సమీక్ష : ఇది మా ప్రేమకథ – ఈ కథ కాస్త కష్టమే

సమీక్ష : ఇది మా ప్రేమకథ – ఈ కథ కాస్త కష్టమే

Published on Dec 15, 2017 10:40 PM IST
Idhi Maa Prema Katha movie review

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : రవి, మేఘన లోకేష్

దర్శకత్వం : అయోధ్య కార్తీక్

నిర్మాత : పి.ఎల్.కె.రెడ్డి

సంగీతం : కార్తీక్ కొడకండ్ల

సినిమాటోగ్రఫర్ : మోహన్ రెడ్డి

స్టోరీ, స్క్రీన్ ప్లే : అయోధ్య కార్తీక్

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటించిన మొదటి సినిమా ‘ఇది మా ప్రేమ కథ’. మేఘన లోకేష్ ఈ మూవీ ద్వారా హీరొయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మత్స్య క్రియేషన్స్ మరియు ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి ఈ సినిమా ద్వారా మెప్పించాడా ? లేదా ? చూద్దాం.

కథ :
అరుణ్ (రవి) కాలేజీ కుర్రాడు. ఒకరోజు అరుణ్ పరీక్ష రాయడానికి వెళ్తుంటే సంధ్య (మేఘన లోకేష్ ) ఆల్ ది బెస్ట్ చెబుతుంది. నిజానికి ఆమె చెప్పింది వేరొకరికి అయినా తనకే ఆ అమ్మాయి విష్ చేసిందని అనుకోని సంధ్య తో ప్రేమలో పడతాడు అరుణ్. కొంతకాలం తరువాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్ని అనుకోని సంఘటనల్లో ప్రియ అనే అమ్మాయి అరుణ్ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అసలు ప్రియ ఎవరు ? అరుణ్ కు ప్రియకు సంభందం ఏంటి ? సంధ్య అరుణ్ చివరికి కలుసుకున్నారా ? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సీరియల్స్ లో నటించిన మేఘన లోకేష్ ఈ సినిమాతో హీరోయిన్ గా ఆకట్టుకుంది. అందం, అభినయం బాగుండడంతో మేఘన లోకేష్ తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోవచ్చు. రవి యాక్టింగ్ బాగుంది, రెండు పాటల్లో డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. కార్తీక్ కొనకండ్ల అందించిన నేపధ్య సంగీతం బాగుంది.

ప్రభాస్ శ్రీను, గెటప్ శ్రీను చేసిన కామెడి పరువాలేదు. కాలేజీలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరో హీరొయిన్ మద్య వచ్చే లవ్ సీన్స్ మెప్పిస్తాయి. ప్రియదర్శి నటించింది కొద్దిసేపే అయినా మెప్పిస్తాడు.

మైనస్ పాయింట్స్ :

నూతన దర్శకుడు అయోధ్య కార్తీక్ ఎంచుకున్న పాయింట్ పాతది. ఇద్దరు ప్రేమించుకోవడం ఇంకో అమ్మాయి వీరి లైఫ్ లోకి రావడం, ఆ అమ్మాయి వల్ల వీరు విడిపోవడం మళ్ళీ కలుసుకోవడం అనే కథ చాలా సినిమాల్లో చూసాం. అదే ఈ సినిమాలో కూడా ఉండడంతో చూస్తున్న ఆడియన్స్ కు ఆసక్తిగా అనిపించదు.

స్క్రీన్ ప్లే బాగున్న సినిమాలు సక్సెస్ అవ్వడం మనం చూసాం. కథ సింపుల్ గా ఉన్న కథనం గ్రిప్పింగ్ గా ఉంటే బోరు కొట్టదు. కానీ ఇది మా ప్రేమకథ సినిమాలో ఆసక్తికరమైన అంశాలు పెద్దగా లేకపోవడంతో సినిమా తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో హీరోయిన్ ఒక అమ్మాయి వల్ల విడిపోవడం సహజమే అయినా మళ్ళీ వారు కలుసుకోవడం అనే అంశాన్ని కొంత ఎమోషనల్ గా, బలమైన కారణంతో కొత్తగా అయినా చూపించి ఉండాల్సింది. కానీ అలా లేకపోవడంతో సినిమా సర్వ సాధారణమైన సినిమాగానే మిగిలిపోయింది.

సాంకేతిక వర్గం :

లిరిక్ రైటర్ దినేష్ అందించిన పాటల్లో సాహిత్యం బాగుంది. కార్తిక్ కొడకండ్ల అందించిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తప్పకుండా బిజీ అవుతాడు. ఎడిటింగ్ పరువాలేదు. మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా సీన్స్ లో అతని ప్రతిభ కనిపిస్తుంది. డైలాగ్స్ బాగున్నాయి. డై

రెక్టర్ అయోధ్య కార్తీక్ సినిమాను ప్రారంభించిన విధానం బాగుంది. ఒక దాబాలో హీరో ప్రభాస్ శ్రీను కి కథ చెప్తూ మొదలు పెట్టి మద్య మద్యలో కామెడీని జొప్పించి బాగా వర్కవుట్ చేసాడు. కానీ నరేషన్లో కొత్తదనం, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో ఫలితం తక్కువ స్థాయిలోనే ఆగిపోయింది.

తీర్పు :

‘ఇది మా ప్రేమకథ’ సినిమా రెగ్యులర్ గా అనిపించే ప్రేమకథ. టీజర్, పోస్టర్స్ లో కనిపించే తాజాదనం ఈ సినిమాలో ఉండకపోవడంతో సినిమా చూసే ప్రేక్షకుడు ఎంగేజ్ అవ్వలేడు. ఎందుకంటే లవ్ స్టోరీస్ కొందరికి కనెక్ట్ అవొచ్చు కొందరికి కాకపోవచ్చు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పలేము. దాదాపు అన్ని సీన్స్, స్క్రీన్ ప్లే రెగ్యులర్ గా ఉండడంతో ఈ మూవీ చూడ్డానికి వచ్చిన ఆడియన్సుకు నిరాశ తప్పదు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి ఈ సినిమాతో హీరోగా పూర్తి స్థాయిలో విజయం సాదించకపోవచ్చు కానీ నటుడిగా మంచి మార్కులే దక్కించుకున్నాడు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు