ఇంటర్వ్యూ : ఘిబ్రాన్ – ‘రన్ రాజా రన్’ సంగీత దర్శకుడు

ఇంటర్వ్యూ : ఘిబ్రాన్ – ‘రన్ రాజా రన్’ సంగీత దర్శకుడు

Published on Jul 18, 2014 6:00 PM IST

Ghibran
తన సంగీతంతో లోకనాయకుడు కమల్ హసన్ ను మెప్పించిన యువ ప్రతిభాశాలి ఘిబ్రాన్. ప్రస్తుతం కమల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘విశ్వరూపం-2’, ‘ఉత్తమ విలన్’ చిత్రాలకు ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. కమల్ నటిస్తున్న దృశ్యం రీమేక్ కి కూడా అతడే సంగీత దర్శకుడు. తెలుగులో శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో సమావేశం అయ్యారు ఘిబ్రాన్. మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఘిబ్రాన్ సమాధానం ఇచ్చారు. ఆ విశేషాలు 123తెలుగు.కాం పాఠకుల కోసం..

ప్రశ్న) ‘రన్ రాజా రన్’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఎలా వచ్చింది..?

స) దర్శకుడు సుజీత్ నా తోలి సినిమా ‘వాగై సోడా వా'(నేషనల్ అవార్డు పొందిన చిత్రం) పాటలు విన్నాడు. అతనికి బాగా నచ్చాయి. ఇటివల నేను కంపోజ్ చేసిన ధనుష్ ‘నైయ్యాండి’ పాటలు కూడా నచ్చాయి. నిర్మాతలకు సుజీత్ నా పాటలు వినిపించారు. వారికి కూడా నచ్చడంతో ‘రన్ రాజా రన్’ చిత్రానికి పని చేసే అవకాశం వచ్చింది.

ప్రశ్న) ‘రన్ రాజా రన్’ సినిమా పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. తెలుగులో తోలి సినిమాతో మీ స్టైల్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారా..?

స) నేను ఇప్పటివరకు మోడరన్ సినిమా చేయలేదు. మోడరన్ సినిమా చేయాలి అనుకుంటున్న సమయంలో సుజీత్ ‘రన్ రాజా రన్’ కథతో నా దగ్గరకు వచ్చాడు. సంగీతంలో నాకు పూర్తి స్వేఛ్చను ఇచ్చాడు. కొత్త తరహా సంగీతం పట్ల సుజీత్ కి ఆసక్తి ఎక్కువ. చాలా ఎంకరేజ్ మెంట్ ఇచ్చాడు. అందుకే పాటలు అంత బాగా వచ్చాయి.

ప్రశ్న) ‘రన్ రాజా రన్’ ఆల్బంలో మీ ఫేవరెట్ సాంగ్..?

స) నాకు సినిమాలో అన్ని పాటలు ఇష్టమే. ప్రతి పాట కొత్తగా చేయాలని ట్రై చేశాం. స్వతహాగా నాలు మెలోడీ పాటలంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఒకే మెలోడీ పాట కంపోజ్ చేసే అవకాశం వచ్చింది. ‘వద్దంటూనే నేను వద్దంటూనే ‘ పాట నా ఫేవరెట్.

ప్రశ్న) తెలుగు సినిమాకి పని చేయడం ఎలా అనిపించింది..?

స) నా వైఫ్ విజయవాడ అమ్మాయి. తెలుగు అర్ధం అవుతుంది. మాట్లాడలేను. తను ఎప్పటి నుంచో తెలుగు సినిమాకి సంగీతం చేయమని కోరుతుంది. ‘రన్ రాజా రన్’తో తన కోరిక నెరవేరింది. నిర్మాతలు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఫ్రెండ్లీగా మావ్ అయ్యారు. ఇక్కడ సినిమా వాతావరణం చాలా బాగుంది. ఇతర నిర్మాతలు, దర్శకులు కొందరు కలిశారు. భవిష్యత్ లో మరిన్ని తెలుగు సినిమాలకు సంగీతం అందించాలి అనుకుంటున్నాను .

ప్రశ్న) కమల్ హాసన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?

స) నేను చిన్నప్పటి నుండి కమల్ హాసన్ గారి అభిమానిని. ఆయన సినిమాకి అవకాశం రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక క్షణం టెన్షన్ కూడా పడ్డాను. కానీ, కమల్ గారు చాలా కూల్ గా ఉంటారు. ప్రతి సన్నివేశం వివరించి చెప్తారు. ఆయనతో వర్క్ చాలా సరదాగా సాగిపోతుంది.

ప్రశ్న) ‘ఉత్తమ విలన్’ కోసం సంగీతంలో ప్రయోగాలు చేస్తున్నారని విన్నాం..? మలై ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారా..?

స) ‘ఉత్తమ విలన్’ సినిమా ఫ్లాష్ బ్యాక్ 18వ శతాబ్దంలో జరుగుతుంది. ఆ సన్నివేశాలకు అలనాటి సంగీతం వినిపించాలని నిర్ణయించుకున్నాం. రీసెర్చ్ చేశాం. చివరకు మలై ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నాం. సౌత్ ఇండియన్ కల్చర్ ప్రతిభింబించేలా ఉంటుంది ఆ సంగీతం. మిగతా సినిమా మొత్తం ట్రెండీ మ్యూజిక్ ఉంటుంది.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

స) తమిళంలో విశ్వరూపం-2, ఉత్తమ విలన్, దృశ్యం, అమరకావ్యం చిత్రాలకు సంగీతం అందించాను. అవి విడుదలకు రెడీ అవుతున్నాయి. తెలుగులో ఒక సినిమా చర్చల దశలో ఉంది. త్వరలో తెలుగు సినిమా వివరాలు వెల్లడిస్తాను. అని చెప్పారు.

తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి అల్ ది బెస్ట్ చెప్పి ఇంటర్వ్యూని ముగించాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు