్మాత అనే ఫీల్ చాలా కొత్తగా ఉందండీ. నేనీ స్థాయికి వస్తానని ఏరోజూ అనుకోలేదు. సినీ పరిశ్రమ గురించి ఏమీ తెలియని తనంలో హీరో అయిపోదామని హైద్రాబాద్ వచ్చా. జేబులో రుపాయి లేని రోజు కూడా అనుభవించా. ఓ హోటల్‌లో సర్వర్‌గా కూడా పనిచేసిన నేను, ఈ రోజు ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే అది సినిమా వల్లే. ఎక్కడైతే డబ్బులు సంపాదించానో.. అక్కడే మళ్ళీ ఖర్చు పెడుతున్నా. ‘ధనలక్ష్మి తలుపు తడితే..!’ ద్వారా ఇండస్ట్రీ మళ్ళీ నాకు డబ్బులు ఇస్తుందనే నమ్మకం ఉంది.

ప్రశ్న) ఈ వయసులోనే నిర్మాతగా మారిపోయారు. డబ్బుల గురించి భయం లేదా?

స) ఇందాకే చెప్పినట్టు ప్యాషన్‌తోనే ప్రొడ్యూసర్‌ గానూ మారాను. అయితే ఒక్కడినే ఓ సినిమా తీసేంత స్థాయి నాకు లేదు. అమెరికాలో ఉండే నా ఫ్రెండ్స్ ప్రసాద్‌ మల్లు, ప్రతాప్‌ భీమిరెడ్డి నాతో పాటు డబ్బులు పెట్టారు. ఇక మేమందరం ఓ 50శాతం పెడితే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మరో 50శాతం బడ్జెట్ పెట్టారు. ఆయన సపోర్ట్‌తో ఈ సినిమాను అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న టైమ్‌కల్లా పూర్తి చేయగలిగాం.

ప్రశ్న) ఈ సినిమాను మీరే నిర్మించడానికి కారణం?

స) ఈ సినిమాలో నేను ఓ మేజర్‌ రోల్ మాత్రమే చేస్తున్నా. నాది లీడ్‌రోల్ కాకపోయినా ఈ సినిమాను నిర్మించడానికి గల కారణం దర్శకుడు సాయి అచ్యుత్. అచ్యుత్ నాకో మంచి మిత్రుడు. ఎన్నో అవకాశాలు వచ్చినా నాకోసమే ఇంతకాలం ఆగాడు. గతంలో మా ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా లాంచ్ అయినా అది ఆగిపోయింది. ఇక నేనే నిర్మాతగా మారి, నాకున్న బడ్జెట్, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తెరకెక్కించా. ఈ సినిమా కథ అద్భుతంగా ఉంది. ఇలాంటి కథలు తెరకెక్కినప్పుడే ఎంతో మంది టాలెంట్ ఉన్నవాళ్ళు బయటకొస్తారు. కొత్త కథలను తెరకెక్కించడానికి మనవాళ్ళూ ధైర్యం చేస్తారు.

ప్రశ్న) ‘ధనలక్ష్మి తలుపు తడితే..!’ సినిమా గురించి చెప్పండి?

స) ‘ధనలక్ష్మి తలుపు తడితే..!’ అనేది ఓ డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కిన సినిమా. 2 గంటల పాటు నవ్విస్తూనే థియేటర్లో కూర్చోపెడుతుంది. నలుగురు ఫ్రెండ్స్ జీవితంలోకి ధనలక్ష్మి( డబ్బు) ప్రవేశిస్తే.. వారి స్నేహం ఎలా ప్రభావితమయింది? డబ్బు వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింనేది సినిమా కథ. విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే కథ.

ప్రశ్న) ధనలక్ష్మి తలుపు తడితే సినిమా హైలైట్స్ ఏంటి?

స) ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే కథే అండీ. హిలేరియస్‌గా ఉంటూనే థ్రిల్‌కి గురి చేస్తుందీ సినిమా. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రముఖ యువ హీరో స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేశాం. చాలా రిచ్‌గా ఆ పాటను తెరకెక్కించాం. ఆడియో రిలీజ్ రోజు ఆ హీరో ఎవరన్నది తెలియజేస్తాం. ఆ పాట కచ్చింతగా సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుంది.

ప్రశ్న) ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఇంకా ఏమేం సినిమాలు చేస్తున్నారు?

స) ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే 22న ఆడియోను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నీ కుదిరితే జూన్ మొదటివారంలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం నాకు సెట్ అయ్యే పాత్రలన్నీ చేస్తూనే ఉన్నా. మళ్ళీ సినిమాను నిర్మిస్తానా లేదా అన్నది ఈ సినిమా విడుదల తర్వాతే చెప్పగలను. నటనను మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టేది లేదు.

మే 7న ధన్‌రాజ్ తన పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా ఆయనకు అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూ ముగించాం. ధన్‌రాజ్ మొదటిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే..!’ మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

ధనలక్ష్మి తలుపు తడితే గురించి ధనరాజ్ చెప్పిన సంగతులు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు