సమీక్ష : పైసా వసూల్ – రొటీన్ పూరి.. డిఫరెంట్ బాలయ్య

సమీక్ష : పైసా వసూల్ – రొటీన్ పూరి.. డిఫరెంట్ బాలయ్య

Published on Sep 2, 2017 9:30 AM IST
Paisa Vasool movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 1, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : పూరి జగన్నాథ్

నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్

సంగీతం : అనూప్ రూబెన్స్

నటీనటులు : బాలక్రిష్ణ, ముస్కాన్ సేతి, కైరా దత్

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కలయికలో రూపొందిన చిత్రం ‘పైసా వసూల్’ ట్రైలర్, టీజర్లతో మంచి హైప్ తెచ్చుకుంది. తన కెరీర్లో 101వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా తనకు రీలాంచ్ వంటిదని బాలక్రిష్ణ చెప్పడంతో దీనికోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. మరి ఇన్ని భారీ అంచనాల నడుమ ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

బాబ్ మార్లీ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ తన తమ్ముడి మరణానికి కారణమైన ఇండియన్ రా ఏజెన్సీ మీద పగబట్టి భారతదేశంలో అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతుంటాడు. అతనికి కొందరు రాజకీయనాయకుల సపోర్ట్ ఉండటంతో ఇండియన్ రా ఏజెన్సీ పెద్దలు కూడా లీగల్ గా అతన్ని ఏమీ చేయలేక అడ్డదారిలోనే అతన్ని అంతమొందించాలని ప్లాన్ వేసి, అందుకు అనుగుణమైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు.

అలాంటి సమయంలోనే ఎవరన్నా భయం లేకుండా, తెగింపుగా బ్రతికే క్రిమినల్ తేడా సింగ్ (బాలక్రిష్ణ) వాళ్ళ కంటబడతాడు. అతనితో పోలీసులు బాబ్ మార్లీని చంపాలనే డీల్ కుదుర్చుకుంటారు. అలా పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్న తేడా సింగ్ ఏం చేశాడు ? బాబ్ మార్లీ తమ్ముడ్ని ఎవరు చంపారు ? చివరికి బాబ్ మార్లీ ఎలా అంతమయ్యాడు ? అసలు తేడా సింగ్ గతమేమిటి ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమా మొత్తంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశం కథానాయకుడు బాలక్రిష్ణ. బాలయ్య ఇంతకు ముందు సినిమాల్లో కనిపించింది ఒక ఎత్తైతే ఈ 101వ సినిమాలో కనిపించిన విధానం ఇంకో ఎత్తు. తేడా సింగ్ గా ఆయన నటన కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు పూరి ఎలాగైతే పాత్రను రాశారో అలాగే కబడ్డాడు బాలయ్య. ఎప్పుడూ నవ్వుతూ, భయమనేదే లేకుండా, సరదా సరదాగా ఉంటూ, నచ్చింది చేసే క్రిమినల్ గా బాలయ్య మెప్పించాడు. ముఖ్యంగా రౌడీలతో, మాఫియాతో కలబడే సన్నివేశాల్లో ఆయన ముఖ కవళికలు, డైలాగులు, బాడీ లాంగ్వేజ్, డ్యాన్సుల్లో ఎనర్జీ అలరించాయి.

ఇక కథ రెగ్యులర్ కథే అయినప్పటికీ పూరి రాసిన తేడా సింగ్ పాత్ర మూలాన, అందులో బాలకృష్ణ నటించడం వలన సినిమా ఫస్టాఫ్ వరకు పర్వాలేదనిపించేలా సాగిపోయింది. మధ్యలో వచ్చే పాటలు కూడా ఆహ్లాదకరంగా ఉండటం, బాలయ్య చెప్పిన పంచ్ డైలాగులు ప్రేక్షకులకు, అభిమానులకు కొంత ఆహ్లాదాన్నిస్తాయి. బాలకృష్ణ వీరాభిమానులకైతే కొన్ని సన్నివేశాలు, డైలాగులు బాగా నచ్చుతాయి. ఇంటర్వెల్ బ్లాక్, అందులో బాలయ్య పెర్ఫార్మెన్స్ భలేగా అనిపిస్తాయి. సెకండాఫ్లో శ్రియతో బాలకృష్ణ లవ్ ట్రాక్ పూరి స్టైల్లో ఉండి మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొత్త కథ లేకపోవడమే ప్రధాన బలహీనత. పోనీ ఉన్న రొటీన్ కథైనా బలంగా ఉందా అంటే అదీ లేదు. పూరి నేరుగా చెప్పాల్సిన కథను తన స్క్రీన్ ప్లేతో ముందుకు వెనక్కి తిప్పుతూ మ్యాజిక్ చేద్దామని ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ఎక్కడా ఎగ్జైట్మెంట్ అనేదే కలుగలేదు. దీంతో ఏదో పెద్ద దర్శకుడు పెద్ద హీరోతో చేసిన సినిమా చూస్తున్నాం అంతే అనిపించింది. తేడా సింగ్ పాత్ర, బాలయ్య నటన తప్ప కథనంలోని చాలా సన్నివేశాలు పూరి పాత చిత్రాల్లో ఏదో ఒకదాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి. ఇక సినిమాలో కనబడే రౌడీలు, మాఫియా, గన్ ఫైట్స్ అయితే పరమ రొటీన్ గా, బోరింగా అనిపించాయి.

మొదటి అర్థ భాగం బాలయ్య పెర్ఫార్మెన్స్, పంచ్ డైలాగులతో పర్వాలేదనిపించేలా వెళ్ళిపోయినా సెకండాఫ్ మాత్రం పరీక్ష పెట్టినట్టే అనిపించింది. ప్రీ క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి రెగ్యులర్ ట్విస్ట్ రివీల్ అవడం, ఎప్పటిలానే హీరోలోని కొత్త యాంగిల్ బయటపడటం, అభిమానుల కోసం మాత్రమే అన్నట్టు హీరో ఎలివేషన్ జరగడం వంటివి నీరసాన్ని కలిగించాయి.

హీరోయిన్ ముస్కాన్ సేతి సన్నివేశాల్లోగాని, పాటల్లోగాని పెర్ఫార్మెన్స్ తో మెప్పించకపోగా అందంగా కూడా కనబడలేదు. కమర్షియల్ సినిమాలకు ముఖ్యమైన ప్రతినాయకుడి పాత్ర ఈ సినిమాలో అంత బలంగా లేకపోవటంతో, బాలయ్యలోని పవర్, ఊపు స్క్రీన్ మీద పెద్దగా కనబడలేదు. ఈ అంశం సాధారణ ప్రేక్షకులకు ఎలా ఉన్నా బాలకృష్ణ వీరాభిమానులకు కాస్త ఎక్కువ నిరుత్సాహాన్నే కలిగిస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పూరి జగన్నాథ్ పనితనం ఈసారి నిరుత్సాహకరంగా ఉంది. అయన రాసుకున్న కథ కథనాలు రెగ్యులర్ గా ఉండటమేగాక బలహీనంగా ఉన్నాయి. అలాగే ఎప్పుడూ సన్నివేశాల టేకింగ్లో పక్కాగా ఉండే పూరి ఈసారి మాత్రం కొంత పట్టుతప్పినట్టు అనిపించారు. కానీ కథానాయకుడు తేడా సింగ్ పాత్రను మాత్రం పూరి కొంచెం కొత్తగా రాయడమేగాక అందులో బాలయ్యను ఇమిడ్చిన విధానం కూడా ఆకట్టుకుంది. ఆయన రాసిన పంచ్ డైలాగ్స్ ఎప్పటిలాగే విజిల్స్ వేయించాయి.

అనూప్ రూబెన్స్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బాగుంది. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ పర్వాలేదు. బి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. పైసా వసూల్, కొంటె నవ్వు చేబుతోంది వంటి పాటల్లో బాలకృష్ణకు చేసిన కొరియోగ్రఫీ బాగుంది.

తీర్పు :

ఈ ‘పైసా వసూల్’ చిత్రంలో ముందు నుండి చెబుతున్నట్టు బాలయ్య కొత్తగానే కనబడ్డారు కానీ కథ, కథనంలోని సన్నివేశాలు, ట్విస్టులు వంటి ప్రధాన అంశాలు పాతవి పైగా బలహీనమైనవి కావడంతో చాలా మందికి సినిమా కొంచెం నిరుత్సాహకారంగానే అనిపిస్తుంది. అయితే బాలక్రిష్ణ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆయన అభిమానులకు, మాస్ ఆడియన్సుకు మంచి కిక్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కథాకథనాల పరంగా రొటీన్ పూరి, పెర్ఫార్మెన్స్ పరంగా డిఫరెంట్ బాలయ్య అనేలా ఉన్న ఈ చిత్రం కొత్తదనాన్ని కోరుకునేవారికి, మల్టీప్లెక్స్ ఆడియన్సుకి, ఓవర్సీస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు కానీ బాలయ్య అభిమానులకు, కొందరు మాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు