సమీక్ష : జర్నీ 2 – ఈ ప్రయాణం అస్సలు బాగోలేదు !

సమీక్ష : జర్నీ 2 – ఈ ప్రయాణం అస్సలు బాగోలేదు !

Published on Oct 1, 2016 8:20 AM IST
Journey 2 review

విడుదల తేదీ : సెప్టెంబర్ 30, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

దర్శకత్వం : ఎస్. నారాయణ్

నిర్మాత : చిలుగూరి గంగాధరరావుచౌదరి

సంగీతం : ఎస్. నారాయణ్

నటీనటులు : గణేష్, మంజరి ఫడ్నిస్

ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు తమిళం, కన్నడ భాషల చిత్రాలను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాల్లో కథకు ప్రాధాన్యం ఉంటుందన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని ధైర్యంగా చేసుకుని ఇప్పుడు కన్నడ భాషా చిత్రం ‘ముంజనే’ తెలుగులోకి ‘జర్నీ 2’ పేరుతో డబ్ అయి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ హీరో గణేష్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మంజరి ఫడ్నిస్ జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం…

కథ :

హైదరాబాద్ కు చెందిన పవిత్ర (మంజరి) ఎక్కడపడితే అక్కడ నీతి వాక్యాలు రాస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ఆమె విజయవాడకు వెళ్లే బస్సు వెనుక ఓ వాక్యం రాస్తుంది. దాన్ని విజయవాడలో మను (గణేష్) చూసి ఇంప్రెస్ అయి దానికి బదులు రాస్తాడు. అలా వారిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ఆ రెండు బస్సుల మీదే కవితలు రాసుకుంటూ ప్రేమించుకుంటారు.

అలా ప్రేమలో పడ్డ వారు కలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలుకాదు. ఆ సమయంలో వారిద్దరి జీవితాల్లో వారి ప్రేమకు ఆటంకం కలిగిస్తూ ఓ కష్టం ఎదురవుతుంది. ఆ కష్టం ఏమిటి ? దాని వల్ల వారు ఎలా బాధపడ్డారు ? చివరికి వారి ప్రేమను గెలుచుకున్నారా లేదా ? అన్నదే ఈ చిత్రం.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ప్లస్ పాయింట్ హీరోయిన్ మంజరి. సినిమా మొదటి నుండి చివరి వరకూ ఆమె తన నటనతో బాగా ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో ఆమె పై నడిచే సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో తన ప్రేమికుడి కోసం తపనపడే సన్నివేశంలో ఆమె నటన మెప్పించింది. తన ప్రేమను చంపుకోకూడదు అనే మొండి పట్టుదలతో మెలిగే అమ్మాయిగా మంజరి బాగా కుదిరిపోయింది.

ఇక ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకోవడం, ఆ ప్రేమ కోసం ఎంతటి కష్టాన్నైనా భరించడం అనే ఉద్దేశ్యంతో తయారైన స్టోరీ లైన్ కూడా పర్వాలేదనిపించే ప్లస్ పాయింటే. ఇక బాగా వెతగ్గా ప్రేమ కోసం హీరో హీరోయిలిద్దరూ కష్టపడటం, ఆ ప్రేమ యొక్క పవిత్రతను గుర్తించి దాన్ని గౌరవించడం అనే అంశాలు కూడా సినిమాకి ఉపయోగపడ్డాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కు ఏమాత్రం కొదవ లేదు. ఒకరినొకరు చూసుకోకుండా పిచ్చిగా ప్రేమించేసుకోవడం అనే పాయింట్ బాగానే ఉన్నా దాన్ని ప్రదర్శించిన తీరు అస్సలు బాగోలేదు. ఎవరో ఎక్కడో బస్సు మీద రాసిన చిన్న వాక్యం (అందులోనూ పెద్ద విషయమేమీ లేదు) చూసి బదులు రాయడం, అలా నాలుగు వాక్యాలు రాసుకుని ప్రేమించుకోవడం అనేవి పూర్తిగా లాజిక్ లేని విషయాలు. వాటిలో ఎక్కడా సహజత్వం కనిపించదు. అలాంటి సహజత్వం లేని ప్రేమ చుట్టూ దర్శకుడు, కథకుడు నారాయణ రాసుకున్న కథనం ఏమాత్రం చూడదగ్గదిగా అనిపించలేదు.

అంతేగాక 2012 నాటి సినిమా వాతావరణం కూడా బాగా బోర్ కొట్టించింది. ఫస్టాఫ్ మొత్తం లాజిక్ లేకుండా నీరసంగా నడుస్తూ ఉన్న సమయంలో అనవసరంగా వచ్చే పాటలు మరీ బోర్ కొట్టించాయి. హీరో క్యారెక్టరైజేషన్ అయితే అసలు క్లారిటీ లేకుండా నిరాశక్తిగా ఉండటం కూడా సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. సెకండాఫ్ లో కూడా హీరోయిన్ పాత్ర మినహా మరేదీ ఆకట్టుకోలేదు. హీరోయిన్ యొక్క భామ పాత్రతో పండించిన హాస్యం అస్సలు వర్కవుట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికొస్తే దర్శకుడు ఎస్. నారాయణ్ తీసుకున్న ముఖాలు చూసుకోకుండా ప్రేమించుకోవడం అనే పాయింట్ బాగానే ఉన్నా దాన్ని బలంగా చేప్పే కథ, కథనం రాసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. సినిమా రెండు భాగాల్లో సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హీరోయిన్ ఎపిసోడ్ ఒక్కటి తప్ప వేరే మెప్పించే సన్నివేశాలు ఒక్కటి కూడా లేవు. అలాగే ఎస్. నారాయణ్ పాటలకు అందించిన సంగీతం అస్సలు బాగోలేదు. జగదీష్ వలి కెమెరా వర్క్ అంతంత మాత్రంగానే ఉంది. ఇ. ఎం. నాగేశ్వరరావు ఎడిటింగ్ సినిమా స్థాయిని ఇంకాస్త తగ్గించేలా ఉంది. 2012 నాటి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు పర్వాలేదనిపించేలా మాత్రమే ఉన్నాయి.

తీర్పు :

కొన్నేళ్లకు ముందు విడుదలైన వేరే భాషలోని చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసేప్పుడు అది ఇప్పటి కాలానికి, అభిరుచులకు దగ్గరగా అయినా ఉండాలి లేదా అందులో భీభత్సమైన కథా కథనాలైనా ఉండాలి. కానీ ఈ డబ్బింగ్ సినిమాలో వాటిలో ఏ ఒక్కటీ లేదు. పైగా లాజిక్, సహజత్వం లేని సన్నివేశాలు, బోరింగ్ కథనం ఇందులో మైనస్ పాయింట్స్ కాగా హీరోయిన్ మంజరి నటన, ఒకరికొకరు పరిచయం లేకుండా ప్రేమించుకోవడం అనే అంశాలు కాస్తో కూస్తో పర్వాలేదనిపించే ప్లస్ పాయింట్స్. మొత్తం మీద నాలుగేళ్ల క్రితం నాటి కన్నడ సినిమాకి డబ్బింగ్ గా వచ్చిన ఈ ‘జర్నీ-2’ అనే చిత్రం టికెట్టు కొని థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడిని ఏ కోశానా సంతృప్తి పరచదు.

123telugu.com Rating : 1.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు