లారెన్స్‌ను అభినందించిన రజనీ!
Published on Sep 10, 2016 6:11 pm IST

rajini-lawarnce
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారి విజయపథంలో దూసుకుపోతోన్న రాఘవ లారెన్స్‌ను తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ డైరెక్టర్స్‌లో ఒకరుగా చెప్పుకోవచ్చు. తాజాగా ఆయన సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను కలిసి తన కొత్త సినిమాల విశేషాలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. ‘కబాలి’ విడుదల తర్వాత కొద్దికాలంగా విశ్రాంతి తీసుకుంటోన్న రజనీని నిన్న ప్రత్యేకంగా కలిసిన లారెన్స్, కొద్దిసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే లారెన్స్ తన తల్లి కోసం గుడి కట్టనుండడం గురించి రజనీ మాట్లాడారట.

తల్లికి గుడి కట్టాలన్న ఆలోచన నచ్చిందని తెలుపుతూ లారెన్స్‌కు రజనీ అభినందనలు తెలిపారట. తనకు అన్నివిధాలా మంచి జరగాలని రజనీ ఆశీర్వదించారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని లారెన్స్ అన్నారు. ప్రస్తుతం లారెన్స్ ‘శివలింగ’, ‘మొట్ట శివ కెట్ట శివ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక రజనీ విషయానికి వస్తే, ఈనెలాఖరు వరకూ విశ్రాంతికే పరిమితం కానున్న ఆయన నెలాఖర్నుంచి రోబో 2 కొత్త షెడ్యూల్‍లో పాల్గొంటారు.

 

Like us on Facebook