సమీక్ష : బ్రాహ్మణ – నీరసంగా ‘శివ శివా’ అనుకోవడమే!

సమీక్ష : బ్రాహ్మణ – నీరసంగా ‘శివ శివా’ అనుకోవడమే!

Published on Jul 8, 2016 8:29 PM IST
brahmana review

విడుదల తేదీ : 08 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : శ్రీనివాస్ రాజు

నిర్మాత : విజయ్.ఎం, గుర్రం మహేష్ చౌదరి

సంగీతం : మణిశర్మ

నటీనటులు : : ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది..


కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా ‘దండుపాళ్యం’ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు శ్రీనివాస్ రాజు తెరకెక్కించిన సినిమా ‘శివం’. కన్నడలో గతేడాది విడుదలై మంచి విజయం సాధించిన ఈ సినిమా, తెలుగులో ‘బ్రాహ్మణ’ పేరుతో డబ్ అయి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌లుక్, ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ ‘బ్రాహ్మణ’ ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

బసవన్న (ఉపేంద్ర).. తనకిష్టం వచ్చినట్లు, ఏవేవో దేశాలు తిరుగుతూ కాలం వెళ్ళదీసే ఓ బ్రాహ్మణ యువకుడు. కొన్ని వందల సంవత్సరాలుగా బసవన్న వంశస్థులే తమ ప్రాంతంలోని శైవ పుణ్య క్షేత్రానికి ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వంశంలో బసవన్న తరం వచ్చేసరికి ఆ కుటుంబంలో ఎవ్వరూ ప్రధాన అర్చక పదవిని చేపట్టేందుకు సిద్ధంగా ఉండరు. అప్పుడే తన తండ్రిపై, వంశంపై ఉన్న గౌరవంతో బసవన్న ఆ బాధ్యతలు చేపడతాడు.

ఇక ఆ బాధ్యతలు చేపట్టాక దేవస్థానం నిధులు కొందరు కాజేసిన విషయాన్ని బసవన్న తెలుసుకుంటాడు. వారిని శిక్షించే దిశగా చర్యలు తీసుకుంటుండగా బసవన్నపై హత్యాప్రయత్నం జరుగుతుంది. అయితే అదే సమయంలో అతడ్ని కాపాడడానికి హెలికాఫ్టర్‌లలో, పెద్ద పెద్ద గన్స్ తీసుకొని వచ్చి ఒక గ్యాంగ్ బసవన్నను కాపాడుతుంది. ఈ గ్యాంగ్ ఏంటీ? బసవన్నకు ఈ గ్యాంగ్‌కు సంబంధం ఏంటి? అందరూ అనుకునేలా బసవన్న ఓ సాధారణ యువకుడు కాదా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అంటే ఫస్టాఫ్ అని చెప్పుకోవాలి. బసవన్న కుటుంబానికి ఓ బలమైన అస్థిత్వం ఉండడం, ఆలయ అర్చకుడిగా కొన్నేళ్ళుగా పనిచేసిన అతడి తండ్రి అకస్మాత్తుగా చనిపోవడం, అల్లరిచిల్లరిగా తిరిగే బసవన్నే తండ్రి బాధ్యతలను చేపట్టడం.. ఈ సన్నివేశాలన్నింటిలో మంచి ఎమోషన్ ఉంది. ముఖ్యంగా హీరో ఉపేంద్ర పూర్తిగా పూజారి అవతారంలోకి మారిపోయే సన్నివేశాల్లో మంచి హీరోయిజం కూడా ఉంది. ఇక ఉపేంద్ర మార్క్ స్టైల్ కూడా ఫస్టాఫ్‌లో చాలా బాగుంది.

ఉపేంద్ర తనదైన నటనతో సినిమాకు మంచి జోష్ తీసుకొచ్చాడు. పూజారిగా మారాక ఆయన తన నటనలో చూపించిన మార్పు బాగుంది. ఇక సలోనిది చిన్న పాత్ర. ఉన్నంతలో ఆమె తన పాత్రలో బాగానే నటించింది. రాగిణి ద్వివేది అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గలేదు. ఈ తరహా సన్నివేశాలను ఇష్టపడేవారికి ఇదొక ప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్‌ మొత్తం సినిమా అసలు కథను పక్కనబెట్టి ఎటో వెళ్ళిపోవడాన్ని ‘బ్రాహ్మణ’కు అతిపెద్ద మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ మొదలవ్వగానే ఒక్కసారే సినిమా ఇంటర్నేషనల్ మాఫియా, టెర్రరిజం, ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్.. ఇలా ఎన్నో మలుపులు తిరిగి విసుగుపుట్టిస్తుంది. మంచి ఆసక్తికర ఎమోషన్ ఉన్న ఫస్టాఫ్ తర్వాత సినిమా అంతా ఇలా గందరగోళంగా తయారవ్వడం అస్సలు బాగోలేదు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ మొత్తం అనవరంగా పేలే గన్లు, పెద్ద పెద్ద కార్లు, విలన్ అరుపులు తప్ప ఏమీ లేదు. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ ఒక్కటి బాగుందనుకున్నా సెకండాఫ్ ఏ కోశానా బాగోలేదు.

దేవస్థానం నేపథ్యాన్ని ఎంతో బాగా ప్రస్తావిస్తూ మొదలయ్యే సినిమాలో అదే దేవస్థానంలో భారీ ఫైట్లు, రక్తపాతం పెట్టడం అనవరం అనిపించింది. ఇక విలన్ రవిశంకర్ పాత్ర కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. పాటలు వినడానికి, చూడడానికి కూడా బాగాలేవు. ఇక తెలుగు డబ్బింగ్ పనులు కూడా సరిగ్గా కుదరలేదనిపించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, దర్శకుడు శ్రీనివాస్ రాజు చెప్పాలనుకున్న అసలు కథ బాగానే ఉంది. ఫస్టాఫ్ వరకూ అందులోని ఎమోషన్‌ను బాగానే పట్టుకున్నాడు కూడా. అయితే సెకండాఫ్ వచ్చేసరికి కథంతా గాలికి వదిలేసి దర్శక, రచయితగా విఫలమయ్యారు. ఒక్క ఉపేంద్ర హీరోయిజంను అక్కడక్కడా ఎలివేట్ చేయడంలో తప్ప దర్శకుడు పెద్దగా మెప్పించింది లేదు.

మణిశర్మ అందించిన పాటలేవీ ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ విషయంలో ఆయన గతంలో తెలుగు సినిమాలకు ఇచ్చిన స్కోర్‍నే పలుచోట్ల వాడారు. సినిమాటోగ్రఫీ మామూలుగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగోలేవు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. అవసరం లేని చోట్ల కూడా జంప్ కట్స్ అతిగా వాడి విసుగు తెప్పించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదనేలా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఆర్ట్ వర్క్ బాగుంది.

తీర్పు :

‘బ్రాహ్మణ’ అన్న టైటిల్, అందుకు తగ్గట్టే కాస్త విచిత్రమైన పోస్టర్స్, టీజర్స్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, అసలు కథను పక్కనబెట్టి ఏవేవో చెప్పాలనుకొని బోర్లాపడింది. ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్, ఫస్టాఫ్‌లో అసలు కథలోని ఎమోషన్ లాంటి కొన్ని ప్లస్‌లు ఉన్న ఈ సినిమాలో మెప్పించడానికి ఇతర అంశాలేవీ లేవు. ఎందుకు, ఏ మలుపులు తిరుగుతుందో తెలియని సెకండాఫ్‌లో వచ్చే అనవసర ఆర్భాటాలు, అర్థం పర్థం లేని సన్నివేశాలు, నీరసమైన విలన్ పాత్ర.. ఇలాంటి మరెన్నో మైనస్‌లతో వచ్చిన ఈ సినిమా ఏ కోశానా మెప్పించేలా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘బ్రాహ్మణ’, శివ శివా అనిపించే నీరసమైన సినిమా!

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు