ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – ‘పండగ చేస్కో’.. ఓ పండగ లాంటి సినిమా!

ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – ‘పండగ చేస్కో’.. ఓ పండగ లాంటి సినిమా!

Published on May 18, 2015 8:20 PM IST

Rakul-Preet-Singh
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా విజయంతో తెలుగులో పాగా వేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అతి కొద్దికాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ‘లౌక్యం’ హిట్ తర్వాత ‘కిక్ 2’, ‘పండగ చేస్కో’, రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా, ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమా.. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ సినిమాల్లో రామ్ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘పండగ చేస్కో’ ఈ నెలాఖర్లో విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా.. ‘పండగ చేస్కో’ విశేషాల గురించి చెప్పండి?

స) ‘పండగ చేస్కో’.. ఈ వేసవిలో విడుదల కానున్న ఓ పండగ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఓ క్రేజీ కమర్షియల్ సినిమాకు ఉండే అన్నిహంగులు ఉంటూనే ఫ్యామిలీస్‌కి కూడా బాగా కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఇందులో ఉన్నాయి. రామ్ ఎనర్జీ, గోపీచంద్ మలినేని మార్క్ రెండూ కలిసిన పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ ‘పండగ చేస్కో’ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏ పండగలూ లేకున్నా, ఈ సినిమాతో థియేటర్ల ముందు పండగ వాతావరణం నెలకొంటుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఎంటర్‌టైన్ చేయబోతోంది?

స) ఈ సినిమాలో దివ్య అనే పేరుగల పర్యావరణ ప్రేమికురాలి పాత్రలో కనిపిస్తా. మొక్కలన్నా, చెట్లన్నా ఎంతో ప్రేమ కలిగి ఉండే ఈ తరహా పాత్ర తెలుగులో పెద్దగా రాలేదనే చెప్పాలి. ఎవరైనా చిన్న మొక్కను తెంపేసినా వారిపై విపరీతమైన కోపంతో రగిలిపోయే ఈ పాత్రను చూసినప్పుడు అందరూ కచ్చితంగా నవ్వుకుంటారు. ఎక్కడా నేను నవ్వకుండా, నవ్వించే ప్రయత్నం చేయకుండా కూడా ప్రేక్షకుడిని నవ్వేలా చేయగలగడం ఈ పాత్ర ప్రత్యేకత.

ప్రశ్న) అతి కొద్దికాలంలో వరుస అవకాశాలతో బిజీ అయిపోవడం ఎలా ఉంది?

స) చాలా హ్యాపీగా ఉంది. ఏ దర్శకులైనా మనల్ని నమ్మితేనే సినిమాలను ఆఫర్ చేస్తుంటారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా నటించేందుకు మొదట్నుంచీ కష్టపడుతూనే ఉన్నా. ఆ కష్టమే ఈ అవకాశాలను తెచ్చిపెడుతుందని అనుకుంటా. ఒక్కో సినిమాకూ నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తూన్నా. నేర్చుకోవడమనేది ఒక్కరోజుతో ఆగిపోదు. అది నిరంతరం జరిగితేనే ఎక్కడైనా నిలబడగలమని నా నమ్మకం.

ప్రశ్న) ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు?

స) అదంతా నా మేనేజర్‌నే అడగాలి. నేనైతే ఈ డేట్స్ అడ్జస్ట్ చేయడం వంటి విషయాల్లో చాలా వీక్. స్క్రిప్ట్ వినడం, అది నచ్చితే ఆ సినిమా గురించి ఆలోచించడం, డేట్స్ కుదిరితే నటించడం ఇంతవరకే నా పని. ఆ డేట్స్ మొత్తం నా మేనేజర్ చూసుకుంటాడు. ‘పండగ చేస్కో’, ‘కిక్ 2’ ఈ రెండు సినిమాలను ఒకేసారి చేశా. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల సినిమాలు కూడా ఒకేసారి చేస్తున్నా. అన్నీ సరిగ్గా కుదిరినప్పుడే ఇలా రెండు సినిమాలూ ఒకేసారి చేయగలం. నా వరకూ సరైన సమయాల్లో ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్ళడం కలిసొచ్చింది.

ప్రశ్న) మళ్ళీ ‘పండగ చేస్కో’ దగ్గరికి వస్తే.. రామ్‌తో కలిసి చేయడం ఎలా ఉంది?

స) యాక్టింగ్, డ్యాన్సుల్లో రామ్ ఎనర్జీని అందుకోవడం చాలా కష్టం. మొదట రామ్‌తో డ్యాన్స్ అంటే కొంత ఒత్తిడికి గురయ్యా. అయితే ఆయనిచ్చిన సలహాలు ఫాలో అయ్యాక డ్యాన్స్ ఈజీగా అనిపించింది. మా ఇద్దరి పెయిర్ సినిమాలో కలర్‌ఫుల్‌గా ఉంటుంది.

ప్రశ్న) దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి చెప్పండి?

స) గోపీచంద్ మలినేని గారు చూడ్డానికి చాలా క్లాస్‌గా కనిపిస్తారు కానీ ఆలోచనలన్నీ పక్కా మాస్. ఓ కమర్షియల్ సినిమాకు ఏయే అంశాలు ప్లస్ అవుతాయో వాటన్నింటినీ మైండ్‌లో ఫిక్స్ చేసుకున్నట్టనిపిస్తుంటుంది. ఇంతమంది స్టార్స్‌తో కలిపి ఓ సినిమా తీయాలంటే ఎంతో ఓపిక కావాలి. నేను చూసిన వ్యక్తుల్లో చాలా కొద్ది మందికి మాత్రమే గోపీచంద్ గారికి ఉన్నంత ఓపిక ఉంది.

ప్రశ్న) గ్లామర్ పాత్రలపై మీ అభిప్రాయం?

స) నిజం చెప్పాలంటే.. గ్లామర్ అనే పదానికి అసలైన అర్థం మారిపోయింది. అందంగా కనిపించడం, పాత్రకు తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవడం లాంటివి గ్లామర్ కిందకి వస్తాయి. అంతేకానీ ఎక్స్‌పోజింగ్‌ను గ్లామర్ అనలేం. నా వరకు నేను ఎక్స్‌పోజింగ్‌కు దూరం. పాత్ర అవసరం మేరకు గ్లామరస్‌గా కనిపించడానికి మాత్రం వెనుకాడను.

ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలు ఓకే చేశారు?

స) ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల సినిమాల్లో హీరోయిన్‌గా నటించేందుకు సిద్ధమయ్యా. రేపే రామ్ చరణ్ సినిమా షూటింగ్‌లో జాయినవుతున్నా. ఇక ఎన్టీఆర్ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇవేకాక ఇంకా చాలా అవకాశాలే వస్తున్నాయి. డేట్స్ అడ్జస్ట్ అయ్యాక గానీ ఆ సినిమాల గురించి చెప్పలేను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు