ఇంటర్వ్యూ : ప్రదీప్ కుమార్ – త్వరలోనే ‘ప్రమాదం’ సీక్వెల్ కూడా ఉంటుంది!

ఇంటర్వ్యూ : ప్రదీప్ కుమార్ – త్వరలోనే ‘ప్రమాదం’ సీక్వెల్ కూడా ఉంటుంది!

Published on Jun 23, 2015 3:45 PM IST

Pradeep-Kumar
సంబిత్, మౌసమి, స్నేహ, ఎల్లి ప్రధానపాత్రల్లో అర్రా మూవీస్ బ్యానర్ రూపొందించిన సినిమా ‘ప్రమాదం’. ప్రదీప్ దాస్ -తపస్ జెనాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రదీప్ కుమార్ అర్రా నిర్మాత. శ్రేయాస్ మీడియా ఈ సినిమాను విడుదల చేయనుంది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రదీప్ కుమార్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా మీ నేపథ్యం, సినిమాల్లోకి ఎలా వచ్చారో చెప్పండి?

స) మేము తెలుగు వాళ్ళమే అయినా, నేను పుట్టి పెరిగిందంతా ఒడిశాలోనే! గత కొన్నేళ్ళుగా మెడికల్ రిటైల్ బిజినెస్‌లో ఉన్నా. సినిమాలపై ఇష్టంతో ఇటువైపొచ్చా. సినిమా తీయాలన్న ఆలోచన రాగానే, నా మాతృభాషైన తెలుగులోనే సినిమా తీస్తే బాగుంటుందనిపించింది. ముందుగా ఓ లవ్‌స్టోరీ తీద్దామనుకున్నా, ఇక్కడికొచ్చాక మాకున్న బడ్జెట్ పరిమితుల్లో ఓ హర్రర్ సినిమా అయితే బెటరని ‘ప్రమాదం’ సినిమాను రూపొందించాం.

ప్రశ్న) ‘ప్రమాదం’ సినిమా గురించి చెప్పండి?

స) ఇదొక అవుట్ అండ్ అవుట్ హర్రర్ సినిమా. హర్రర్‌కి కామెడీ జతకలవడమనే ట్రెండ్‌లో కంప్లీట్ హర్రర్‌గా వస్తున్న ఈ సినిమాను చూస్తూ భయపడకుండా ఉండలేం. పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కూడా రాత్రైతే ఈ సినిమా పనులను ఆపేసేది. ఈ స్థాయిలో భయపెట్టే సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. కచ్చితంగా ప్రమాదం అందరినీ భయపెట్టే సినిమా అవుతుందని నమ్మకంగా ఉంది!

ప్రశ్న) హర్రర్ సినిమా అంటున్నారు, మరి గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయా?

స) ఈ సినిమాకు చాలా తక్కువగానే గ్రాఫిక్స్ వాడాం. న్యాచురల్‌గా ఏయే రకంగా భయపెట్టొచ్చే వాటన్నిటి ద్వారానే భయపెట్టే ప్రయత్నం చేశాం. షూటింగ్ అంతా అరకు పరిసర ప్రాంతాల్లోనే జరిపాం. అక్కడి వాతావరణంలోని సైలెన్స్‌ను ఈ సినిమాలో భయపెట్టడానికి వాడుకున్నాం.

ప్రశ్న) మొదటి సినిమాకే హర్రర్ బ్యాక్‌డ్రాప్‌ ఎంచుకున్నారు. రిస్క్ అనిపించలేదా?

స) నేనూ మొదటి సినిమాయే హర్రర్ చేయాలనుకోలేదు. ముందో లవ్‌స్టోరీ ద్వారా ఇండస్ట్రీకి వద్దామనుకున్నాం. అయితే మాకున్న బడ్జెట్ పరిమితుల వల్ల హర్రర్ సినిమా చేశాం. ఒక్కసారి అంతా పూర్తయ్యాక చూసుకుంటే నాకైతే ఈ సినిమా రిస్క్‌లా అనిపించలేదు.

ప్రశ్న) ‘ప్రమాదం’లో ఆడియన్స్ ని థ్రిల్ చేసే హైలైట్స్ ఏంటి?

స) ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే హర్రర్ పార్టే. దర్శకుడు నాకీ కథ చెప్పినపుడే ఈ సినిమా అందరినీ భయపెట్టే సినిమా కాగలదని ఊహించా. టైటిల్‌లో చెప్పినట్టు ‘ప్రమాదం.. చావు 100%’ అన్నట్టు ఈ సినిమా చూసే వారికి భయం 100% పుడుతుందని చెప్పొచ్చు.

ప్రశ్న) సినిమాను ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు? తరువాతి ప్రాజెక్టు ఏంటి?

స) శ్రేయాస్ మీడియా వారు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సుమారు వంద థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం. ఇక ఈ సినిమా తర్వాత ప్రమాదంకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేశాం. త్వరలోనే ‘ప్రమాదం 2’ మొదలుపెడతాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు