సమీక్ష : నేను శైలజ – ఫీల్ గుడ్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్

సమీక్ష : నేను శైలజ – ఫీల్ గుడ్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్

Published on Jan 2, 2016 11:45 AM IST
Nenu Sailaja review

విడుదల తేదీ : 01 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : కిషోర్ తిరుమల

నిర్మాత : స్రవంతి రవి కిషోర్

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

నటీనటులు : రామ్, క్రీతి సురేష్, సత్యరాజ్, నరేష్..

రొటీన్ కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఫ్రెష్ నెస్ కోసం యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నేను శైలజ’. మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ మరియు సాంగ్స్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

‘నేను..శైలజ’ టైటిల్ లో నేను అనేదాన్ని రెప్రజెంట్ చేసే హరి(రామ్) కథే ఈ సినిమా.. హరి ఓ నైట్ క్లబ్ లో డిజేగా పనిచేస్తుంటాడు. చిన్నతనం నుంచి కనిపించిన అమ్మాయి కల్లా ప్రపోజ్ చేయడం ఆ అమ్మాయి నో అంటే ఇంకో అమ్మాయిని చూడడం. అలా తను ప్రేమ అనుకొని ప్రపోజ్ చేసిన అందరూ మనం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి వెళ్లిపోతుంటారు. దాంతో ఇక నా లైఫ్ లో ప్రేమకి ప్లేస్ లేదు అనుకుంటాడు. అలాంటి టైంలో మన హీరో హరికి శైలజ (కీర్తి సురేష్) కనపడుతుంది. గత అనుభవాల వల్ల ఒకటి రెండు సార్లు నో అనుకున్నా అనుకోకుండా తనతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అదే విషయాన్ని కీర్తికి చెబితే హరి ఐ లవ్ యు బట్ ఐ యాం నాట్ ఇన్ లవ్ విత్ యు అని చెప్పి వెళ్ళిపోతుంది.

ఆ బాధలో హరి గడ్డం పెంచుకొని దేవదాసులా మారతాడు. కానీ ఆ టైంలో కీర్తి ఎందుకు తన ప్రేమకి నో చెప్పింది అనే విషయం హరికి తెలుస్తుంది. అది తెలుసుకున్న హరి మళ్ళీ శైలజ లైఫ్ లోకి ఎలా వెళ్ళాడు? హరి ఎలా శైలజకి ఉన్న సమస్యను పరిష్కరించాడు? ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో హారి ఎవరెవరికి దగ్గరయ్యాడు? ఫైనల్ గా హరి కీర్తి ప్రేమని పొందగలిగాడా లేదా అన్నదే సినిమా కథ..

ప్లస్ పాయింట్స్ :

‘నేను శైలజ’ అనే సినిమాకి ఆల్ టైం బెస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది అంటే అది రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనే చెప్పాలి. కథలోని ఫీల్ ని పాటల్లో, నేపధ్య సంగీతంలో దేవీశ్రీ చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలోకి వస్తే ఫస్ట్ హాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. హరి కథ మొదలు అయినప్పటి నుంచీ మన లైఫ్ లో, మన ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న సంఘటనల్లా అనిపించే సన్నివేశాలతో సినిమాని మొదలు పెట్టడం అలానే సినిమాని కంటిన్యూ చేయడం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రామ్ లైఫ్ లో జరిగే అనుభవాలను ప్రేక్షకులు బాగా నవ్వుకునేలా తీసారు. ఇకపోతే రామ్ – కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ ని చాలా లైవ్లీగా, ఫీల్ గుడ్ అనిపించేలా చేయడం ఫస్ట్ హాఫ్ కి ప్రాణం అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఫస్ట్ హాఫ్ సినిమాని నిలబెట్టేసింది.

ఇక ఈ సినిమాకి నటీనటుల పరంగా బిగ్గెస్ట్ హెల్ప్ అయిన వారు ఇద్దరు వాళ్ళే లీడ్ పెయిర్ అయిన రామ్ – కీర్తి సురేష్. రామ్ ని చాలా కాలంగా ఒకే మూస పాత్రల్లో చూస్తున్నాం.. కానీ ఇందులో వాటన్నిటికీ పూర్తి డిఫరెంట్ గా అనిపించే రామ్ ని చూస్తాం. రామ్ లోని అసలైన నటున్ని ఈ సినిమాలోనే చూస్తాం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన పాత్ర ఎంత నాచురల్ గా ఉంటుందో అంతే నాచురల్ గా రామ్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. రామ్ హావ భావాలు, డైలాగ్ డెలివరీ, మానరిజమ్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇక కీర్తి సురేష్ ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ లో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. హీరోయిన్ అనే ఫీలింగ్ ని తీసుకు రాకుండా మన పక్కింటి అమ్మాయిలా కానిపిస్తుంది. కానీ ఈ సినిమాలో తనకి డైలాగ్స్ తక్కువ, నవ్వే సీన్స్ కూడా తక్కువే అయినా ఇచ్చిన సీరియస్ పాత్రకి న్యాయం చేసింది. ఓవరాల్ గా రామ్ – కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ బాగుంది. ఇక ముఖ్యమైన పాత్రలో సత్యరాజ్ మరోమారు మెప్పించాడు. సత్యరాజ్ – కీర్తి సురేష్ – రామ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ప్రదీప్ రావత్ ఈ సినిమాలో మొదటిసారి కామేడీ టచ్ ఉన్న పాత్ర చేసి అక్కడక్కడా ప్రేక్షకులను మెప్పించాడు.

సీనియర్ ప్రిన్స్, శ్రీముఖి, నరేష్, ప్రగతి, కృష్ణ భగవాన్, జబర్దస్త్ సుధీర్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించడమే కాకుండా అడపాదడపా నవ్వించారు. ఇక సినిమాలో చెప్పుకోదగిన విషయాలు అంటే సెకండాఫ్ లో అక్కడక్కడా సందర్భానుసారంగా వచ్చే కామెడీ బాగా పేలింది. అలాగే సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేషాలు బాగా ఎమోషనల్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో బీచ్ లో మందు కొట్టే సీన్ చాలా చాలా నవ్వు తెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సెకండాఫ్… సెకండాఫ్ లో అక్కడక్కడా కామెడీ ఉన్నా, ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ బాగున్నా మిగతా అంతా బాగా ఊహాజనితంగా సాగడమే కాకుండా బాగా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ని కాస్త ఎంటర్టైనింగ్ గా తీసినా, డైరెక్టర్ సెకండాఫ్ ని అంత బాగా రాసుకోలేదనిపిస్తుంది. ఎక్కువగా ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోవడం వలన సినిమా బాగా స్లోగా అనిపిస్తుంది. అలాగే కథనం మరింత ఊహాజనితంగా సాగడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్.

సినిమా మొత్తంగా డీల్ చేసింది మెయిన్ పాయింట్ తండ్రి – కుమార్తెలు మధ్య ఎమోషన్ అండ్ లవ్. కానీ తండ్రి – కుమార్తెల మధ్య అసలు దూరం ఎందుకు మొదలైంది, ఆ దూరం అలా 25 ఏళ్ళు కొనసాగడానికి గల కారణాన్ని పర్ఫెక్ట్ గా చూపించలేదు. అలాగే ఓవరాల్ గా కథ పరంగా చూసుకుంటే చాలా పాతదే అనిపిస్తుంది. ఇకపోతే సినిమాలో ఒక్క హీరో పాత్రని తప్ప మిగతా అన్ని పాత్రలని ఎందుకు అంత సీరియస్ గా, ఎలాంటి ఫీలింగ్ ని ఎక్స్ ప్రెస్ చేయకుండా రాసుకున్నారు అన్నదానికి ఎక్కడా సరైన క్లారిటీ కనిపించలేదు. అలాగే హీరోయిన్ పాత్రని ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉంటే సినిమాలో ఇంకాస్త లవ్లీ ఫీలింగ్ వచ్చేది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ టీంలోని రెండు మూడు విభాగాలే ఈ సినిమాని నిలబెట్టేసాయి. అందులో మొదటిది మ్యూజిక్.. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ ఆల్బం ఎంత బాగుందో పాటల పిక్చరైజేషన్ అంతకన్నా బాగుంది. పాటల కంటే మించి నేపధ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోసాడు దేవీశ్రీ ప్రసాద్. ఇక సమీర్ రెడ్డి వైజాగ్, పొల్లాచ్చిలను చూపించిన విధానం చాలా బాగుంది. మూవీ కాన్సెప్ట్ లాగానే విజువల్స్ కూడా లైవ్లీ గా, ఫీల్ గుడ్ అనిపించేలా ఉన్నాయి. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వేసిన స్పెషల్ సెట్స్ బాగున్నాయి. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా సూపర్బ్ అనిపిస్తుంది, కానీ సెకండా ఫ్లో మాత్రం ఎక్కడో తగ్గింది అనే ఫీలింగ్ వస్తుంది.

ఇక ఈ సినిమాకి కథ – కథనం – మాటలు – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది కిషోర్ తిరుమల. కథా పరంగా కిషోర్ కొత్త కథ చెప్పడానికి ట్రై చేయలేదు. కానీ ఎమోషన్స్ ని కొత్తగా చూపడానికి ట్రై చేసాడు. అందుకోలో కొంత సక్సెస్ అయినా కొంతభాగం సక్సెస్ కాలేకపోయాడు. కథనం ఇంకా బాగా రాసుకోవాల్సింది ముఖ్యంగా సెకండాఫ్ ని.. మొదటి నుంచే సినిమా ఎలా ఉంటుందో అని తెలిసినా హీరో – హీరోయిన్ క్రియేట్ చేస్తున్న మేజిక్ వలన ఫస్ట్ హాఫ్ చివరి వరకూ ఆ ఫీల్ రాదు కానీ సెకండాఫ్ లో మాత్రం ఆ మేజిక్ మిస్ అవ్వడం వలన చాలా బోరింగ్ గా ఉంటుంది క్లైమాక్స్ ని కూడా బాగా సాగదీసేసారు. ఇక డైరెక్టర్ గా పూర్తి సినిమాతో ఎంటర్టైన్ చేయలేకపోయినా, హాఫ్ అయితే మెప్పించాడు. డైరెక్టర్ గా కిషోర్ కొన్ని కొన్ని విషయాలను చాలా బాగా ప్రెజంట్ చేసాడు. కొన్ని విషయాలను ప్రజంట్ చేయలేకపోయాడు. ఇక స్రవంతి రవికిషోర్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్బ్ అనేలా ఉన్నాయి.

తీర్పు :

రొటీన్ సినిమాలను పక్కన పెట్టి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ట్రై చేసిన ఫీల్ గుడ్ ప్రేమకథ ‘నేను.. శైలజ’ ప్రేక్షకులకు కూడా మంచి ఫీల్ ని అందించి, రామ్ కి కావాల్సిన హిట్ ని ఇచ్చింది. రామ్ పాత్రని డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రలో రామ్ నటించిన తీరు, ఆయన డైలాగ్స్ ఇలా వన్ మాన్ ఆర్మీలా రామ్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. అటు యువతకి కనెక్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉండడమే ఆడియన్స్ ని ఆకర్షించే విషయం. రామ్ సూపర్బ్ పెర్ఫార్మన్స్, సూపర్ అనిపించే ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్, క్యూట్ లవ్ ట్రాక్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకి పెద్ద ప్లస్ అయితే సెకండాఫ్ కాస్త స్లో అండ్ బోరింగ్ గా ఉండడం, ఓవరాల్ గా కథ పాతదే అనిపించడం లాంటి విషయాలు చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఈ న్యూ ఇయర్ రోజున హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయదగిన సినిమానే ఈ ‘నేను శైలజ’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు