ఇంటర్వ్యూ : సుధాకర్ – నాగరాజుగా నవ్వించా, ఇప్పడు జాజ్ రాజుగా అలరిస్తాను.

ఇంటర్వ్యూ : సుధాకర్ – నాగరాజుగా నవ్వించా, ఇప్పడు జాజ్ రాజుగా అలరిస్తాను.

Published on Dec 2, 2014 4:25 PM IST

Sudhakar-Komakula
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో నాగరాజుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న నటుడు సుధాకర్. ఇప్పుడు సుధాకర్ హీరోగా నటించిన సినిమా ‘ఉందిలే మంచికాలం ముందు ముందున’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుధాకర్ తో కాసేపు ముచ్చటించి ముందున్న మంచికాలం విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న) ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత అంత గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి.?

స) లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ చేసిన నాగరాజు పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా నాగరాజు అని పిలుస్తూ ఉంటారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత మళ్ళీ అలా గుర్తుండిపోయే సినిమా లేదా అలా నిలిచిపోయే ఓ పాత్ర చెయ్యాలనే ఉద్దేశంతో కొద్దిగా గ్యాప్ వచ్చింది. నేను అనుకున్న పాత్ర ఈ సినిమాలో వచ్చింది, చేసాను. ఈ సినిమాలో నేను చేసిన జాజ్ రాజు పాత్ర కూడా అందరి మదిలో నిలిచిపోతుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?

స) ఈ సినిమాలో నేను జాజ్ రాజుగా కనిపిస్తాను. మాస్ లుక్ తో చాలా జోవియల్ గా నవ్విస్తూ ఉండే పాత్ర నాది. పగలేమో ఆటో నడుపుతూ, రాత్రి పూట పెళ్ళిళ్ళలో జాజ్ బ్యాండ్ పేరుతో ఆర్కెస్ట్రా చేస్తుంటాను. ఎప్పటికైనా పెద్ద రాక్ స్టార్ అయిపోవాలనేది కల, ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి అయిన జాజ్ రాజు ఏం చేసాడు అనేది మీరు వెండితెరపై చూడాలి..

ప్రశ్న) మరి నాగరాజుకి – జాజ్ రాజుకి ఉన్న తేడా ఏమిటి.?

స) నాగరాజు పాత్ర ఏదో చెయ్యాలని అనుకుంటున్నా చెయ్యకుండా బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడి పాత్ర. అదే జాజ్ రాజుకి ఒక లక్ష్యం ఉంటుంది. అందరితో సరదాగా ఉంటూనే తన పనిపై ధ్యాస పెట్టే కుర్రాడి పాత్ర. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ లో నాగరాజు ప్రేక్షకులను నవ్విస్తే, ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ లో జాజ్ రాజు ప్రేక్షకులను అలరిస్తాడు.

ప్రశ్న) మీకు తల్లి పాత్రలో రాధిక గారు నటించారు, ఆమెతో పనిచేయడం ఎలా ఉందో చెప్పండి.?

స) ఈ సినిమాలో రాధిక, నరేష్ గారి లాంటి పెద్ద స్టార్స్ తో చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక మీరన్నట్టు నాకు తల్లి పాత్రలో రాధిక గారు కనిపిస్తారు. అంత పెద్ద స్టార్ తో చెయ్యడానికి మొదట్లో కాస్త ఇబ్బంది పడినా తర్వాత సెట్ అయిపోయాను. రాధిక గారు చాలా కూల్ గా ఉండడమే కాకుండా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి సినిమాలో నటించారు. ఈవెంట్ లక్ష్మీ పాత్రలో కనిపిస్తారు. మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్నీ చాలా కామెడీగా, సరదాగా ఉంటాయి.

ప్రశ్న) ఈ సినిమాలో మిగిలిన పాత్రల గురించి చెప్పండి.?

స) ఈ సినిమా ద్వారా కార్తీక్ అని ఓ యాక్టర్ పరిచయం అవుతున్నాడు. సినిమాలో ధన అనే హాకీ ప్లేయర్ లా కనిపిస్తాడు. ఎప్పటికైనా హాకీ ప్లేయర్ కావాలనుకునే కార్తీక్ ఏమయ్యాడు అనేది సినిమాలో చూడాలి. జాజ్ రాజు, ధన పాత్ర చుట్టూనే ఈ కథ తిరుగుటింది. అలాగే కార్తీక్ ఫాదర్ పాత్రలో నరేష్ కనిపిస్తాడు. అలాగే హీరోయిన్స్ కి కూడా ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

ప్రశ్న) డైరెక్టర్ అరుణ్ దస్యం గురించి చెప్పండి.?

స) డైరెక్టర్ రన్, నేను స్కూల్ ఫ్రెండ్స్.. ఆ తర్వాత ఎవరి స్టడీస్, జాబ్స్ లో బిజీ అయిపోయాం. నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేస్తున్న టైంలో తను కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసాను అని చెప్పాడు. కొద్ది రోజులకి వచ్చి ఓ కథ చెప్పాడు. నా పాత్ర బాగా నచ్చడంతో ఈ సినిమా చేసాను. తను చాలా క్లారిటీతో, ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలను మిక్స్ చేసి ఈ సినిమాని తీసాడు.

ప్రశ్న) ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది.?

స) ఇదొక రియలిస్టిక్ ఫిల్మ్ అని చెప్పాలి. ఈ మధ్య కొన్ని సినిమాల్లో మిస్ అవుతున్న లైఫ్ ఇందులో ఉంటుంది. పాత్రలన్నీ అలా వచ్చి వెళ్ళిపోకుండా, ప్రతి పాత్రకి ఓ కథ ఉంటుంది. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ని చూపిస్తూనే చాలా ఎంటర్టైనింగ్ గా సాగే సినిమానే ఇది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకూ వైజాగ్ లో ఉండే బ్యూటిఫుల్ లోకేషన్స్ ని మాత్రమే చూపించారు. కానీ ఇందులో వైజాగ్ లైఫ్ స్టైల్ ని పూర్తిగా చూపించాము. హుదూద్ వల్ల వైజాగ్ దెబ్బతింది. కానీ త్వరలోనే గతంలో కంటే అందంగా తయారవుతుంది. కొద్ది సంవత్సరాల తర్వాత పాత వైజాగ్ ఎలా ఉండేది అంటే మా సినిమాలోనే చూడాలి.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.? అలాగే ముందు ముందు ఎలాంటి సినిమాలు చెయ్యాలనుకుంటున్నారు.?

స) ప్రస్తుతం రెండు సినిమాలకు ఓకే చేసాను. అవి డిసెంబర్ చివర్లో లేదా జనవరిలో మొదలవుతాయి. ఇక సినిమాలంటే నేను నా ఫ్యామిలీతో కూర్చొని చూసేలా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే పాత్ర బాగుంటే సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి కూడా సిద్దమే..

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి సుధాకర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు