సమీక్ష : లేడి హేటర్ – లక్కీ

సమీక్ష : లేడి హేటర్ – లక్కీ

Published on Nov 1, 2012 9:00 PM IST
విడుదల తేదీ: 01నవంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : హరి
నిర్మాత : రాజ రాజేశ్వరి, శ్రీనివాస్ రెడ్డి
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : శ్రీ కాంత్, మేఘనా రాజ్

తాజ్ మహల్, పెళ్లి సందడి, ఆహ్వానం వంటి సినిమాలతో ఒక టైంలో శోభన్ బాబు లాగా ఫ్యామిలీ హీరో అనిపించుకున్న లక్కీ స్టార్ శ్రీకాంత్ ఆ తరువాత ఆడుతూ పాడుతూ, పెళ్ళాం ఊరిళితే వంటి కామెడీ సినిమాలతో నవ్వించి కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలు చేస్తూ వచ్చాడు. ఈ మధ్య ఆయన క్రేజ్ బాగా తగ్గిపోవడంతో ఆయన సినిమాలుకూడా పెద్దగ ఆడట్లేదు . అయన లేటెస్ట్ సినిమా ‘లక్కీ’ ఈ రోజు విడుదలైంది. హరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని రాజ రాజేశ్వరి నిర్మాత. ఈ లక్కీ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

గోవెల్ వరల్డ్ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే లక్ష్మి నారాయణ అలియాస్ లక్కీ (శ్రీకాంత్) కి ఆడవాళ్లంటే చిరాకు. మగాడి సమస్యలను అర్ధం చేసుకోకుండా అస్తమానం తమ గురించే ఆలోచిస్తూ మగాడిని విసిగిస్తారని అనుకుంటుంటాడు. రాజ రాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం వల్ల లక్కీకి విచిత్రంగా ఆడవాళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకున్నా వినిపిస్తుంది. ఆ అనుగ్రహం వల్ల మొదట్లో వారి మీద కోపం ఇంకాస్థ పెంచుకుంటాడు. డాక్టర్ సత్య (గీత) సలహాతో ఆడవాళ్ళ మనసుని అర్ధం చేసుకోవడం ప్రారంభిస్తాడు. మరి లక్కీ ఆడవాళ్ళని పూర్తిగా అర్ధం చేసుకున్నాడా? మరోవైపు హైదరాబాద్ మీద దాడి చేయాలనుకున్న తీవ్రవాదులని లక్కీ ఎలా ఆడుకున్నాడనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

లక్కీ స్టార్ శ్రీకాంత్ (ఈ సినిమా టైటిల్స్ లో అలాగే వేసారు మరి) కి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ఈ సినిమాలో అతను కొత్తగా చేసిందేమీ లేకపోయినా ఆడవాళ్ళని అర్ధం చేసుకోలేని పాత్రలో బాగా చేసాడు. కొల’వెర్రి’ తరహాలో ఈ సినిమాలో ఒక పాట కూడా పాడాడు. మూడు సంవత్సరాల క్రితం ‘బెండు అప్పారావు’ సినిమాలో సెకండ్ హీరొయిన్ గా కనిపించి మాయమైన మేఘనా రాజ్ మళ్లీ ఈ సినిమాలో కనిపించింది. మేఘనా రాజ్ లక్కీ భార్యగా హోమ్లీగా బావుంది. మన తెలుగులో నటనకి ప్రాధాన్యమున్న మంచి పాత్రలు తక్కువ కాబట్టి ఈ అమ్మాయి మలయాళం భాషలో ఎక్కువ సినిమాలు చేస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు కొంత వరకు ఎంటర్టైన్ చేసారు. లక్కీ బాస్ రోజా అతనిని ఎంత టార్చర్ పెట్టె సీన్స్ బావున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఆడవాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వినిపించడం అనే కాన్సెప్ట్ కామెడీగా ఉన్నా ఈ కాన్సెప్ట్ ని ఈ చిత్ర దర్శకుడు హరి ‘వాట్ వుమెన్ వాంట్’ అనే సినిమా నుండి స్ట్రైట్ లిఫ్ట్ చేసాడు. ఆ కాన్సెప్ట్ ని తెలుగు నేటివిటీ తగ్గట్లుగా మర్చి కామెడీ జత చేసినంత వరకు బానే ఉంది కానీ ఉగ్రవాదులు దాడి చేయడానికి లక్కీవారిని అడ్డుకోవడం ఈ ఉప కథతో అసలు కథ పక్క దారి పట్టింది. లక్కీ తన భార్యని, కుటుంబ సభ్యులని అర్ధం చేసుకునే సన్నివేశాలు ఇంకాస్త బలంగా తీసుంటే బావుండేది. ఉగ్రవాదులను అడ్డుకునే సీన్స్ మరీ సిల్లీగా ఉన్నాయి. వీటికి తోడు బ్రహ్మానందం సెపరేట్ కామెడీ సినిమాకి ఉపయోగపడింది ఏమీ లేదు శుద్ధ దండగ. ఆ సీన్స్ లేకపోయినా నిర్మాతకి కొంత డబ్బు అయినా మిగిలేది. క్లైమాక్స్ సీన్స్ అన్ని సిల్లీగా ఉన్నాయి. ఆడవాళ్ళందరినీ అర్ధం చేసుకున్న లక్కీకి ఉన్న వరం స్థానంలో పక్షుల మాటలు వినపడే మరో కొత్త వరం వస్తుంది. ఇంకా లక్కీ పక్షులను అర్ధం చేసుకునే పనిలో ఉంటాడేమో.

సాంకేతిక విభాగం :

సాయి కార్తీక్ సంగీతంలో శ్రీకాంత్ పాడిన ఓరి శంకర పాట బానే ఉంది. కార్తీక్ పాడిన నీ మౌనం పాట చిత్రీకరణ బావుంది. నేపధ్య సంగీతం చాల సన్నివేశాలను ఎలివేట్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నాగిరెడ్డి ఎడిటింగ్ ఓకే.

తీర్పు :

మగవాళ్ళు ఆడవాళ్ళని అర్ధం చేసుకోవాలంటూ దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అభినందనీయం. కానీ ఆ సమస్యకి పరిష్కారాన్ని పూర్తిగా ఇవ్వకుండా దర్శకుడు అసంపూర్తిగా వదిలేసాడు. కామెడీ విత్ ఫ్యామిలీ సినిమా చూడాలనుకుంటే, బోర్ కొట్టి సినిమా పిచ్చి ఉంటే సరదాగా ఒకసారి టైం పాస్ కోసం ఒకసారి చుడండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘Lucky’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు