బాడీగార్డ్ మొదటగా నేనే చేయాల్సిన సినిమా: వెంకటేష్

బాడీగార్డ్ మొదటగా నేనే చేయాల్సిన సినిమా: వెంకటేష్

Published on Jan 11, 2012 4:45 PM IST

విక్టరీ వెంకటేష్ మరియు త్రిషా జంటగా నటించిన ‘బాడీగార్డ్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 14న భోగి పండుగ రోజున విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలు తెలపడానికి రామానాయుడు స్టుడియోలో విలేఖరుల సమావేశం జరగగా హీరో వెంకటేష్ చెప్పిన ముచ్చట్లు మీకోసం.

ప్ర: బాడీగార్డ్ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు సంతృప్తి పరుస్తుంది అనుకుంటున్నారు?

స: సంక్రాంతి పడుగాకి వస్తున్న కమ్మని విందు భోజనం లాంటి సినిమా అవుతుంది. ఫ్రెష్ లవ్ స్టొరీ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, డ్రామా, యాక్షన్ అన్ని ఉంటాయి. టైట్ స్క్రీన్ప్లే తో సాగుతుంది. సెన్సార్ వారు కూడా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చూసిన వారుకూడా పాజిటివ్ గా చెప్తున్నారు. థియేటర్ కి వచ్చిన ఏ ఒక్క ప్రేక్షకుడిని నిరాశ పరచదు.

ప్ర: ఈ చిత్ర ఆడియో ఇప్పటికే మంచి విజయం సాధించింది. వీటిలో మీకు నచ్చిన పాట ఏమిటి? మరియు చిత్రంలో పాటల చిత్రీకరణ ఎలా ఉంది?

స: నాకు పర్సనల్ గా ‘ఎవ్వరో’ పాటంటే ఇష్టం. మంచి టైమింగ్ తో వస్తుంది. 2 మెలోడి పాటలు కూడా బావున్నాయి అలాగే చాలా రోజుల తర్వాత నా సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది. అది ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు.

ప్ర: బాడీగార్డ్ చిత్రం ఇప్పటికే మూడు భాషల్లో తెరకెక్కింది ఇప్పుడు తెలుగులో మీరు హీరోగా చేస్తున్నారు. ఏమైనా మార్పులు చేసారా?

స: ఈ కథ మొదటగా నా దగ్గరికే వచ్చింది. మా సోదరుడు సురేష్ బాబు కథ వినడం కూడా జరిగింది. కాని పలు కారణాల వల్ల చేయలేకపోయాము. ఈ చిత్ర మలయాళం వెర్షన్ చూడడం జరిగింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొద్దిగా మార్పులు చేయడం జరిగింది. నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా కొద్ది మార్పులు చేసాము. నా సినిమాలలో ఎప్పుడూ ఉండే కామెడీ ఉంటుంది.

ప్ర: ఈ చిత్రంలో మీరు భారీ ఫైట్లు మరియు మాస్ డైలాగులు చెప్పినట్లు ట్రైలర్స్ లో కనిపిస్తుంది. మాస్ కి పెద్దపీట వేసారా?

స: (నవ్వుతూ) అలాంటిదేమీ లేదు. కొన్ని మాత్రమే ఉన్నాయి. కథ డిమాండ్ చేయడంతో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అవి కూడా స్టైలిష్ గా చిత్రీకరించడం జరిగింది. మాస్ డైలాగులు కూడా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. ఇది సున్నితమైన ప్రేమకథ. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మాస్ ప్రేక్షకులను కూడా నిరాశ పరచకుండా రూపొందించాం.

ప్ర: చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని పనితీరు ఎలా ఉంది?

స: గతంలో గోపి తీసిన ‘డాన్ శీను’ చిత్రం చూడడం జరిగింది. బాగా తీసాడు. మంచి కామెడీ టైమింగ్ బాగా తీయగలడు అనిపించింది. నేను ‘లక్ష్మి’ చిత్రం చేసే సమయంలో సోదరుడు సురేష్ బాబు కలవడం జరిగింది. ఆ సమయంలో నేను పలు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాము. ఇప్పుడు కుదిరింది. నేను ఈ వయస్సులో లవ్ స్టొరీ చేసి ప్రేక్షకులను మెప్పించాలంటే అంత సులభం కాదు. దర్శకుడు గోపి తధైన శైలిలో తీసి మెప్పించాడు.

ప్ర: ఈ చిత్రంలోని పాటలు అందమైన లోకేషన్లలో తీసారని విన్నాము. నిజమేనా?

స: అవును. కొన్ని పాటలు విదేశాలలోని అందమైన లోకేషన్లలో చిత్రీకరించడం జరిగింది. కెమెరామెన్ శ్యాం కె నాయుడు బాగా చిత్రీకరించారు. మిగతా టెక్నీషియన్స్ లో కోన వెంకట్ డైలాగులు కూడా బావున్నాయి. నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా ఎక్కడా రాజీపడకుండా తీసారు.

ప్ర: మీ భవిష్యత్తులో చేయబోయే సినిమాలు ఏమిటి?

స: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఈ నెల జనవరి 18 నుండి వైజాగ్ లో షూటింగ్ ప్రారంభమవుతుంది. మెహెర్ రమేష్ తో చేయబోయే సినిమా మార్చిలో చేయబోతున్నాం. మరియు నా డ్రీం ప్రాజెక్ట్ వివేకానంద సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. మణిశంకర్ దర్శకత్వం వహిస్తారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం.

 

అశోక్ రెడ్డి.ఎమ్

 

Click For English Version

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు