సమీక్ష : ప్లేయర్ – కొత్త నేపథ్యమే కానీ.. పాత ‘ఆట’!

సమీక్ష : ప్లేయర్ – కొత్త నేపథ్యమే కానీ.. పాత ‘ఆట’!

Published on Oct 31, 2015 6:20 PM IST
Player-review

విడుదల తేదీ : 30 అక్టోబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : జ్ఞాన సాగర్

నిర్మాత : యమున కిషోర్, జగదీష్ కుమార్‌‌

సంగీతం : రజీష్ రఘునాథ్

నటీనటులు : పర్వీన్ రాజ్, నాగినీడు, సీత, షాహీహాందీ


ట్రిపులెక్స్ సోప్ ప్రకటన ద్వారా పరిచయమైన నటుడు పర్వీన్ రాజ్ వెండితెరకు హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘ప్లేయర్’. క్యాసినో నేపథ్యంలో నడిచే ఈ సినిమాను డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్‌పై యమున కిషోర్, జగదీష్ కుమార్‌‌లు నిర్మించారు. జ్ఞాన సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఓ సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది? చూద్దాం..

కథ :

జయదేవ్ అలియాస్ జై (పర్వీన్ రాజ్) ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ చదవాలన్న తన కలను నెరవేర్చుకోవడం కోసం తల్లి (సీత)తో కలిసి బ్యాంకాక్‌లో నివసిస్తుంటాడు. సాయంకాలం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూనే చదువుకుంటూ ఉండే జైకి ఏఐటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ మైఖేల్ (నాగినీడు) పరిచయమవుతాడు. చదువులతో పాటు, మెమొరీ పవర్లో కూడా ముందుండే జై, ప్రొఫెసర్ మైఖేల్‌ను విపరీతంగా ఆకర్షిస్తాడు. డబ్బు సంపాదన కోసం మైఖేల్, క్యాసినో (పేకలతో ఆడే కార్ట్ కౌంటింగ్, గ్యాంబ్లింగ్ వంటివి నడిచే ప్రదేశం)కు ఒక టీమ్‌ను తయారుచేసే కార్యక్రమాలు చేస్తూంటాడు.

జై, మొదట్లో ఈ క్యాసినో ఆటలు ఆడటానికి ఇష్టపడకపోయినా కుటుంబ పరిస్థితుల వల్ల డబ్బుల కోసం ఒక టీమ్‌తో కలిసి కార్డ్ కౌంటింగ్ ఆడుతూంటాడు. ఈ కార్డ్ కౌంటింగ్‌లో తనదైన ప్రతిభతో జై, ఆడే అన్ని ఆటల్లోనూ గెలుస్తూ తనకు కావాల్సిన డబ్బులు సమకూర్చుకుంటూంటాడు. ఈ క్రమంలోనే ఒకనొక సందర్భంలో జైకి, మైఖేల్‍ అసలు నిజం తెలిసి కార్ట్ కౌంటింగ్ గేమ్ ఆడనని వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు మైఖేల్ ఏం చేశాడు? మైఖేల్‌కి, జై గతానికి ఉన్న సంబంధం ఏంటి? తన జీవితంలో ఎదురైన విపరీత పరిస్థితులను జై ఎలా ఎదుర్కున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే ప్లేయర్ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే క్యాసినో నేపథ్యంలో ఒక కథను చెప్పాలనుకునే ప్రయత్నం గురించి చెప్పుకోవచ్చు. కార్డ్ కౌంటింగ్ గేమ్ నేపథ్యంలో తెలుగులో పెద్దగా సినిమాలు రానందున ఈ అంశం ప్లేయర్‍కు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. క్యాసినో పరిస్థితులు, అక్కడి గ్యాంబ్లింగ్ తరహా సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇక బ్యాంకాక్, హాంగ్ కాంగ్ లొకేషన్స్ కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి. దీంతో సినిమా చూస్తున్నప్పుడు ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది.

హీరోగా నటించిన పర్వీన్ రాజ్ మొదటి సినిమా అయినా బాగానే నటించాడు. సీత, నాగినీడులతో వచ్చే సన్నివేశాల్లో పర్వీన్ బాగా చేసాడు. లుక్స్ విషయంలో మాత్రం మరింత జాగ్రత్తపడాల్సి ఉంది. ఇక నటుడు నాగినీడు ఇలాంటి పాత్రల్లో చాలా తక్కువగా చూస్తుంటాం. ఆయనలోని కొత్త యాంగిల్‌ను ఈ సినిమాలో చూడొచ్చు. ప్రొఫెసర్‌గా, గ్యాంబ్లర్‌గా బాగా ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ పెట్టాల్సింది. తల్లి పాత్రల్లో సీత ఎప్పట్లానే బాగా నటించింది. ఇక లారా అనే పాత్రలో నటించిన విదేశీ భామ షాహీహాందీ క్యూట్‌గా ఉంది.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు హైలైట్‍గా చెప్పుకోవచ్చు. కార్డ్ కౌంటింగ్ గేమ్‌ను పరిచయం చేయడం, ప్రొఫెసర్ మైఖేల్ తన ప్లాన్‌ను అమలు చేయడం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో బాగుంది. ఇక సెకండాఫ్ విషయంలో క్లైమాక్స్‌ను సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ప్లేయర్ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే.. తెలుగు సినిమాల్లో ఎప్పట్నుంచో చూస్తూ వస్తోన్న రివెంజ్ ఫార్ములానే ఈ సినిమాకూ వాడడం గురించి చెప్పుకోవచ్చు. ఒక్క క్యాసినో అనే బ్యాక్‌డ్రాప్ వదిలేస్తే ఈ సినిమాలో కొత్తదనమనేదే లేదు. తెలిసిన రివెంజ్ ఫార్ములా కథను కూడా ఆసక్తికర సన్నివేశాలేవీ లేకుండా ఒకే మూసలో నడిపించడంతో సినిమా ఎక్కడా ఎగ్జైట్ చేయదు. క్యాసినో అనే బ్యాక్‌డ్రాప్ కాకపోయి ఉంటే ఈ సినిమా ఫక్తు మూస మసాలా సినిమా అనిపించుకునే ఫార్ములా!

ఇక సినిమాలో చాలా తక్కువ పాత్రలే ఉన్నా ఏ పాత్రకూ మరో పాత్రతో సరైన ఎమోషనల్ కనెక్ట్ లేదు. తల్లి – కొడుకు, ప్రొఫెసర్- స్టూడెంట్, విలన్-హీరో ఇలా ఏ రెండు పాత్ర నేపథ్యాలను ఎంచుకొని చూసినా ఎగ్జైట్ చేయగలిగే అంశాలేవీ లేవు. అదేవిధంగా కార్డ్ కౌంటింగ్ గ్యాంబ్లింగ్ గేమ్‌పై మరికొంత స్పష్టమైన అవగాహన కల్పించి ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో సినిమా ఒకే ఒక్క అంశం వైపు వెళ్తూ పూర్తి రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. ఇక హీరో పాత్రకు చెప్పించిన డబ్బింగ్.. పాత్ర ఔచిత్యానికి, వయసుకి ఏమాత్రం తగ్గట్టుగా లేదు.

ఇక రెగ్యులర్ సినిమాల్లో కనిపించే కామెడీ, రొమాన్స్, పాటలకు ఈ సినిమాలో ప్రాధాన్యత లేదు. ఒకరకంగా ఈ అంశాలు ప్లస్ పాయింట్స్ అయినా రెగ్యులర్ సినిమాలనే కోరుకునేవారికి ఇవే మైనస్!

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల ప్రస్తావనకు వస్తే.. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు సినిమాటోగ్రాఫర్ ఎస్. సురేష్ కు ఇవ్వొచ్చు. బ్యాంకాక్, హాంగ్‌కాంగ్‌లలోని పలు అందమైన లొకేషన్స్‌ను సురేష్ బాగా క్యాప్చర్ చేశారు. ఇక క్యాసినో మూడ్‌ను తీసుకురావడంలో లైటింగ్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. నిర్మాతలు యమున కిషోర్, జగదీష్ కుమార్‌ల ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ప్లేయర్ అనే సినిమాకు కావాల్సిన మూడ్‌ను తీసుకురావడంలో ఉపయోగపడ్డాయి.

ఇక దర్శకుడు జ్ఞాన సాగర్ గురించి చెప్పుకుంటే.. కథా నేపథ్యాన్ని ఎంచుకోవడంలో కొత్తదనం చూపించిన దర్శకుడు, దాన్ని ఒక కథలా, ఆసక్తికర సినిమాలా మలచడంలో మాత్రం కొత్తదనమేమీ చూపించలేదు. దర్శకుడిగా క్యాసినోలో వచ్చే కొన్ని సన్నివేశాలు కంపోజ్ చేసిన విధానంలో ఓకే అనిపించుకున్నా, ఓవరాల్‌గా ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులకు అందించాలన్న ఆలోచనలో మాత్రం ఫెయిలయ్యారు. డైలాగులు కొన్ని బాగున్నా, ఓవరాల్‌గా చూస్తే కొన్ని డైలాగులు కృత్రిమంగా ఉన్నాయి. రజీష్ రఘునాథ్ సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి ఫీల్‌నే ఇచ్చింది. వినయ్ రామస్వామి ఎడిటింగ్ ఫర్వాలేదు.

తీర్పు :

క్యాసినో గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో ఇప్పటివరకూ చాలా తక్కువ సినిమాలే వచ్చిన పరిస్థితుల్లో ఈ అంశంపైనే నడుస్తూ వచ్చిన ఓ కొత్త ప్రయత్నం ‘ప్లేయర్’. ఏ భాష సినిమా అయినా కొత్త ప్రయత్నాలనేవి ప్రయత్నాల దగ్గరే ఆగిపోతే ఆశించిన ఫలితం దక్కదు. ఈ విషయం ఇప్పటికి చాలాసార్లే ఋజువు అయినా కూడా ఒక ప్రయత్నాన్ని ప్రయత్నం దగ్గరే ఆపేసిన సినిమాగా ప్లేయర్‌ను చెప్పుకోవచ్చు. కొత్త బ్యాక్‌డ్రాప్, ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఫస్టాఫ్‌లో వచ్చి కొన్ని ఆసక్తికర సన్నివేశాలు, బ్యాంకాక్ లొకేషన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచే అంశాలు. ఇక ఇప్పటికే మరీ పాతదైపోయిన స్టీరియో టైప్ రివెంజ్ డ్రామా కథనే తెలుగు సినిమా ఫార్మాట్‌లో సాదాసీదాగా నడిపించడం, ఎమోషనల్‌గా వీక్‌గా కథను నడిపించం వంటివి ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ప్లేయర్‌లో కొత్తగా ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేవు. తెలుగు సినిమాకు కొత్తదైన క్యాసినో బ్యాక్ డ్రాప్ కోసం ఈ సినిమాను చూస్తే చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు