సమీక్ష : నేల టిక్కెట్టు – ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు

సమీక్ష : నేల టిక్కెట్టు – ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు

Published on May 26, 2018 2:48 PM IST
Nela Ticket movie review

విడుదల తేదీ : మే 25, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు

దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ

నిర్మాత : రామ్ తాళ్లూరి

సంగీతం : శక్తి కాంత్ కార్తిక్

సినిమాటోగ్రఫర్ : ముకేష్. జి

ఎడిటర్ : చోటా కె. ప్రసాద్

స్క్రీన్ ప్లే : సత్యానంద్

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’. కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

చిన్నప్పటి నుండి అనాథలా పెరిగిన నేల టిక్కెట్ (రవితేజ) చుట్టూ జనం మధ్యలో మనం, జీవితంలో అందరినీ కలుపుకుని పోవాలి అనే తత్వంతో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తుంటాడు. అలా జనానికి సహాయం చేసే ప్రక్రియలో అతనికి, హోమ్ మంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు)కి మధ్యన తరచూ గొడవలు జరుగుతుంటాయి.

ఒకానొక సందర్భంలో నేల టిక్కెట్ తాను కావాలనే ఆదిత్య భూపతితో గొడవ పెటుకుంటున్నానని అంటాడు. అసలు నేల టిక్కెట్ హోమ్ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు, వారిద్దరికీ మధ్యన సంబంధం ఏమిటి, హోమ్ మంత్రి చేసిన తప్పేమిటి అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్:

సినిమా మొత్తంలో బాగా ఆకట్టుకునే అంశం మాస్ మహారాజ పెర్ఫార్మెన్స్. రవితేజ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమాను తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేశారు. ఫైట్ సీన్స్, ఫన్నీ సన్నివేశాలను బాగానే రక్తి కట్టించారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కొన్ని మంచి సన్నివేశాలను రాయడంతో అక్కడక్కడా సినిమా కొంత పర్వాలేదనిపించింది.

అలాగే దర్శకుడు హీరో పాత్ర ద్వారా అందరితో కలిసే ఉండాలి, మనుషులే జీవితం అనే సోషల్ మెసేజ్ ఇవ్వడం బాగుంది. ఇక సినిమా అసలు కథలోకి ప్రవేశించే ఇంటర్వెల్ సన్నివేశం బాగుంది. ఆ సన్నివేశంతో సెకండాఫ్ మీద కొంత ఆసక్తి ఏర్పడింది. ఇక మధ్య మధ్యలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, ప్రియదర్శి, అలీలు చేసిన కామెడీ పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత నవ్వించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మెనస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పాల్సింది దర్శకుడి గురించి. ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చూస్తే అసలిది ‘సోగ్గాడే చిన్ని నాయన’ లాంటి హిట్ సినిమాను తీసిన కళ్యాణ్ కృష్ణ పనితీరేనా అనిపిస్తుంది. హీరో పాత్ర, ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని ఫన్నీ సన్నివేశాలు మినహా మిగతా చిత్రం మొత్తం బోర్ కొట్టించేలా ఉంది.

ఇంటర్వెల్ ముందు వరకు అసలు హీరో లక్ష్యమేమిటో బయటపడకపోవడంతో కొంత చికాకు కలగ్గా, సెకండాఫ్లో హీరో చేసే ప్రయాణం విసుగు తెప్పించింది. ప్రతి పది నిముషాలకు సినిమా ట్రాక్ మారుతూ పోతుండటంతో ఎక్కడా ప్రేక్షకుడికి కుదురుగా సినిమా చూసే ఆస్కారం కలగలేదు. కథనం ఎలాగూ బాగాలేదు కనీసం సన్నివేశాలైనా బాగున్నాయా అంటే అదీ లేదు.

ప్రతి సీన్ రొటీన్ గా, సాగదీసినట్టు, కథనం మధ్యలోకి బలవంతంగా ఇరికించినట్టు ఉంది. ఇక హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ అయితే ఏమాత్రం అలరించలేకపోయింది. సినిమాలో హీరో పాత్ర, ఇంటర్వెల్ సీన్ మినహా చెప్పుకోవడానికి వేరే బలమైన పాత్రలు, సన్నివేశాలు అస్సలు కనిపించవు. సంపత్, జగపతిబాబు, పోసాని, బ్రహ్మానందం, అలీ వంటి మంచి పెర్ఫార్మలని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు దర్శకుడు. వీటన్నిటికీ తోడు మధ్యలో వచ్చే పాటలైతే అస్సలు వినదగినవిగా లేవు. సంగీతం వింటుంటే ‘ఫిధా’ సినిమాకు అద్భుతమైన సంగీతం ఇచ్చిన శక్తి కాంత్ పాటలా ఇవి అనే అనుమానం కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హీరో పాత్రను బలంగానే రాసుకుని, దాని ద్వారా మెసేజ్ ఇచ్చిన ఆయన కథ, కథనాల విషయంలో తీవ్ర నిరుత్సాహానికి గురిచేశారు. సినిమాను ఒక దిశలో నడపకుండా అనవసరమైన అనేక పాత్రలతో, సన్నివేశాలతో, పేలవమైన కథనంతో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశారు.

సంగీత దర్శకుడు శక్తి కాంత్ సంగీతం ఏ కోశానా మెప్పించలేకపోయింది. ఏ ఒక్క పాట అలరించలేకపోయింది. ముకేష్. జి సినిమాటోగ్రఫి ఏదో కొన్నేళ్ల క్రితం సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగించింది. ఎడిటర్ చోటా.కె.ప్రసాద్ తన ఎడిటింగ్ ద్వారా అనవసరమైన చాలా సన్నివేశాలను తొలగించాల్సింది. రామ్ తాళ్లూరి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వ లోపం కారణంగా ఈ ‘నేల టిక్కెట్టు’ చిత్ర ఫలితం పూర్తిగా తలకిందులైపోయింది. బలహీనమైన రెగ్యులర్ కథ, సన్నివేశాలు, ఎటు పోతుందో తెలియని, ఖచ్చితమైన గమ్యంలేని కథనం, పాటలు అన్నీ కలిసి ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ కరువయ్యేలా చేశాయి. రవితేజ పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్లాక్ మినహా ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలేవీ కనబడవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ‘నేల టిక్కెట్టు’ ఎంటర్టైన్మెంట్ ఇవ్వదని అనొచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు