సమీక్ష : రచ్చ – మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రచ్చ

సమీక్ష : రచ్చ – మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రచ్చ

Published on Apr 5, 2012 2:47 PM IST
విడుదల తేది :05 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : సంపత్ నంది
నిర్మాత : ఎన్ .వి .ప్రసాద్, పారస్ జైన్
సంగీత దర్శకుడు : మణి శర్మ
తారాగణం : రామ్ చరణ్ తేజ, తమన్న

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం ‘రచ్చ’. సంపత్ నంది దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ మరియు పారస్ జైన్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. రచ్చ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

బెట్టింగ్ రాజ్ (రామ్ చరణ్) బెట్టింగ్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే యువకుడు. జేమ్స్ (అజ్మల్)తో ఒక సాహోసపేతమైన పందెం కట్టి గెలుస్తాడు. పందెంలో ఓడిపోయిన జేమ్స్, రాజ్ తో మరో పందెం కడతాడు. బళ్ళారి (ముఖేష్ రుషి) ముద్దుల కూతురు చైత్ర (తమన్నా)ని రాజ్ ప్రేమలో పడేసి ఆమె చేత ఐ లవ్యూ చెప్పించుకుంటే 20 లక్షలు ఇస్తానంటాడు. డబ్బు అవసరంలో ఉన్న రాజ్ ఆ పందెంకి అంగీకరిస్తాడు. అనుకున్న ప్రకారం చైత్రని ప్రేమలో పడేస్తాడు. ఆమె ఐ లవ్యూ చెప్పే సమయానికి కథ అనుకోని మలుపు తిరుగుతుంది. బళ్ళారి తన కూతురు చైత్రని చంపడానికి చేసే ప్రయత్నాన్ని రాజ్ అడ్డుకొని ఆమెను కాపాడతాడు. బళ్ళారి తన కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు ఈ జేమ్స్ ఎవరు? అతనికి చైత్రకి సంబంధం ఏమిటి? ఇలాంటి చిక్కుముడులన్నీ వీడాలంటే రచ్చ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

బెట్టింగ్ రాజ్ పాత్రలో రామ్ చరణ్ అభిమానుల్ని అలరించాడు. డాన్సుల్లో తన ప్రత్యేక శైలిని చాటుకున్నాడు. ముఖ్యంగా డిల్లకు డిల్లకు పాటలో స్టెప్స్ అలరిస్తాయి. డైలాగ్ డెలివరీలో బాగా పరిణతి సాధించాడు. అభిమానుల్ని అలరించే డైలాగులు చెప్పాడు. దాదాపు అన్ని విభాగాల్లోనూ ప్రేక్షకుల శెభాష్ అనుకున్నాడు. ఫైట్స్ కూడా మాస్ ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా చాలా రిస్కుతో కూడుకున్న ఇంట్రడక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి. తమన్నా చాలా బాగా నటించింది. వాన వాన పాటలో ప్రేక్షకులను మైమరిపించేలా చేసింది. చైత్ర పాత్రకు పూర్తి న్యాయం చేసింది. జేమ్స్ పాత్రలో అజ్మల్ చిన్న పాత్రే అయినా బాగా చేసాడు. బళ్ళారిగా ముఖేష్ రుషి బాగానే చేసాడు. రఘుపతి పాత్రలో నాజర్, సూర్యనారాయణగా తమిళ నటుడు పార్తిబన్ పర్వాలేదనిపించారు. రంగీల పాత్రలో బ్రహ్మానందం బాగా నవ్వించాడు. బెట్టింగ్ రాజ్ స్నేహితులుగా వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేష్ బాగానే నవ్వించారు. పాపారావు అలియాస్ లవ్ గురు పాత్రలో అలీ కనిపిస్తాడు, అలీ మరియు జయప్రకాష్ రెడ్డి మధ్య సన్నివేశాలు కూడా బాగానే నవ్విస్తాయి. పరుచూరి వెంకటేశ్వరరావు, కోట శ్రీనివాసరావు, దేవ్ గిల్ తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. చిత్ర మొదటి భాగం ఎ క్లాస్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్:

చిత్ర కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ అని చెప్పుకోవాలి. గతంలో వచ్చిన చాలా సినిమాల కథల్ని కలిపి దర్శకుడు రచ్చ కథని తయారు చేసుకున్నాడు. చిత్ర రెండవ భాగంలో కథలో కొత్తదనం లోపించింది. లాజిక్ కు అందని సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. చైనాలో తీసిన బాంబూ ఫైట్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. అదే విధంగా సింగరేనుంది పాట కూడా ఆకట్టుకోలేదు. చిత్ర మొదటి భాగం అంతా బన్నీ సినిమాను, రెండవ భాగం ఊసరవెల్లి మరియు పలు సినిమాలను తలపిస్తుంది.

సాంకేతిక విభాగం:

ఎడిటింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఒక పాదం మరియు సింగరేనుంది పాట సరైన టైమింగ్ లేక తేలిపోయాయి. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు అభిమానులని అలరిస్తాయి. రసూల్ ఎల్లోర్ అందించిన సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బావుంది. మణిశర్మ సంగీతంలో టైటిల్ సాంగ్, వాన వాన వెల్లువాయే, డిల్లకు డిల్లకు పాటలు అలరించాయి. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ సినిమాను నిలబెడతాయి అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అధ్బుతంగా ఇచ్చారు. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ ఆ కథ చెప్పే విధానంలో మాత్రం ఎక్కడా తడబడలేదు.

తీర్పు:

రచ్చ చిత్రం మాస్ ఆడియెన్సుని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. సినిమాలో కొత్తదనం లేకపోయినా మాస్ ఆడియెన్సును మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన, తమన్నా అందాలతో పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రచ్చ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.

 

123తెలుగు.కాం రేటింగ్ : 3/5

 

అశోక్ రెడ్డి -ఎం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు