సమీక్ష : బెస్ట్ యాక్టర్స్ – అక్కడక్కడా నవ్వించే యాక్టర్స్.!

Best Actors review

విడుదల తేదీ : 28 ఆగష్టు 2015 

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : అరుణ్ పవర్        

నిర్మాత : కుమార్ అన్నంరెడ్డి 

సంగీతం : జెబి

నటీనటులు : నందు, అభి, మధురిమ, షామిలి, మధు, నవీద్, క్రతీ, కేశ కంబటి…


ఈ మధ్య కాలంలో చిన్న బడ్జెట్ సినిమాలకు దారి చూపిన యంగ్ డైరెక్టర్ మారుతి అతని మారుతి టీం వర్క్స్ సమర్పణలో సినిమా లవర్స్ సినిమా బ్యానర్ పై కుమార్ అన్నంరెడ్డి నిర్మించిన సినిమా ‘బెస్ట్ యాక్టర్స్’, జీవితంలో అనేది ట్యాగ్ లైన్. అరుణ్ పవర్ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో యంగ్ యాక్టర్స్ నందు, అభి, మధు, నవీద్ హీరోలుగా నటించగా, వీరికి జోడీగా మధురిమ, షామిలి, క్రతీ, కేశ కంబటిలు హీరోయిన్స్ గా నటించారు. ఫుల్ కామెడీ విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ బెస్ట్ యాక్టర్స్ ఎంత బాగా ఆక్ట్ చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నందు(నందు), మధు(మధు), అభి(అభి), కృష్ణ(నవీద్)ల కథే ఇది. నందు స్వతహాగా ఫాషన్ డిజైనర్ కావడంతో అమ్మాయిలతో జల్సా చేస్తూ ప్రేమ, పెళ్లి అనే వాటిని అస్సలు నమ్మని కుర్రాడు. మధు ఏమో సాఫ్ట్ వేర్ లో తను కోరుకున్న ప్రమోషన్ రాక, ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమని చెప్పలేక బాధ పడుతుంటాడు. మూడేళ్ళు లవ్ చేసిన అమ్మాయికి పెళ్ళికి నో చెప్పడంతో కృష్ణ శోఖ సముద్రంలో మునిగిపోతాడు. ఇక డైరెక్టర్ అయ్యి ఇండస్ట్రీని మార్చేద్దాం అనుకున్న అభి అవకాశాల కోసం తిరిగి తిరిగి విసుగెత్తిపోతాడు. అలా రకరకాల సమస్యల్లో ఉన్న వీళ్ళంతా మూడ్ చేంజ్ కోసం గోవా వెళ్తారు. అక్కడ మన కృష్ణ మెంటాలిటీకి సరిపోతే మీనాక్షి అయ్యర్(క్రతీ)తో పరిచయం అవుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఇది పక్కన పెడితే,,

గోవాకి వచ్చి అమ్మాయిల వేటలో ఉన్న నందు, మధులకు జయసుధ(మధురిమ), జయప్రద(కేశ కంబటి)లు పరిచయం అవ్వడం, రెండో రోజుకే వారి మధ్య జిల్ జిల్ జిగా జిగా అయిపోవడం జరిగిపోతాయి. కట్ చేస్తే జయసుధ, జయప్రదలు కనపడరు. నందు, మధులకు కాల్ చేసి మాలో ఒక్కరికి ఎయిడ్స్ ఉంది, అంటే మీ ఇద్దరిలో కూడా ఒకరికి ఎయిడ్స్ అని చెప్పి పెట్టేస్తారు. దాంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి నందు – మధులు పడే ఇబ్బందులు.. అసలెందుకు జయసుధ, జయప్రదలు నందు, మధులను టార్గెట్ చేసారు. అసలు జయసుధ, జయప్రదల ఫ్లాష్ బ్యాక్ ఏంటి.? ఫైనల్ గా ఎవరికి ఎయిడ్స్ ఉందని తేలింది.? ఎవరు చనిపోయారు.? ఎవరు మిగిలారు.? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

‘బెస్ట్ యాక్టర్స్’ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ మారుతి టీం వర్క్స్ అనే బ్రాండ్ పేరు ఉండడం. దీనివలన ఈ సినిమాకి బిజినెస్ పరంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇకపోతే సినిమాలో డైరెక్టర్ రాసుకున్న కొన్ని కామెడీ సీన్స్ బాగా పేలాయి. ముఖ్యంగా సినిమా మొదట్లో తరుణ్ వాయిస్ ఓవర్ తో పాత్రలని పరిచయం చేసిన విధానం అందరినీ నవ్వించేలా ఉంది. ఆ తర్వాత సప్తగిరి ఇంట్రడక్షన్ సీన్, అక్కడ తను చెప్పే ఇష్యూ బాగా నవ్వు తెప్పిస్తుంది. ఇకపోతే చివర్లో తాగుబోతు రమేష్ చేయ చేయించిన కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే క్లైమాక్స్ లో ట్విస్ట్ లని రివీల్ చేసి అన్నిటికీ క్లారిటీ ఇచ్చే సీన్ చాలా బాగుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. అందరిలోకి మెయిన్ పిల్లర్ నందు. తనలోని ఈజ్, ఎనర్జీ లెవల్స్ తన పాత్రకి పూర్తి న్యాయం చెయ్యడంలో హెల్ప్ అయ్యింది. అన్ని సీన్స్ లోనూ బాగా చేసాడు. ఇకపోతే లడ్డుగా కనిపించిన అభి తన పాత్రలో బాగానే నవ్వించాడు. తన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ మాడ్యులేషన్ కూడా బాగుంది. హీరోయిన్స్ లో చిన్న పాత్రే అయినా సినిమాకి కీలకం అయిన పాత్రలో షామిలి చూడటానికి బ్యూటిఫుల్ గా ఉంటూనే, మంచి నటనని కబరించింది. ఈ మూవీతో పరిచయం అయిన క్రతీ బాగుంది. లవ్ సీన్స్ లో బాగా చేసింది. ఈ సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ మధురిమ మరియు కేశ కంబటి. వీరిద్దరూ కనిపించే ప్రతి సీన్ లో అందాల ఆరబోత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో వీరివి సినిమాని టర్న్ చేసే పాత్రలు. పెర్ఫార్మన్స్ తో పాటు అందాల ఆరబోత బాగా ఎక్కువ చేసిన వీరిద్దరూ ముందు బెంచ్ వారిని బాగా ఆకట్టుకుంటారు. ఇక కిట్టు రాసిన పంచ్ డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి.

మైనస్ పాయింట్స్ :

బెస్ట్ యాక్టర్స్ అనే సినిమా కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా వచ్చిన సినిమాలో కామెడీ అన్నా బాగా ఎక్కువ ఉండి, ఒకే ఒక్క సస్పెన్స్ తో ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఉండాలి లేదా థ్రిల్ అయ్యే పాయింట్ ఇ చూపిస్తూ అక్కడక్కడా బాగా నవ్వించగలగాలి. కానీ ఈ రెండింటిలో ఏదీ ఈ సినిమాలో జరగలేదు. సినిమా స్టార్టింగ్ బాగుంది, కానీ ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఎక్కడా కామెడీ లేదు. పంచ్ డైలాగ్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. కానీ సన్నివేశం లేకుండా అన్ని చోట్లా పంచ్ డైలాగ్స్ నవ్వించవు అన్న లాజిక్ ని డైరెక్టర్ మిస్ అయ్యాడు. ఇకపోతే సినిమాలో ఉన్నది ఒకే ఒక్క మేజర్ థ్రిల్ ఎయిడ్స్ ఉందని చెప్పే పాయింట్. దాన్ని చాలా బాగా డీల్ చేసారు. అక్కడి నుంచి కథ చాలా మలుపులతో థ్రిల్లింగ్ గా ఉంటుందని ఆడియన్స్ ఆశిస్తారు. కానీ ఆ థ్రిల్లింగ్ ని సినిమాలో కంటిన్యూ చేయలేకపోయారు. మళ్ళీ కామెడీ చూపించాలని ట్రై చేసారు. కానీ అది సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాకి హైలైట్ కావాల్సిన థ్రిల్స్, కామెడీ అక్కడక్కడా తలుక్కున మెరిసి మాయమైపోవడం, మిగతా అంతా బోరింగ్ గా అనిపించడం ఈ సినిమాకి మొదటి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.

ఇకపోతే ఈ సినిమా కథ కూడా కొత్తగా ఏమీ లేదు. ఇలాంటి ఫ్లేవర్ ఉన్న సినిమాలు మనకు ఇది వరకే పరిచయం ఉన్నాయి. యాజిటీజ్ కాకపోయినా ఇటీవల వచ్చిన ‘గ్రీన్ సిగ్నల్’ అనే సినిమాకి దీనికి దగ్గర పోలికలు ఉంటాయి. పోలికలని పక్కన పెడితే ఈ సినిమా 2013లో వచ్చిన ‘నీకోన్జాచా’ అనే మలయాళ మూవీకి అనధికారిక రీమేక్ అలియాస్ ఫ్రీమేక్. కథ పక్కన పెడితే కథనం అన్నా వేగంగా సాగాదీత అనేది లేకుండా రాసుకొని ఉంటే బాగుండేది. సినిమా స్టార్టింగ్ 10 నిమిషాలు, ఎండింగ్ 10 నిమిషాలు, ఇంటర్వల్ బాంగ్ తప్ప మిగతా అంతా బోరింగ్ గా సాగుతుంది. దీనివల్ల సినిమా రన్ టైం 115 నిమిషాలే అయినా రెండున్నర గంటల సినిమా చూసాం అనే ఫీలింగ్ వస్తుంది. వీటన్నిటికి మించి లవ్ స్టొరీలలో లీడ్ పెయిర్స్ మధ్య కెమిస్ట్రీ లేదు, అలాగే ఎమోషనల్ సీన్స్ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో బాగున్నాయి అనిపించిన డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. విశ్వదేవ బత్తుల సినిమాటోగ్రఫీ చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇచ్చిన ప్రతి లొకేషన్ ని సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా చూపించాడు. ఇక జెబి అందించిన సాంగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి కావాల్సిన స్థాయిలోనే ఉంది. ఉద్దవ్ ఎస్.బి ఎడిటింగ్ బాలేదు. సినిమాలో ఉన్న చాలా లాగ్స్ ని కట్ చేసి స్పీడప్ చేసుంటే బాగుండేది. కిట్టు డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. అనవసరపు చోట్ల పుఉంచ్ డైలాగ్స్ తగ్గించి ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు అరుణ్ పవార్ ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమీ లేదు. కథా విస్తరణలో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ని బాగా అరాసుకున్నాడు. కథనం ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఎందుకంటే కథ యావరేజ్ లేదా రొటీన్ అయిన కథనంతో మేజిక్ చేస్తే సినిమా హిట్. ఆ ఫార్ములాని సరిగా ఫాలో అవ్వలేదు, అందుకే కథనం బోరింగ్ గా ఉంటుంది. ఇక దర్శకుడిగా మాత్రం పరవాలేదనిపించుకున్నాడు. నిర్మాత కుమార్ అన్నంరెడ్డి నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఒక మంచి క్వాలిటీ ఉన్న సినిమాని అందించడానికి తను పూర్తి సపోర్ట్ ఇచ్చారని తెలుస్తుంది.

తీర్పు :

‘మారుతి టీం వర్క్స్’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ‘బెస్ట్ యాక్టర్స్’ సినిమా ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకునే స్థాయికే పరిమితం అయిపోయింది. సినిమాలో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్న దర్శకుడు అరుణ్ పవార్ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. బెస్ట్ యాక్టర్స్ లో బెస్ట్ పాయింట్ చూసుకుంటే – సినిమా స్టార్టింగ్ 15 నిమిషాలు, క్లైమాక్స్ 15 నిమిషాలు, ఇంటర్వల్ బ్లాక్ ట్విస్ట్, ఒకటి రెండు కామెడీ సీన్స్ మరియు మధురిమ, కేశ కంబటిల అందాల ఆరబోత. మైనస్ అనిపించుకున్న పాయింట్స్ – రొటీన్ కథ, బోరింగ్ కథనం, కామెడీ సరిగా లేకపోవడం, రివీల్ చేసిన థ్రిల్ ని అంతే గ్రిప్పింగ్ తో తీసుకెళ్ళలేకపోవడం, సెకండాఫ్ స్టార్టింగ్నుంచి క్లైమాక్స్ వరకూ స్లోగా సాగదీయడం. ఓవరాల్ గా బెస్ట్ యాక్టర్స్ సినిమా ఆడియన్స్ చేత ది బెస్ట్ అనిపించుకోవడంలో ఫెయిల్ అయ్యింది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Bookmark and Share