సమీక్ష : నవ్వించలేక నవ్వులపాలు అయిన “అల్ ది బెస్ట్”

సమీక్ష : నవ్వించలేక నవ్వులపాలు అయిన “అల్ ది బెస్ట్”

Published on Jun 30, 2012 1:54 AM IST
విడుదల తేది : 29 జూన్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 1.75/5
దర్శకుడు : జే.డి చక్రవర్తి
నిర్మాత : జి.సాంబశివరావు
సంగీత దర్శకుడు: హేమ చంద్ర
తారాగణం : శ్రీకాంత్, జే.డి చక్రవర్తి, లక్కీ శర్మ

నటుడి నుండి దర్శకుడిగా మారి హిందీలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి, ఆ తరువాత తెలుగులో హొమం, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ వంటి చిత్రాలు రూపొందించిన జే.డి చక్రవర్తి తాజాగా రూపొందించిన చిత్రం ‘ఆల్ ది బెస్ట్’. ఎగిరే పావురమా’ చిత్రం తరువాత శ్రీకాంత్, జే.డి చక్రవర్తి కలిసి నటించిన ఈ చిత్రంలో లక్కీ శర్మ హీరోయిన్ జి.సాంబశివరావు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ చూద్దాం.

కథ :
చేయని తప్పుకి జైలుకి వెళ్ళిన తన తండ్రిని విడిపించడానికి 15 లక్షలు అవసరమవడంతో ఎలాగైనా ఆ డబ్బు సంపాదించాలనుకున్న శ్రీకాంత్ (రవి) తప్పని పరిస్థితుల్లో ప్రజల్ని మోసం చేసే మోసగాడు చందు (జే.డి చక్రవర్తి) తో చేతులు కలుపుతాడు. ఒక భూమికి సంభందించిన డీల్ చేసి అందులో వచ్చిన డబ్బు ఇద్దరు పంచుకోవాలనుకుంటారు. అందులో భాగంగా 30 లక్షలు విలువ చేసే భూమిని రజాక్ (ప్రదీప్ రావత్) కి అమ్మాలని ప్లాన్ చేస్తారు. ఆ భూమిని కొనడానికి చందు తన దగ్గర ఉన్న 21 లక్షలు, రవి దగ్గర 5 లక్షలు పోగు చేస్తారు మరో 3 లక్షలు గోచి సావిత్రి (బ్రహ్మానందం) దగ్గర అప్పుగా తీసుకుని ఆ భూమిని కొంటారు. ఆ భూమి రజాక్ కి అమ్మడానికి అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో అతను మరో నిబంధన పెడతాడు. ఆ నిబందన ఏమిటి? రజాక్ ఆ భూమి కొన్నాడా లేదా? చివరికి రవి సమస్య తీరిందా? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే అల్ ది బెస్ట్ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభంలో శ్రీకాంత్ దే మెయిన్ పాత్ర అన్నట్లు చూపించి సినిమా చివరికి వచ్చే సమయానికి అతనిది కేవలం రెండో హీరో పాత్రని చేసాడు దర్శకుడు. ఉన్నంతలో శ్రీకాంత్ రొటీన్ నటననే ప్రదర్శించాడు. కృష్ణ భగవాన్, తెలంగాణ శకుంతల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. రఘుబాబు మరియు అతని అసిస్టెంట్ రఘు కనుమంచి మధ్య కామెడీ సన్నివేశాలు కూడా బాగానే నవ్విస్తాయి. ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ పర్వాలేదనిపించారు. అంబాజీ రావు పాత్రలో రావు రమేష్ నాలుగైదు సన్నివేశాల్లో కనిపించి తన తండ్రి రావు గోపాలరావు గారిని ఇమిటేట్ చేసాడు.

మైనస్ పాయింట్స్ :
కామెడీ సినిమాలో ప్రేక్షకులు లాజిక్ పట్టించుకోరు అని సినిమాని తన ఇష్టానికి తీస్తే చివరికి నవ్వులపాలు కావాల్సి వస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఒక కథని చూపిస్తూ చివర్లో ఇప్పటి వరకు మీరు చుసిందంతా తూచ్ (ఈ పాయింట్ ఒక ప్రముఖ హిందీ సినిమా నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు) అన్నాడు దర్శకుడు. చక్రవర్తి నటుడిగా, దర్శకుడిగా రెండు పడవల మీద ప్రయాణం చేసి ఏ విభాగానికి సరైన న్యాయం చేయలేక పోయాడు.  గోచి సావిత్రి పాత్రలో నటించిన బ్రహ్మానందంని ఏ మాత్రం వాడుకోలేక పోవడం చూస్తేనే చక్రవర్తి దర్శకత్వ ప్రతిభ ఏ పాటిదో అర్ధమవుతుంది. లక్ష్మి ప్రసన్న పాత్రలో నటించిన లక్కీ శర్మ స్కిన్ షో విషయంలో చూపిన శ్రద్ధ మిగతా వాటి మీద కూడా చూపిస్తే బావుండేది. ఆమెకి నటనలో కనీసం ఓనమాలు రావు సరికదా కనీసం డైలాగ్స్ చెప్పడంలో లిప్ మూమెంట్ కూడా సరిగా చేయలేదు. అనూష సింగ్ కేవలం ఒక పాటకే పరిమితం. అసలు ఈ సినిమాకి “ఆల్ ది బెస్ట్” అనే టైటిల్ ఎందుకు పెట్టారో సదరు దర్శకుడికే తెలియాలి.

సాంకేతిక విభాగం :
హేమ చంద్ర సంగీతంలో సనా సనా పాట బావుంది. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం, జి. శివ కుమార్ సినిమాటోగ్రఫీ రెండు కూడా కామెడీ సినిమాలకు తగ్గట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఎడిటర్ దారుణంగా విఫలమయ్యాడు.

తీర్పు :
దర్శకుడిగా చేసిన తన ప్రతీ సినిమాకి ఏదో ఒక సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకునే జే.డి చక్రవర్తి ఈ సారి ప్రముఖ హిందీ సినిమా ‘బ్లఫ్ మాస్టర్’ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. పది కామెడీ సన్నివేశాలు, నాలుగు పాటలు, రెండు ఫైట్స్ తీస్తే ప్రేక్షకులు సినిమాని చూస్తారనుకున్న దర్శకుడికి నిరాశే మిగిలింది.

123తెలుగు.కాం రేటింగ్ : 1.75/5

Click Here For ‘All the best’ English Review

అశోక్ రెడ్డి -ఎం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు