విడుదల తేదీ : జూలై 31, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : సుమంత్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, తదితరులు
దర్శకత్వం : రాజేశ్ కర్ణ
సంగీతం : సింజిత్ యర్రమిల్లి
నిర్మాతలు : హరీశ్ కొహిర్కర్
సినిమాటోగ్రఫీ : వేద వ్యాస్ గొట్టిపాటి
ఎడిటింగ్ : అనిల్ పలాస
సంబంధిత లింక్స్ : ట్రైలర్
సుమంత్ హీరోగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘న్యూటన్స్ థర్డ్ లా’. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
వినయ్ (త్రినాథ్ వర్మ) ఇంజినీరింగ్ విద్యార్థి. అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో ఇంటిపై నుంచి పడి చనిపోతాడు. ఈ కేసుని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) వస్తాడు. అయితే, వినయ్ ది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని అనుమానాలు తలెత్తుతాయి. మిస్టరీగా మారిన కేసును వాసుదేవ్ తనదైన శైలిలో దర్యాప్తు చేస్తాడు. వినయ్ తల్లిదండ్రులు పార్వతి (షెల్లి ఎన్ కుమార్) – గంగాధర్ (రవివర్మ)లను తనదైన శైలిలో విచారించగా.. కొన్ని ఆసక్తికర విషయాలు బయట పడతాయి. అలాగే వాళ్లు ఏదో తప్పు చేయడంతో పాటు అతనికి సంబంధించిన కొన్ని విషయాల్ని దాస్తున్నారని అర్థమవుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వినయ్ కి క్రిమినల్ మెర్కురీ(జగపతి బాబు)కి కనెక్షన్ ఉందని క్లారిటీ వస్తుంది.
అలాగే జ్యోతి అనే మహిళ యాక్సిడెంట్ కేసుకు.. వినయ్ – మెర్య్కురీలకూ ఉన్న లింక్ ఏంటి? ఈ ఘటనల్ని ‘న్యూటన్ థర్డ్ లా’ పేరుతో పుస్తకంగా రాసింది ఎవరు? ఆ పుస్తకాన్ని చూసి డేవిడ్ (శ్రీనివాస్ అవసరాల) ఎందుకు భయపడ్డాడు?
చివరికి న్యూటన్ థర్డ్ లా మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఎలా ఉపయోగపడింది? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుందనే కోణంలో సాగిన స్క్రీన్ ప్లే బాగుంది. పైగా న్యూటన్ థర్డ్ లాను బేస్ చేసుకుని రాసుకున్నా ట్రీట్మెంట్ కూడా బలంగా ఉంది. అలాగే ఈ కథ 1999ల నేపథ్యంలో సాగడం, అప్పటి పోలీస్ విచారణ విధానాన్ని, అదే విధంగా రెండు విషాద ఘటనల్ని చూపిస్తూ సినిమాని ప్రారంభించిన తీరు బాగుంది. ఈ రెండింటికీ లింక్ ఉంటుందని ముందే హింట్ ఇవ్వడం కూడా ఆకట్టుకుంది. అలాగే దర్శకుడు మేకింగ్ స్టైల్ కూడా సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఇక నటీనటుల నటన కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.
సీరియస్ పోలీస్ గా సుమంత్ నటించిన విధానం చాలా బాగుంది. ఆద్యంతం సటిల్డ్ గా నటిస్తూ ఆయన పూర్తిగా మెప్పించాడు. వినయ్ పాత్రలో త్రినాథ్ వర్మ.. అతని ఫ్రెండ్ కార్తీక్ పాత్రలో గౌతమ్ పండిట్ నటన కూడా బాగుంది. అయితే, వినయ్ తల్లిగా షెల్లీ కుమార్ నటన మాత్రం సినిమాకి బాగా ప్లస్ అయింది. పాత్రలోని ఎమోషన్ తో పాటు మరో కోణాన్ని కూడా ఆమె చాలా బాగా పలికించింది. జగపతి బాబు కూడా ఆకట్టుకున్నారు. ఇక నేహా పఠాన్, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, హరిణి రావు అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు
మైనస్ పాయింట్స్ :
ఈ న్యూటన్స్ థర్డ్‌లా సినిమా మెయిన్ పాయింట్ లో ఉన్న మ్యాటర్.. సినిమాలో లేదు. దర్శకుడు రాజేశ్ కర్ణ తాను తీసుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి క్రైమ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా సాగాలి, కానీ ఈ న్యూటన్స్ థర్డ్‌లా సినిమాలో అది మిస్ అయింది.
అటు సుమంత్ పాత్రతో సహా మిగిలిన పాత్రలను డిజైన్ చేసుకోవడంలో దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు. ప్రేక్షకులను థ్రిల్ చేయాలని రాసుకున్న సీన్స్ కూడా ఆ స్థాయిలో లేవు. అటు ఎమోషనల్ గా కూడా కథ కనెక్ట్ కాదు. క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పూర్తిగా ఆకట్టుకునే డ్రామా లేదు. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నా.. స్క్రీన్ ప్లే మాత్రం చాలా భాగం స్లోగా సాగింది. పైగా సినిమాలో అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. కథ అవసరానికి మించిన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా చిత్రీకరించారు. అనిల్ పలాస ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక సంగీత దర్శకుడు సింజిత్ యర్రమిల్లి సమకూర్చిన నేపథ్య సంగీతం ఓకే. నిర్మాత హరీశ్ కొహిర్కర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘న్యూటన్స్ థర్డ్‌లా’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ డ్రామా ఆకట్టుకోలేదు. ఐతే, స్టైలిష్ మేకింగ్, కొన్ని క్రైమ్ మూమెంట్స్ బాగున్నా.. ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు రెగ్యులర్ అండ్ రిపీటెడ్ సన్నివేశాలు, ముఖ్యంగా ఆసక్తికరంగా సాగని పాత్రలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ ‘న్యూటన్స్ థర్డ్‌లా’ సినిమాలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


