సమీక్ష : జాబాలి – ‘హర్రర్ కాదు.. హింస’!

సమీక్ష : జాబాలి – ‘హర్రర్ కాదు.. హింస’!

Published on Mar 20, 2015 11:36 PM IST
Jabali

విడుదల తేదీ : 20 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

దర్శకత్వం : హేమ్‌రాజ్

నిర్మాత : టి. జయచంద్ర

సంగీతం : జై సుధాకర్

నటీనటులు : అరుణ్, షర్మిష్ట తదితరులు.


అంతా కొత్తవాళ్ళతో టి. జయచంద్ర నిర్మాతగా, హేమ్‍రాజ్ దర్శకత్వంలో హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‍గా చెప్పబడిన సినిమా ‘జాబాలి’. రామాయాణంలోని ఓ పాత్ర పేరును సినిమాకు పెట్టి, పోస్టర్లలో శృంగారాన్ని గుప్పించిన ఈ సినిమా, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దర్శక, నిర్మాతలు చెప్పినట్టు ఇది నిజంగానే హర్రర్ సినిమానా.? ఎందుకొచ్చాయో కూడా తెలియని అనామక సినిమాల జాబితాలో చేరే సినిమానా.? అనేది చూద్దాం..

కథ :

కాలేజీ రీసెర్చ్ పనుల నిమిత్తం ఓ ఏడుగురు యువతీ యువకులు అడవుల్లోకి వెళ్ళి అక్కడి మొక్కలు, చెట్లలోని రసాయనాలు మనిషి మనుగడకు ఏ విధంగానైనా తోడ్పడతాయేమోనని ప్రయత్నిస్తుంటారు. అందులో ఒక యువకుడు కళ్యాణ్ (అరుణ్) రాష్ట్ర మంత్రి కొడుకు. కళ్యాణ్ లవర్ జెన్నీ(షర్మిష్ట).. కళ్యాణ్‌ – జెన్నీల ప్రేమకలాపాలు సినిమాతో సమాతరంగా నడిచే మరో ఉపకథ. ఇక అసలు కథ విషయానికి వస్తే, ఈ గ్రూప్‌లో శంకర్ అనే యువకుడు తన అకడమిక్ రీసెర్చ్‌తో పాటు ఆత్మలపై పరిశోధన చేస్తూంటాడు. మంచి ఆత్మలను వశపరచుకొని, వాటి ద్వారా సమాజానికి ఉపయోగపడే మేలు చేయాలనేది ఆతడి సంకల్పం. ఈ క్రమంలోనే అతడి ద్వారా ఒక ఆత్మ అడవిలో దాచబడ్డ చిన్న మట్టి కుండ నుండి బయటకు వస్తుంది. ఇక అక్కడి నుంచి ఆ ఆత్మ ఒక్కొక్కరినీ చంపుకుంటూ పోతుంటుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది.? ఆ ఆత్మకి సంబంధించిన ఫ్లాష్‍బ్యాక్ ఏమిటి.? బయటకి వచ్చిన ఆ ఆత్మ వాళ్ళని ఎందుకు చంపుతుంది.? అడవికి వచ్చిన 7 మందిలో ఎవరన్నా బతికి బయటపడ్డారా.? అన్నదే మిగతా కథ.

ప్లస్‍పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే సినిమాలో ఉన్న నలుగురు భామలతో విచ్చల విడిగా చేయించిన అందాల ఆరబోతనే చెప్పాలి. ఇక కొన్ని శృంగారభరిత పాటలను కూడా సినిమాకు ఒక బలంగా చెప్పవచ్చు. ఏమీలేని ఈ సినిమాలో ఆ రెండు మసాలా పాటలు ఏ ప్రేక్షకుల కోసమైతే తీసారో వారిని బాగానే ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తంగా చూసుకుంటే సెకండాఫ్‍లో వచ్చే కొన్ని కేవలం కొన్ని సీన్స్ మాత్రం పరవాలేధనిపిస్తాయి.

మైనస్‌పాయింట్స్ :

మైనస్‌పాయింట్స్ గురించి చెప్పాలంటే.. ఒక కథంటూ లేకుండా ఏదో ఒకటి అల్లేసి హర్రర్ సినిమా తీసేద్దాం అన్నట్టు తీశారా అనిపిస్తుంది సినిమా చూస్తోంటే.. బలమైన కథ ఎలాగూ లేదు, కనీసం కథనం కూడా బలమైనది కాకపోవడంతో సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడు అసహనానికి గురవుతాడు. సెకండాఫ్‌కి కనీసం ఒక పర్పస్ ఉంది. ఫస్టాఫ్‍కి ఒక దారీతెన్నూ ఏదీ లేకపోవడం విసుగు తెప్పిస్తుంది. హర్రర్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమాలో ఫస్టాఫ్‍ మొత్తంలో రొమాన్స్ కానీ, హర్రర్ కానీ ఏదీ లేకపోవడం సినిమా పట్ల డైరెక్టర్ కి ఉన్న అశ్రద్దగా చెప్పొచ్చు.

ఇక నటీనటులు పెద్దగా చేయడానికి కూడా ఏమీ లేదు. పేలవమైన సన్నివేశాల రూపకల్పనలో నటించడానికి ఒక్కరికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. సినిమా మొత్తంలో నలుగురు నటీమణులు ఉన్నారు. ఒక్కరు కూడా అందం విషయంలో తప్ప నటనలో మార్కులు సంపాదించలేదు. నిజానికి సెకండాఫ్‌ కొన్ని సీన్స్ ని ప్లస్ పాయింట్‌గా చెప్పినా ఉన్నంతలో అది ప్లస్ పాయింట్‌గా మారిందే కాని, సెకండాఫ్‌లోని సన్నివేశాలు కూడా భయపెట్టవు. సెకండాఫ్‌లో జాబాలి (ఆత్మ)ని తీసుకొచ్చారు. అక్కణ్ణుంచైనా హర్రర్ పార్ట్ మొదలవుతుందేమోననుకుంటే భ్రమ పడ్డట్టే! సినిమాకి బలమైన సెకండాఫ్‌లో హర్రర్‌ని కాకుండా హింసను చూపడం బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా చెప్పొచ్చు. ఆత్మ చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు నాసిరకంగా ఉన్నాయి. జాబాలికి ఒక సరైన విజన్‌ని కల్పించడంలో సినిమా విఫలమైంది. శుభం కార్డు వరకూ జాబాలి అందరినీ ఎందుకు చంపాలనుకుంటుందనే విషయానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు.

సినిమా కథా కథనాలే బలహీనంగా ఉన్నప్పుడు అందులో లాజిక్, పాత్రల ఔచిత్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదం అవుతుంది. అడవిలో స్మగ్లింగ్, వాటిని రిపోర్ట్ చేయడానికి వచ్చిన రిపోర్టర్‌ను చంపేయడం, ఆ స్మగ్లర్ ఈ యువకులపై పెట్టే నిఘా.. ఇవన్నీ కథా గమనాన్ని చెడగొట్టేవే కాక విసుగు తెప్పించేవి కూడానూ. ఇదే కథకి కొంత సస్పెన్స్ జోడించి, హింస కాకుండా హర్రర్ విషయాలను చూపించి, పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించి ఉంటే కొంత ఆసక్తికరంగానూ, అలరించదగ్గదిగానూ ఉండి ఉండేది.

సాంకేతిక విభాగం :

ముందుగా ఇలాంటి పేలవమైన కథను తెరకెక్కించిన దర్శకుడు హేమ్ రాజ్ గురించి చెప్పుకోవాలి. దర్శకత్వం పరంగా అక్కడక్కడా చిన్న చిన్న మెరుపులున్నాయి. ఆ ప్రతిభను ఒక సరైన స్క్రిప్ట్‌పై పెట్టి ఉంటే బాగుండేది. చిన్న చిన్న మెరుపులను పక్కనబెడితే దర్శకుడు ఈ సినిమాలో చేసింది ఏమీ లేదు. నిజానికి చేయడానికి కూడా ఏమీ లేదు. ఈ సినిమాకి మా.చే.రాం అందించిన కథలో కొత్తదనం కానీ, బలమైన అంశం కానీ లేదు. స్క్రీన్‌ప్లే, మాటలు దర్శకుడు హేమ్‌రాజే చేపట్టారు. ఆ విషయంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎస్. గుణశేఖరన్ అందించిన సినిమాటోగ్రఫీ కొంతలో కొంత రిలీఫ్. జై సుధాకర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా లేదు. సాహిత్య పరంగా కలుపుకొని చూసినప్పుడు కొన్ని పాటలు ఫర్వాలేదనిపించినా మ్యాజిక్ మాత్రం చేయలేదు. ఇక నేపథ్య సంగీతం సినిమా చూసే వారికి ఉండే విసుగును రెట్టింపు చేస్తుంది. ఎడిటింగ్ ఫర్వాలేదనలే ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కొన్ని సన్నివేశాల్లో బాగుండి, మరికొన్ని సన్నివేశాల్లో మరీ నాసిరకంగా ఉన్నాయి.

తీర్పు :

హర్రర్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా మనముందుకొచ్చిన ఈ సినిమాలో ఇటు పూర్తి స్థాయి హర్రర్ కానీ, రొమాన్స్ కానీ లేకపోవడం ప్రేక్షకుడికి నిరాశే. అక్కడక్కడా ఫర్వాలేదనిపించే కొన్ని హింసాయుత సన్నివేశాలు (నచ్చేవారికి..), రెండు శృంగారభరిత మసాలా పాటలు తప్ప ఆకట్టుకునేవి పెద్దగా ఏవీ లేవు. ఇంతకుముందు చెప్పినట్టు ఇలా వచ్చి, అలా వెళ్ళిపోయే సినిమాల జాబితా మాత్రమే కాక, అసలీ సినిమా కూడా ఉందా? అనే జాబితా ఒకటుంది. అందులో చేరిపోయే సినిమా.. ‘జాబాలి’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు