సమీక్ష : హేయ్ పిల్లగాడ – మరీ ఇంత స్లో అయితే కష్టం

సమీక్ష : హేయ్ పిల్లగాడ – మరీ ఇంత స్లో అయితే కష్టం

Published on Nov 24, 2017 5:45 PM IST
Hey Pillagada movie review

విడుదల తేదీ : నవంబర్ 24, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : సమీర్ తాహిర్

నిర్మాత : డి.వి కృష్ణ స్వామి

సంగీతం : గోపి సుందర్

నటీనటులు : దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసి ఒక్కసారిగా నటి సాయి పల్లవి నటించిన మలయాళ హిట్ సినిమా ‘కాళి’ తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ పేరుతో ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతంగా కోపం తెచ్చుకునే స్వభావమున్న సిద్దు (దుల్కర్ సల్మాన్) అంజలి (సాయి పల్లవి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అంజలి మాత్రం సిద్దు ఎప్పటికైనా మారుతాడని, కోపం తగ్గించుకుంటాడని ఎదురుచూస్తుంటుంది. కానీ సిద్దు అలానే ఉంటాడు.

ఒకసారి ఇద్దరూ కలిసి వైజాగ్ కు బయలుదేరుతారు. దారి మధ్యలో ఒక డాబా దగ్గర రౌడీలతో సిద్ధుకు గొడవవుతుంది. ఆ గొడవ ఎన్ని విపత్కర పరిస్థితులకు దారితీసింది. దాని వలన సిద్దు, అంజలిలు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నారు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ఆకట్టుకునే అంశాలంటే దుల్కర్ సల్మాన్ పాత్రను మలచిన తీరు. అతని పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంటుంది. అతని ప్రవర్తన, చిన్న చిన్న విషయాలకు అతిగా కోపం తెచ్చుకోవడం, దాంతో అతనికి, అంజలికి మధ్యన గొడవలు తలెత్తడం అనే అంశాలు బాగున్నాయి. సిద్దు పాత్రలో దుల్కర్ సల్మాన్ నటన కూడా చాలా బాగుంది.

ఇక అతని భార్యగా, ప్రేయసిగా సాయి పల్లవి తన సహజ నటనతో ఆకట్టుకుంది. అతి కోపిష్టి అయిన భర్తను మార్చడానికి ఆమె చూపించే ప్రేమ, చేసే ప్రయత్నాలు ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ఆసక్తికరంగా నడిచాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన లోపం స్లో నరేషన్. దుల్కర్, సాయి పల్లవిలు ఎంతలా తమ నటనతో ఆకట్టుకున్నా కూడా కథనం చాలా నెమ్మదిగా సాగుతుండటంతో ఇది తెలుగు సినిమా కాదు అనే భావం కలిగింది. హీరో హీరోయిన్ల మధ్యన నడిచే సన్నివేశాలు బాగున్నాయనిపించిన బలమైన కథ అనేది లేకపోవడంతో, క్లైమాక్స్ లో కానీ సినిమా రక్తి కట్టకపోవడంతో మిగిలిన భాగం మొత్తం డాక్యుమెంటరీ చూస్తున్నట్టు తోచింది.

ఇక అక్కడక్కడా రెండు సన్నిశాలు తప్ప ఎక్కడా ఫన్ అనేది పండకపోవడం మరో మేజర్ బ్యాక్ డ్రాప్. హీరో హీరోయిన్ల పాత్రలకు చెప్పిన డబ్బింగ్ సరిగా సెట్టవ్వలేదు. రొమాంటిక్ సినిమానే అయినా, అనువాద చిత్రం కాబట్టి పాటలు ఏమంత వినసొంపుగాలేవు. హీర్ హీరోయిన్ల కుటుంబాలను నామ మాత్రంగా టచ్ చేశారు కానీ వాటిలోని ఎమోషన్స్ ను కావాల్సినంతగా పండించలేదు దర్శకుడు సమీర్ తాహీర్. పైగా సినిమా ఒరిజినల్ వెర్షన్ గతేడాది మార్చిలో విడుదలవడంతో పాతబడిన సినిమాను చూస్తున్న అనుభూతే కలిగింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సమీర్ తాహీర్ సినిమా కోసం మంచి పాయింట్ దాని కోసం దుల్కర్, సాయి పల్లవి లాంటి హీరో హీరో హీరోయిన్లను ఎంచుకుని మంచి పనే చేసినా బలమైన కథనం అనేది రాయకపోవడం, కేవలం ఒకే ఒక్క సింగిల్ పాయింట్ మీద సినిమాను అతి నెమ్మదిగా నడపడం నిరుత్సాహాన్ని కలిగించింది.

గోపిసుందర్ అందించిన నైపథ్య బాగానే ఉన్నా పాటలు మాత్రం వినదగినవిగా లేవు. ఎడిటింగ్ పర్వాలేదు. గిరీష్ గంగధారన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

మలయాళంలో మంచి విజయం సాధించిన ‘కాళి’ చిత్రం తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ పేరుతో విడుదలై పెద్దగా చూపలేకపోయింది. చిత్రం మొత్తంలో దుల్కర్ సల్మాన్, సాయి పల్లవిల నటన, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు మినహా కథ మొత్తం సింగిల్ లైన్లోనే ఉండటం, తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునేలా కమర్షియల్ అంశాలు లేకపోవడం, కథనం మరీ నెమ్మదిగా సాగడం నిరుత్సాహపరిచే అంశాలు కాగా ఒరిజినల్ వెర్షన్ కూడా ఒకటిన్నర సంవత్సరం పాతది కావడం, దాదాపు తెలుగు యువత చాలా వరకు దాన్ని చూసి ఉండటం కూడా సినిమాకు ప్రతికూలమైన అంశమని చెప్పొచ్చు. మొత్తం మీద చేప్పాలంటే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు