సమీక్ష : ముసుగు – అసలు కథకే ‘ముసుగు’!

సమీక్ష : ముసుగు – అసలు కథకే ‘ముసుగు’!

Published on Apr 16, 2016 8:55 AM IST
Musugu review

విడుదల తేదీ : ఏప్రిల్ 15, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : శ్రీకర్‌ బాబు లీ

నిర్మాత : దగ్గుబాటి వరుణ్‌

సంగీతం : నవనీత్‌ చారి

నటీనటులు :మనోజ్‌ కృష్ణ, జెస్సీ, పూజశ్రీ..


గతంలో ప్రముఖ దర్శకుడు యస్. వి. కృష్ణారెడ్డితో కలిసి సంచలన విజయాలు సాధించిన రచయిత దివాకర్ బాబు కుమారుడు శ్రీకర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ముసుగు’. ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అన్న ప్రచారం పొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

మనోజ్ (మనోజ్) తన భార్య పూజ (పూజశ్రీ)తో కలిసి ఓ రిసార్ట్స్ లీజుకి తీసుకుని వ్యాపారం చేయాలనే ప్లాన్‌తో గోవాకి వస్తాడు. అక్కడి రిసార్ట్స్ యజమాని, తమ రిసార్ట్స్‌లో గతంలో ఓ హత్య జరిగిందని చెబుతూ తక్కువ మొత్తానికే లీజుకి ఇచ్చేస్తాడు. మొదట్లో మనోజ్ అతడి మాటలకు భయపడ్డా, ఆ తర్వాత రిసార్ట్స్ బిజినెస్ బాగా డెవలప్ చేయాలనే ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాడు.

ఈ క్రమంలోనే మనోజ్‌కి ఇన్సూరెన్స్ ఏజెంట్ అయిన జెస్సీ (జెస్సీ) పరిచయమవుతుంది. జెస్సీతో మనోజ్ బాగా దగ్గరవుతాడు. జెస్సీతో జీవితం పంచుకోవాలన్న ఆలోచనతో, మనోజ్, పూజను చంపాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఇదే సమయంలో పూజ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు పూజ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? మనోజ్, జెస్సీలకు దీంతో ఏదైనా సంబంధం ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

టాలీవుడ్‌లో ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు మంచి ఆదరణ కనిపిస్తోంది. అలాంటి జానర్లో రూపొందిన సినిమా కావడమే ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పూర్తిగా రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో, కొత్త కథాంశంతో తెరకెక్కడం, దానికి గోవా నేపథ్యం ఎంచుకోవడం బాగుంది. నటీనటులంతా కొత్తవారే అయినా తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారని చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా బాగానే ఆకట్టుకుంటుందని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ – ప్రధమార్థం. మొదలవ్వడమే చాలా డల్‌గా మొదలయ్యే సినిమా, ఆసక్తి కలిగించే సన్నివేశాల్లేక, అర్థం పర్థం లేకుండా, ఇంతకుముందే చూసేసామే అనిపించే సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. సెకండాఫ్ కూడా పైన చెప్పుకున ట్విస్ట్‌లను పక్కనబెడితే పెద్దగా ఆకట్టుకోవడానికి ఏమీ లేదు.

అలాగే సందర్భం లేకుండా వచ్చే పాటలు అసహనానికి గురిచేస్తాయి. రిసార్ట్స్ లో హత్య జరిగింది అని ఊరికే చెపుతుంటారు కానీ, అదేంటో చెప్పరు. చూపించరు. ఇక ఎక్కడా బలమైన ఎమోషన్ కనిపించకపోవడం; హీరో, హీరోయిన్ల పాత్రలకు ఒక వ్యక్తిత్వం అంటూ లేకపోవడం లాంటివి మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ చివర్లో పిజ్జా సినిమా చాయలు కనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. పాటలన్నీ కథ పరంగా వచ్చేవే కాకుండా వినడానికి కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనే స్థాయిలో మాత్రమే ఉంది. ఎడిటింగ్ కూడా అంతంతమాత్రమే.

ఈజీ మనీ గురించి ఓ కథ చెప్పాలన్న దర్శకుడి ఆలోచన బాగున్నా, దాన్ని ఓ పూర్తి స్థాయి కథగా మలచడంలో విఫలమయ్యాడు. దర్శకుడిగా అక్కడక్కడా ఆకట్టుకున్నా, పూర్తి స్థాయిలో మాత్రం కేవలం ఫర్వాలేదనిపించాడు. దర్శకుడే సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టినా ఆ రెండింటితో కలిపి చేయదగ్గ మ్యాజిక్ ఏమాత్రం కనిపించదు. నిర్మాణ విలువలు ఫరవాలేదు.

తీర్పు :

ఈజీ మనీ సంపాదించడానికి యువత ఎలా రకరకాల మార్గాలను ఎంచుకొని తప్పుదారులు పడుతుందీ? అన్న అంశాన్నే కథాంశంగా తీసుకొని మన ముందుకు వచ్చిన ముసుగు సినిమా, అసలు విషయాన్ని చెప్పక పూర్తిగా విఫలమైంది. ఎంచుకున్న కథాంశం, సెకండాఫ్‌లో వచ్చే రెండు ట్విస్ట్‌లు, పలు రొమాంటిక్ సన్నివేశాలు ప్లస్‌లుగా నింపుకొని వచ్చిన ఈ సినిమాలో మిగతావన్నీ మైనస్‌లే! ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏదో చెప్పాలనుకొని వచ్చిన ఈ సినిమా, ఏదీ చెప్పలేక, ఓ అర్థం లేని సినిమాగా మాత్రమే మిగిలిపోయింది.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు