సమీక్ష – చిత్రం భళారే విచిత్రం – దెయ్యం దారితప్పింది!!

సమీక్ష – చిత్రం భళారే విచిత్రం – దెయ్యం దారితప్పింది!!

Published on Jan 2, 2016 11:36 AM IST
Abbayitho Ammayi review

విడుదల తేదీ : 01 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ :2.25/5

దర్శకత్వం : భానుప్రకాష్ బలుసు

నిర్మాత : పి. ఉమాకాంత్

సంగీతం : కన్కేష్ రాథోడ్

నటీనటులు : మనోజ్ నందన్, చాందిని, అనిల్ కళ్యాణ్..

మనోజ్ నందన్, చాందిని, అనిల్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించగా పి. ఉమాకాంత్ నిర్మించిన సినిమా చిత్రం భళారే విచిత్రం. హర్రర్ కామెడీకి మంచి క్రేజ్ కనిపిస్తోన్న నేపథ్యంలో అదే విషయాన్ని నమ్ముకొని దర్శకుడు భానుప్రకాష్ ప్రేక్షకులను మెప్పించేందుకు నేడు థియేటర్ల ముందుకు వచ్చారు. మరి ఈ హర్రర్ కామెడీ.. ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

శివ (మనోజ్ నందన్).. హీరో అవ్వాలని కలలు కంటూ ఉండే ఓ సాధారణ యువకుడు. నత్తితో ఇబ్బందిపడే శివకు సినిమా అవకాశాలు అస్సలు రావు. అయితే శివ ఎలాగైనా హీరో అవుతాడని నమ్మే అతడి ఫ్రెండ్ మదన్ (అనిల్ కళ్యాణ్) మాత్రం శివకు అన్నివిధాలా అండగా నిలబడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే.. ఈ సమయంలోనే తమ కుటుంబానికి చెందిన ఓ ఎస్టేట్‌ కబ్జా నుండి బయటపడటంతో, ఆ ఎస్టేట్‌ను సినిమా షూటింగ్‌లకు ఇచ్చి, తద్వారా శివకు అవకాశాలు తెప్పించే విధంగా మదన్ ఓ ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్లుగానే తమ ప్లాన్ సక్సెస్ అయ్యి, ఓ లో బడ్జెట్ సినిమాకు శివ హీరోగా ఎంపికవుతాడు.

‘దారితప్పిన దయ్యం’ అన్న టైటిల్‌తో శివ హీరోగా తెరకెక్కే ఆ సినిమా షూటింగ్‌లో అందరికీ విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ఆ సినిమా హీరోయిన్ అయిన హన్సిక (చాందిని) శరీరంలోకి ఓ ప్రేతాత్మ ప్రవేశించి సినిమా యూనిట్ మొత్తాన్నీ ఇబ్బంది పెడుతుంది. ఆ ప్రేతాత్మ ఎవరిది? దాని వెనుక ఉన్న కథేంటి? ఆ ప్రేతాత్మ నుంచి వీరంతా ఎలా బయటపడ్డారు? దారితప్పిన దయ్యం అన్న సినిమా ఏమైందీ? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘చిత్రం భళారే విచిత్రం’!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే సినిమా ఫ్లోతో కాకుండా కేవలం ప్రత్యేకంగా మాత్రమే చూసి, ఎంజాయ్ చేసే కొన్ని అంశాలను ప్రస్తావించుకోవచ్చు. సినిమాతో కలిపి చూసినప్పుడు ఈ సన్నివేశాలేవీ ఉపయోగకరమైనమేవీ కావు. ఇక అలాంటి అంశాల విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పార్ట్ బాగున్నాయి. ఈ సన్నివేశాల్లో దర్శకుడు ఉన్నంతలో కొంత కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో సినిమాతో సంబంధం లేకుండా వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు మంచి రిలీఫ్. బేసిక్ లైన్ కూడా బాగానే ఉంది.

ఇక నటీనటుల పరంగా చూసుకుంటే.. అందరికంటే హీరోయిన్ చాందిని ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. తనకిచ్చిన పాత్రను ఉన్నంతలో బాగానే పండించింది. గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. ఇక హీరో మనోజ్ నందన్ బాగానే నటించాడు. అనిల్ కళ్యాణ్, అమృతం వాసు, జబర్దస్త్ రాము తదితరులు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఫర్వాలేదనిపించేలానే ఉన్న ఒక లైన్‌ను పూర్తి కథగా ఏమాత్రం ఆకట్టుకునేలా తయారుచేసుకోలేకపోవడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. ఇక అలాంటి కథకు రాసుకున్న సన్నివేశాలు, ఆ సన్నివేశాలు ఒక పద్ధతిలో అల్లే విధానం ఇలా ఎక్కడా ఈ సినిమా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ఇక సినిమాలో వచ్చే ఏ ఒక్క సన్నివేశానికీ క్లారిటీ అన్నదే లేదు. దయ్యం నేపథ్యంలో సినిమా అంటే ఇలాగే ఉండాలి అని గిరి గీసుకున్నట్లు నడిపించిన ఫస్టాఫ్ ఏమాత్రం బాలేదు.

ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో ఉన్నంతలో కొత్తదనం చూపినా, అప్పటికే సినిమాలో సినిమా పేరన్నట్టు దయ్యం నిజంగానే దారితప్పింది. దెయ్యానికి కూడా చాలాసార్లు క్లారిటీ లేదు. దయ్యం అలా ఎందుకు ప్రవర్తిస్తుందో కారణమున్నా, ఎవరిపై అది కక్ష సాధించుకుంటుందో అన్న విషయం చెప్పడానికి ప్రీ క్లైమాక్స్ వరకూ ఎటూకాని సన్నివేశాలతో లాక్కొచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయిన క్లైమాక్స్‌లో దయ్యంతో ఫ్రెండ్‌షిప్ చేయడమనే సక్సెస్ ఫార్ములాను ఇక్కడా వాడినా అది ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా లేదు. ఇక క్యారెక్టరైజేషన్, లాజిక్, కథనంలో క్లారిటీ లాంటి విషయాల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగానూ ఈ విభాగం హైలైట్ అని చెప్పుకోదగ్గ విభాగం ఏదీ లేదు. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సినిమా మొత్తాన్నీ ఒకే బంగ్లాలోనే తీసి కూడా రెండు గంటల పాటు వీలైనన్ని కొత్త లొకేషన్స్‌ను ఎంపిక చేసి మెప్పించారు. మ్యూజిక్ రొటీన్‌గా ఉంది. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సీన్లను అతికిస్తూ పోయినట్లుంది. గ్రాఫిక్స్ బాలేవు.

ఇక దర్శక, రచయిత భాను ప్రకాష్, ఒక హర్రర్ కామెడీకి సరిపడే స్థాయి ఉన్న లైన్‌నే ఎంచుకున్నా, దాన్ని పూర్తి స్థాయి కథగా మలచడంలోనే విఫలమయ్యారు. కథనం విషయంలోనూ భాను ప్రకాష్ పెద్దగా మెప్పించలేదు. దర్శకత్వ పరంగా మాత్రం అక్కడక్కడా ఫర్వాలేదనిపించేలా సన్నివేశాలు రాసుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఎండ్ కార్డ్, టైటిల్ కార్డ్స్.. లాంటి చోట్ల దర్శకుడి ప్రతిభ బాగుంది.

తీర్పు :

హర్రర్ కామెడీ.. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అనిపించుకున్న జానర్. ఈ జానర్‌లో నెలకో రెండు సినిమాలు వచ్చేస్తున్నా ఆ జోరు మాత్రం తగ్గట్లేదు. బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్ ఉన్న జానర్ కావడంతో అదే జానర్‌ను నమ్ముకొని మనముందుకొచ్చిన సినిమా ‘చిత్రం భళారే విచిత్రం’. విచిత్రమేమంటే ఏ జానర్ అయితే సక్సెస్ అనుకొని థియేటర్లకు వచ్చిందో, ఆ జానర్‌లోని ఏ అంశాన్నీ పట్టించుకోని బోరింగ్ సినిమాగా చిత్రం భళారే విచిత్రం నిలిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్, మధ్యలో అక్కడక్కడా నవ్వించే కొన్ని సన్నివేశాలను వదిలేస్తే.. ఎక్కడా కొత్తదనం చూపని, కనీసం సక్సెస్ అయ్యే అంశాన్నీ పట్టుకోని ఈ సినిమాను పైన చెప్పిన అంశాల కోసం మాత్రమే చూడొచ్చు. అంతకుమించి ఏదో ఉంటుందని వెళితే మాత్రం ఈ చిత్రం చూపగలిగే చిత్రమేమీ ఉండదు. మొత్తంగా దారితప్పిన ఓ దయ్యం కథతో వచ్చిన క్లారిటీ లేని సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు