సమీక్ష : గుంటూరోడు – మనోజ్ యాక్షన్ షో

సమీక్ష : గుంటూరోడు – మనోజ్ యాక్షన్ షో

Published on Mar 4, 2017 4:05 PM IST
Gunturodu movie review

విడుదల తేదీ : మార్చి 03, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం :ఎస్కె సత్య

నిర్మాతలు :శ్రీ వరుణ్ అట్లూరి

సంగీతం :డీజే వసంత్

నటీనటులు :మంచు మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్

హీరో మంచు మనోజ్ గత సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సారి ఖచ్చితమైన హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో చేసిన కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ ‘గుంటూరోడు’ ఈరోజే విడుదలైంది. మరి దర్శకుడు ఎస్కె సత్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

గుంటూరు సిటీకి చెందిన కుర్రాడు కన్నా (మంచు మనోజ్) హ్యాపీగా స్నేహితులతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అలా కన్నా సరదాగా గడుపుతుండగా ఒకరోజు అనుకోకుండా ప్రముఖ క్రిమినల్ లాయర్ శేషు (సంపత్) తో గొడవపడే పరిస్థితి తలెత్తుతుంది. ఆ గొడవలోనే కన్నా శేషును తీవ్రంగా గాయపరుస్తాడు.

అలా తనను గాయపరిచి అవమానించిన కన్నా మీద కక్ష పెంచుకున్న శేషు కన్నా తండ్రి (రాజేంద్ర ప్రసాద్) ని టార్గెట్ చేస్తాడు. అదే సమయంలో కన్నా శేషు చెల్లెలు అమృత (ప్రగ్య జైస్వాల్) తో ప్రేమలో పడతాడు. అలా శత్రువు చెల్లిని ప్రేమించిన కన్నా ఆ శత్రువును ఎదిరించి అమృతని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ గురించి. ‘గుంటూరోడు’ అనే మాస్ మసాలా టైటిల్ కు అతను చాలా బాగా సెట్టయ్యాడు. పూర్తి మాస్ లుక్ లో మెప్పించాడు. ఫైట్ సన్నివేశాల్లో అతని బాడీ లాంగ్వేజ్, పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం చాలా బాగున్నాయి. సంపత్ తో పోటీ పడే సన్నివేశాల్లో మనోజ్ ఎనర్జీ లెవల్స్ చాలా హై రేంజ్ లో ఉన్నాయి.

నటుడు సంపత్ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అందులో అతని నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంది. చిన్న చిన్న విషయాల్లో అతను ఇగో ప్రదర్శించే తీరును బాగా చూపించారు. అతని పాత్ర వలన సినిమా ఫస్టాఫ్ మొత్తం చాలా బలంగా తయారైంది. అలాగే చాలా కాలం తర్వాత నెగెటివ్ రోల్ చేసిన కోట శ్రీనివాసరావుగారి పెర్ఫార్మెన్స్ బాగుంది. ప్రగ్యాజైశ్వాల్ అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఫస్టాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్త ఆసక్తికరంగానే ఉంది. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియన్సును మెప్పించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధానమైన మైనస్ పాయింట్ ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం. దీంతో సినిమా చాలా చోట్ల డ్రై గా అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య కూడా చెప్పుకోదగ్గ రొమాంటిక్ ట్రాక్ ఏం నడవలేదు. ఇక సినిమా చివర్లో రావు రమేష్ మినిస్టర్ గా ఎంట్రీ ఇచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరించేయడం మరీ ఓవర్ అనిపించింది.

హీరో-విలన్ల మధ్య నడిచే ఘర్షణ సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు అనిపించాయి. దీంతో మాస్ సినిమాకు ముఖ్యమైన యాక్షన్ సీన్లలో కొన్ని చోట్ల ఊపు తగ్గింది. పెద్దగా ప్రభావం చూపని హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, మిగిలిన కొన్ని అనవసరపు సన్నివేశాలు కథనానికి అడ్డు తగలడంతో కాస్త బోరింగ్ ఫీల్ ఆవహించింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. గుంటూరు పరిసర ప్రాంతాల్ని చాలా బాగా చూపించారు. ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా రూపొందించారు. మనోజ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు డిజైన్ చేశారు. కమెడియన్ పృథ్వి కామెడీ ట్రాక్ లో కొంత భాగం ఎడిటింగ్ ద్వారా తొలగించి ఉండాల్సింది. డీజే వసంత్ సంగీతం పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగా ఇచ్చి ఉండాల్సింది. ఇక దర్శకుడు సత్య విషయానికొస్తే అతని పర్వాలదనే పనితనం చూపాడు. హీరో విలన్ల మధ్య ఉండే ఘర్షణ సన్నివేశాల్ని బాగా రాసుకున్నాడు. కానీ సినిమా కథనంలో కాస్త ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఉండాల్సింది.

తీర్పు :

మొత్తం మీద ఈ గుంటూరోడు చిత్రం పూర్తిగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. మాస్ లుక్ లో మనోజ్, అతని పెర్ఫార్మెన్స్, విలన్ గా సంపత్ నటన, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా బోరింగ్ సన్నివేశాల వలన అసలు కథ పక్కదారి పట్టడం, హీరో – హీరోయిన్ల మధ్య రొమాన్స్ తగ్గడం, సరైన మోతాదులో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద బలహీనమైన బోరింగ్ సన్నివేశాలను పక్కబెడితే ఇందులోని మనోజ్ యాక్షన్ కంటెంట్ చూసేవారిని ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు