సమీక్ష : భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ – జస్ట్ టైమ్‌పాస్!

సమీక్ష : భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ – జస్ట్ టైమ్‌పాస్!

Published on Apr 29, 2016 10:36 PM IST
Bhadram be careful brother review

విడుదల తేదీ : ఏప్రిల్ 29, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : రాజేష్ పులి

నిర్మాత : బోనం క్రిష్ణ సతీష్, అడ్దగార్ల జగన్ బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ

సంగీతం : జె బి

నటీనటులు :చ‌ర‌ణ్ తేజ్, హమిదా, సంపూర్ణేష్ బాబు…


ఓ సినిమాకి దర్శకత్వం వహించి, కోటి రూపాయిలు సంపాదించి, ప్రేయసిని దక్కించుకోవాలనుకున్న ఓ షార్ట్ ఫిలిం మేకర్ అందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశాడన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ. సంపూర్ణేష్ బాబు ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ:

కార్తీక్ (చ‌ర‌ణ్ తేజ్) ఓ షార్ట్ ఫిలిం మేకర్. సినిమా తీయాలన్న ప్రయత్నాల్లో ఉన్న ​కార్తీక్, శృతి(హమిదా)ని ప్రేమిస్తాడు. కానీ శృతి నాన్న(సూర్య) ఈ పెళ్లికి ఒప్పుకోక పోవడంతో శృతి కోరిక మేరకు పారిపోయి గుడిలో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే విషయం తెలుసుకున్న శృతి వాళ్ళ నాన్న గుడికి వచ్చి కార్తీక్ ని కొట్టి శృతిని తీసుకువెళతాడు. తరువాత శృతి ప్రేమను అర్థం చేసుకుని కార్తీక్ ని కలవమని చెపుతాడు.

ఆరునెలలలో కోటి రూపాయలు సంపాదిస్తే శృతి ని ఇచ్చి పెళ్లి చేస్తానన్న శృతి తండ్రి మాటకు కార్తీక్ ఒప్పుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో సినిమా హీరో కావాలనుకునే సంపూర్ణేష్ బాబు (సంపూర్ణేష్ బాబు) ని, అతని తండ్రిని కలుస్తాడు. తరువాత కార్తీక్ సంపూర్ణేష్ బాబు తో సినిమా చేశాడా? లేదా? అనుకున్నట్లు కోటిరూపాయలు సంపాదించి శృతి ని స్వంతం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ..

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ఉన్న ఏకైక ప్లస్ పాయింట్.. పాతది అయినా ఆకట్టుకునే కథ. చ‌ర‌ణ్ తేజ్ హీరోగా బాగానే నటించాడు. హీరో స్నేహితులుగా నటించిన వారు కూడా బాగానే నటించారు. హీరోయిన్ హమీదా కూడా తన పాత్ర మేర బాగానే నటించింది. ఇక సంపూర్ణేష్ బాబు తన పేరుతోనే నటించి తన అభిమానులను ఆకట్టుకుంటాడు. సత్యం రాజేష్ తన నటనతో ఆకట్టుకుంటాడు.

సినిమాలో ఫస్ట్ హాఫ్ కూడా మంచి టెంపోతో సాగుతుంది. ఉన్నంతలో చిన్న చిన్న ట్విస్ట్ లతో ఫస్ట్ హాఫ్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. రెండు గంటల లోపే ఉన్న సినిమా నిడివి కూడా ప్లస్ పాయింట్. అక్కడక్కడా మాటలు ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్:

కథలో సెటప్ బాగానే సెట్ చేసిన దర్శకుడు కథనంలో మాత్రం ఆ నేర్పుని చూపించలేకపోయాడు. సెకండాఫ్ లో ఫ్లాట్ నేరేషన్ విసిగిస్తుంది. సంపూర్ణేష్ బాబు వచ్చినంతవరకు బాగానే నడిచిన కథ ఆ తరువాత పూర్తిగా సంపూర్ణేష్ బాబుపైనే సాగడం కూడా ఈ సినిమాకి ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు. సంపూర్ణేష్ బాబు కిడ్నాప్ వ్యవహారం, చివరలో హీరోలను అనుకరిస్తూ సంపూర్ణేష్ బాబు చేసిన పేరడీ కొద్దిగా ఆకట్టుకున్నా ఎక్కువగా విసిగించింది అని చెప్పుకోవాలి.

ఒక దశలో హీరో హీరోయిన్ల ప్రధాన కథ పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. లాజిక్ గురించి అస్సలు పట్టించుకోకపోవడం, కథలో ఉన్న ఎమోషన్ ని పట్టించుకోకపోవడం వంటివి మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. టైటిల్ జస్టిఫికేషన్ లేదు.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాలో సాంకేతికంగా అన్ని విభాగాలు బాగా పనిచేశాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మల్హర్ భట్ జోషి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ’ఎదురుగా ఒక వెన్నెలా’ పాటలో సినిమాటోగ్రాఫర్ పనితనం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ పనితనం వల్లే ఎక్కడా చిన్న సినిమా అన్న భావన కలగదు. గోవింద్ కళాదర్శకత్వం బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నా, సెకండ్ హాఫ్ నిరాశ పరుస్తుంది. జెబి అందించిన పాటలు బాగున్నా నేపథ్య సంగీతం ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు బావున్నాయి.

కథ పరంగా ఫర్వాలేదనిపించినా దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో రచయితగా, దర్శకుడిగా రాజేష్ నిరాశపరిచాడు. అయితే దర్శకుడు రాజేష్ పులి మాత్రం తొలి సినిమాతో టెక్నికల్ విభాగంలో మాత్రం ఫరవాలేదనిపిస్తాడు.

తీర్పు:

సంపూర్ణేష్ బాబుకి ఉన్న క్రేజ్‍ని దృష్టిలో పెట్టుకొని ఆయనను ఓ ప్రధాన పాత్రలో నటింపజేసి మెప్పించాలని వచ్చిన సినిమా ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ’. ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా కథపై దృష్టి పెట్టిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం కథను వదిలేసి పూర్తిగా సంపూర్ణేష్ బాబు పైన ఆధారపడటంతో కాస్త నిరాశపరుస్తుంది. కామెడీ జానర్‌కు కాస్త ఎమోషన్ కూడా తోడై ఉంటే అది మర్చిపోలేని సినిమా అవుతుంది తప్ప పూర్తిగా కామెడీ పైనే సినిమాచేస్తే అది అర్థం పర్థం లేని సినిమాలాగా తయారవుతుంది అన్న దానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. కాకపోతే లాజిక్ వెతకకుండా, లోపాలు కూడా పట్టించుకోకుండా చూస్తే ఈ ’భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ’ సినిమా అంతగా నిరాశ పరచదు. అలా ఆలోచిస్తా కొద్దిసేపు టైమ్‍పాస్!

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు