సమీక్ష : జఫ్ఫా – ఓ పిచ్చి సినిమా

సమీక్ష : జఫ్ఫా – ఓ పిచ్చి సినిమా

Published on Mar 29, 2013 5:15 PM IST
Jaffa11 విడుదల తేదీ : 29 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : వెన్నెల కిషోర్
నిర్మాత : రమేష్ వర్మ
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : బ్రహ్మానందం, అలీ..

‘వెన్నెల’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన కిషోర్ ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి మొదటి ప్రయత్నంగా తీసిన ‘వెన్నెల 1 1/2’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయిన పట్టు వదలని వెన్నెల కిషోర్ తన రెండవ ప్రయత్నంతో అన్నా హిట్ కొట్టాలని కామెడీ కింగ్ బ్రహ్మానందం ని ప్రధాన పాత్రలో పెట్టి క్రైమ్ – కామెడీ మిక్స్ చేసిన ‘జఫ్ఫా’ సినిమాని తెరకెక్కించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, రమేష్ వర్మ నిర్మించాడు. ‘జఫ్ఫా’ గా బ్రహ్మానందం ఎంతవరకూ ఆడియన్స్ ని మెప్పించాడు, వెన్నెల కిషోర్ ఈ సినిమాతో అన్నా విజయాన్ని అందుకున్నాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

జస్మిన్ ఫల్గుడా అలియాస్ జఫ్ఫా(బ్రహ్మానందం) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని అసిస్టెంట్ సుజిత్(ధన్ రాజ్) చాలా భయస్తుడు. వీరిద్దని వాళ్ళ ఎండి మేల్కోటీ టార్చర్ పెడుతుంటాడు ముఖ్యంగా జఫ్ఫాని ఎందుకు పనికిరాని వాడని, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యడని తెగ టార్చర్ పెడుతుంటాడు. ఆ విషయం వల్ల చాలా భాదపడుతున్న సమయంలో జఫ్ఫా తన ఫ్రెండ్ అయిన అల్లా ఉద్దీన్(వేణు మాధవ్) ని కలుస్తాడు. అతను నీ వెనుక ‘కులి కుతుబ్ షా చష్మే బదూర్ నూరురా’ ఉన్నాడని మీ ఎండి కి చెప్పు అది వినగానే వాడు నీకు సలామ్ కొడతాడని అంటాడు. ఆ ఊపులో జఫ్ఫా తన ఎండి అయిన మేల్కోటిని బండ బూతులు తిడతాడు తీరా పేరు చెప్పే టైంకి ఆ పేరు గుర్తుకు రాకపోవడంతో ఎండి వారిని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు.

అది తట్టుకోలేకపోయిన సుజిత్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ ఆత్మహత్య జఫ్ఫా వల్లే జరిగిందని జైల్లో వేస్తారు. అలా జైలు కెళ్ళిన జఫ్ఫా జైల్లో ఏమేమి విచిత్రాలు చేసాడు? ఎవరెవరిని మార్చేశాడు? చివరిగా తను జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఆ తప్పించుకునే ప్రయత్నంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటనేవి? మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి హీరో బ్రహ్మానందం కావున మొదట ఆయన గురించి చెబుతా. కామెడీ చేయడంలో బ్రహ్మనందం సిద్దహస్తుడు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథా పరంగా ‘జఫ్ఫా’ టైటిల్ రోల్ బాగానే చేసారు కానీ చెప్పుకునేంత రేంజ్ లో గానీ, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేంత కామెడీ గానీ చెయ్యలేదు. సినిమా మొత్తంగా అక్కడక్కడా అక్కడక్కడా కొన్ని కామెడీ ఎపిసోడ్స్ బాగున్నాయి. వాటిని ఏరి ఏరి చెప్పాలంటే కాష్ట కష్టం. బాగా గుర్తున్న కామెడీ ఎపిసోడ్ అంటే కాటి కాపరి పాత్రలో తాగుబోతు రమేష్ చేసిన కామెడీ బిట్ బాగుంది. సినిమా మొదలైన పది నిమిషాలు కామెడీ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

టాలీవుడ్ కామెడీ స్టార్ అయిన బ్రహ్మానందంని సినిమాలో పెట్టుకొని ఆడియన్స్ ని ఆద్యంతం నవ్వించలేకపోవడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. సినిమా మొదటి పది నిమిషాల తర్వాత చెప్పడానికి కథ ఏమీ లేకపోవడంతో నాలుగైదు సంవత్సరాలు సాగదీసే సీరియల్స్ లాగా సినిమాని రెండుగంటలు సాగదీశాడు. అలా అయినా సినిమాని ఆసక్తికరంగా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా తీసాడా అంటే అదీ లేదు చాలా బోరింగ్ గా తీసాడు. ఏదో బ్రహ్మానందం సినిమా కాబట్టి కామెడీ లేకపోతే ఆడియన్స్ ఎక్కడ ఫీలైపోతారో అని అక్కడో కామెడీ బిట్ అక్కడో కామెడీ బిట్ వస్తుంది. అప్పటి వరకూ విసుగెత్తి పోయున్న ఆడియన్స్ దానికి ఏమి నవ్వుతాములే అని అదే మూడ్ లో సినిమాని చూసేస్తున్నారు.

కామెడీ చెయ్యడంలో కాదు కామెడీని రాసుకోవడం, దాన్ని తీయగల అవగాహన లేకుండానే వెన్నెల కిషోర్ తన మొదటి సినిమాకి డైరెక్ట్ చేసేసాడు. ఎవరన్నా మొదటి సినిమా సరిగ్గా చెయ్యలేకపోతే తన తదుపరి సినిమా విషయంలో ముందు సినిమాకి జరిగిన తప్పులు జరగకుండా చూసుకుంటారు కానీ మన వెన్నెల కిషోర్ అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోగా మొదటి సినిమా కన్నా దారుణంగా ఈ సినిమాని తీసాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ టేకింగ్ చూస్తే వీటి కంటే ఈ మధ్య కాలంలో యంగ్ జెనరేషన్ తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్ టేకింగ్ బాగుంటోంది కదా అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ లో లాజిక్ ఉండదు, ఎక్కడా ట్విస్ట్ ఉండదు ఏదో ఉప్పు, కారం, మసాలా లేని బిర్యాని తిన్నట్టు ఉంటుంది.

సినిమాలో అలీ, రఘుబాబు, వేణు, వెన్నెల కిషోర్, రాఘవ లాంటి కమెడియన్స్ ని పెట్టుకొని కూడా కామెడీని పండించలేకపోవడమే కాకుండా వారు చేసే సుత్తి కామెడీ చేయించి ఆడియన్స్ కి టార్చర్ పెట్టారు. బ్రహ్మానందం హీరోగా చేసాడు, అలాగే చాలా మంది ఊత పదంలా వాడే ”జఫ్ఫా” అనే పదాన్ని టైటిల్ గా పెట్టారు కాబట్టి సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుందని ఆశించి ఈ సినిమాకి వెళితే మీకు డబ్బు ఖర్చు తప్ప మీరు ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు. తమకు చేతగాని విషయాలను టచ్ చెయ్యకూడదు అని చెప్పడానికి ఈ మూవీ ఓ చక్కటి ఉదాహరణ.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని సీన్స్ లో మాత్రం సినిమాటోగ్రఫీ బాగుంది, మిగతా ఎక్కడా చెప్పుకోదగ్గ విధంగా లేదు. ఎడిటర్ అసలు ఏ మాత్రం తన కత్తెరకి పని చెప్పినట్టు లేడు, అందుకే సినిమా పాత కాలంలో మన రైలు బండ్లు కదిలినట్టు నిదానంగా ఊగి ఊగి ముందుకు వెళుతుంటుంది. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ లో ఎడా పెడా చాలా సీన్స్ ని కట్ చేసినా సినిమాకి పెద్ద పోయేదేమీ లేదు. పాటలు ఏమీ లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా అనూప్ రూబెన్స్ తన వంతు న్యాయం చేసాడు.

వెన్నెల కిషోర్ ఒక్క డైరెక్షన్ మాత్రమే చూసుకోకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అని ఇలా అన్ని విభాగాలని టచ్ చెయ్యడం వల్ల ఏ ఒక్క విభాగానికి న్యాయం చెయ్యలేకపోయాడు. ఇలాంటి సినిమాలు చెయ్యడం వాళ్ళ వెన్నెల కిషోర్ కమెడియన్ గా తన కున్న పేరుని తనే చెడగొట్టుకోవడమే కాకుండా, తన పతనానికి తనే గొయ్యి తీసుకుంటున్నాడు. నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి .

తీర్పు :

కామెడీ స్టార్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో, వెన్నెల కిషోర్ డైరెక్షన్ లో వచ్చిన ‘జఫ్ఫా’ సినిమా చాలా చెత్తగా ఉంది. సినిమా మొదటి పదినిమిషాలు, అక్కడక్కడా కొన్ని కామెడీ బిట్స్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేవు. బ్రహ్మనందం ఫ్యాన్స్ ఈ సినిమాకి వెళితే పూర్తిగా నిరుత్సాహానికి గురవుతారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు