ఆడియో సమీక్ష : కిక్ 2 – కిక్ ఫార్ములాతో థమన్ స్టైల్ ఆల్బమ్!

ఆడియో సమీక్ష : కిక్ 2 – కిక్ ఫార్ములాతో థమన్ స్టైల్ ఆల్బమ్!

Published on May 9, 2015 4:50 PM IST

kick

రవితేజ, సురేందర్ రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్’ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆ సినిమా విజయంలో థమన్ అందించిన సంగీతం కూడా చాలా క్రెడిట్‌ను కొట్టేస్తుంది. అలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మళ్ళీ అదే సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కిక్ 2’ ఆడియో నేడు విడుదల అయింది. మరి ఆ పాటలు మనకు మంచి కిక్‌ ఇచ్చి కిక్ స్థాయిని అందుకున్నాయా? చూద్దాం..

Kick 2 (3)1. పాట : మమ్మీ మమ్మీ

గానం : భోలే
సాహిత్యం : బాంబే భోలే

‘మమ్మీ’ అనే రిథమ్‌తో సాగిపోయే ఈ స్టైల్ పాట తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. ఆయితే ఈ పాటలోలా పదాల గజిబిజితో ఆడుకోవడం అనేది ఎప్పుడూ మంచి ఫీల్‌నిస్తుంది. లిరిక్స్ కూడా చాలా గమ్మత్తుగా ఉండి వినగానే ఎక్కేసాలా ఉన్నాయి. ఈ పాట ద్వారా హీరో ఆటిట్యూడ్ ఏంటనేది తెలిపే ప్రయత్నం చేశారు. హీరోకు కిక్ దొరకడమనేది తన కంఫర్ట్ జోన్‌లో తను ఉండడం అనే విషయం ఈ పాట ద్వారా చెప్పకనే చెప్పేశారు. హీరో ఆటిట్యూడ్‌ను పర్ఫెక్ట్‌గా తెలియజెప్పిన ఈ పాట వినగానే అందరూ మెచ్చే పాటగా నిలుస్తుందని చెప్పొచ్చు.

Kick 2 (2)2. పాట : నువ్వే నువ్వే

గానం : జోనీతా గాంధీ, థమన్
సాహిత్యం : వరికుప్పల యాదగిరి

ఈ ఆల్బమ్ మొత్తంలో మనతో పాటే ప్రయాణం చేయగల పాటల్లో నువ్వే నువ్వే పాటకు మొదటి స్థానాన్ని ఇవ్వొచ్చు. జోనీతా గాంధీ, థమన్‌లు కలిసి పాడిన ఈ పాట మంచి రొమాంటిక్ పాటగా నిలుస్తుంది. విన్న తర్వాత చాలాసేపటివరకూ ఈ ట్యూన్ మన చుట్టూనే తిరుగుతూ బాగా ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. యాదగిరి అందించిన సాహిత్యం కూడా రొమాంటిక్ మూడ్‌ను సరిగ్గా పట్టుకుంది. విజువల్స్‌తో కలిసి చూసినప్పుడు కిక్ సినిమాలో ‘పో పో పొమ్మంటున్నా..’ పాటలా గుర్తిండిపోయే పాటలా నిలవగల సామర్థ్యమున్న పాటగా దీన్ని ఊహించుకోవచ్చు.

Kick 2 (1)3. పాట : జెండాపై కపిరాజు
గానం : దివ్యాకుమార్, జొనితా గాంధీ, రాహుల్ నంబియార్
దీపక్ నివాస్, హనుమంత రావు
సాహిత్యం : శ్రీమణి

ఈ పాటలో అద్భుతమైన మ్యాజిక్ ఉంది. పాట నడిచే సమయంలో థమన్ చూపిన వేరియేషన్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. శ్రీమణి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. శ్రీమణి, తనకు బాగా అలవాటైన ఫార్ములాను ఈ పాటలో చూపి ఆకట్టుకున్నాడు. సింగర్స్ మధ్య సమన్వయం బాగుంది. ‘నీ అడుగు పడితే ప్రతి ఎకరం.. శిఖరం అవుతుందయా..’ అన్న ప్రయోగం శ్రీమణి స్టైల్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి పాటను సన్నివేశాలతో, సినిమా గమనంతో విన్నప్పుడు వచ్చే ఫీల్ మరింత రెట్టింపుగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

4. మస్తానీ మస్తానీKick 2 (5)

గానం : దీపక్, మాన్సి
సాహిత్యం : వరికుప్పల యాదగిరి

ఈ పాటను టిపికల్ థమన్ స్టైల్ పాటగా చెప్పుకోవచ్చు. థమన్ తనదైన బాణీలో ఓ పాటను అందిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఓ పాటే ఈ మస్తానీ మస్తానీ. దీపక్ పాడిన ఈ పాటకు థమన్ స్టైల్ ఆడియన్స్ ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఈ పాట విషయంలో మాన్సి స్టైల్ సింగింగ్‌కు మంచి క్రెడిట్ దక్కుతుంది. యాదగిరి అందించిన సాహిత్యం పాట మూడ్‌కు సరిపోయే పదాలతో సాగిపోతుంది. అయితే థమన్ పాటలు ఇప్పటివరకూ చాలాసార్లు విన్నవాళ్ళకు మాత్రం ఈ పాటలో కొత్తదనం కనిపించదు.

Kick 2 (4)5. టెంపుల్ సాంగ్

గానం : నివాస్, రాహుల్ నంబియార్, దీపక్, సంజన, మోషి
సాహిత్యం : శ్రీ మణి

హై నోట్‌లో సాగే ఈ పాట సినిమాలోని పతాక సన్నివేశంలో వచ్చే పాటలా కనిపిస్తుంది. అద్భుతమైన సాహిత్యంతో రూపొందిన ఈ పాటకు సరైన ఎమోషన్ ఉన్న సన్నివేశం కనుక ఉంటే అది కచ్చితంగా బలంగా నిలిచిపోయే సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉన్న ఈ పాటతో శ్రీ మణి తన స్థాయిని అమాంతంగా పెంచేసుకున్నాడు. ‘కుంభవృష్టే కురిసినదా.. అంబరం కరిగీవేళ..’ ‘బ్రహ్మండమే తొణికేలా.. బ్రహ్మోత్సవం ఈవేళ.. వెయ్యేళ్ళు గుండె లోతులో ఈ నిమిషం నిలిచేలా..’ అన్న పద ప్రయోగాలతో శ్రీ మణి, తన పాటకు ఓ క్రేజ్, మార్క్ వచ్చేలా చేసుకున్నాడు. మొత్తం ఐదుగురు గాయకులు పాడిన ఈ పాట విజువల్స్‌తో చూసినప్పుడు ఇంకెంత బాగుంటుందో ఊహించుకోవచ్చు. ఈ పాటలో అక్కడక్కడా ఏ.ఆర్.రెహమాన్ పాటల చాయలు కనిపిస్తాయి.

Kick 2 (6)6. కిక్
గానం : సింహ, స్ఫూర్తి
సాహిత్యం : కాసర్ల శ్యామ్

‘కుక్కురుకురు కుక్కురుకురు కిక్’ అంటూ సాగే ఈ పాటను మళ్ళీ థమన్ మార్క్ బాణీగా చెప్పుకోవచ్చు. ఇందులో కొత్తదనమేమీ లేకున్నా గమ్మత్తైన సాహిత్యాన్ని అంతే గమ్మత్తుగా పలికించి ఆకట్టుకోవడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యారు. లిరిక్స్ గమ్మత్తుగా సాగిపోతూ పాట మూడ్‌ను సరిగ్గా అందుకున్నాయి. మాస్ ప్రేక్షకుడికి ఈ పాట మంచి కిక్‌నిస్తుంది. సింహ, స్ఫూర్తి ఇద్దరూ పాటను మనం ఎంజాయ్ చేసేలా పాడడంలో సక్సెస్ అయ్యారు.

తీర్పు :

‘కిక్ 2’ ఆడియోను టిపికల్ థమన్, ‘కిక్’ ఫార్ములా ఆడియోగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పాటల విషయంలో థమన్ పెద్దగా ప్రయోగాలేవీ చేపట్టినట్టు కనిపించదు. అయితే తనకు బాగా అలవాటైన ట్యూన్‌లతో, ఫన్నీ పాటలతో ఈ ఆడియోను అందరూ ఎంజాయ్ చేసేలా రూపొందించారని మాత్రం చెప్పగలం. మమ్మీ, నువ్వే నువ్వే పాటలను వినగానే కిక్కించే పాటలుగా చెప్పుకోవచ్చు. ఎవ్వరైనా ఈ పాటలతో ఇట్టే కనెక్ట్ అయిపోతారు. జెండాపై కపిరాజు పాట వినేకొద్దీ అద్భుతంగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలం. ఇక టెంపుల్ సాంగ్‌‌లోని సాహిత్యం కోసం ఆ పాటను ఎన్నిసార్లైనా వినొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే.. కిక్ ఫార్ములా ప్లాన్ ప్రకారం రూపొందిన ఈ ఆడియోలో అన్ని రకాల పాటలు కలిసి ఓ డీసెంట్ ఆల్బమ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.

CLICK HERE FOR ENGLISH MUSIC REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు