సమీక్ష : అనామిక – థ్రిల్లింగ్ గా సాగే సస్పెన్స్ డ్రామా

సమీక్ష : అనామిక – థ్రిల్లింగ్ గా సాగే సస్పెన్స్ డ్రామా

Published on May 1, 2014 12:29 PM IST
Annimika విడుదల తేదీ : 1 మే 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
నిర్మాత : ఎండేమోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్
సంగీతం : ఎంఎం కీరవాణి
నటీనటులు: నయనతార, వైభవ్, హర్షవర్ధన్ రాణే..

మామూలుగా రీమేక్ అంటే ఏదో ఒకటి రెండు మార్పులు చేర్పులు చేసి ఉన్నది ఉన్నట్టుగా దించేస్తుంటారు. మొదటిసారి ఆ రొటీన్ ఫార్ములాకి పుల్ స్టాప్ పెట్టి, అలాగే బాలీవుడ్ లో హిట్ అయిన ఫార్మాట్ అయినప్పటికీ దానిని పక్కన పెట్టి రీమేక్ ని సరికొత్త కథలా ప్రేక్షకులకు అందించాలని శేఖర్ కమ్ముల చేసిన ప్రయత్నమే ‘అనామిక’. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వైభవ్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మే డే కానుకగా అనామిక సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల ఎంతో కొత్తగా ప్రెజెంట్ చేసిన ఈ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

బాంబుల తయారీతో కథ మొదలవుతుంది. కట్ చేస్తే పీపుల్ ప్లాజాలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో ఉన్న కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయడంతో ఆదికేశవయ్య(సీనియర్ నరేష్) కేంద్ర హోం మంత్రిగా ఎన్నికైతాడు. పీపుల్స్ ప్లాజా బాంబు కేసులో ప్రధాన నిందితుడు మిలింద్ ఆంజీ కారణం అని విచారణ కోసం ఖాన్(పశుపతి) అనుమతి కోరితే మత కలహాలు జరుగుతాయని ఆదిశేషయ్య వద్దంటాడు.

అక్కడి నుండి కట్ చేస్తే ఉద్యోగం పనిమీద హైదరాబాద్ వచ్చి మిస్ అయిన తన భర్త అజయ్ శాస్త్రి(హర్షవర్ధన్ రాణే) గురించి తెలుసుకోవడానికి అనామిక(నయనతార) అమెరికా నుండి హైదరాబాద్ వస్తుంది. శంసీర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో తన భర్త మిస్ అయినట్టు కంప్లైంట్ ఇస్తుంది. కానీ అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా పార్థ సారధి(వైభవ్) అనామిక భర్తని వెతకడంలో హెల్ప్ చేస్తుంటాడు. అనామిక తన భర్త గురించి తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో సాయం చేస్తున్న వారందరూ వరుసగా చనిపోతుంటారు. అలాగే అనామికని చంపాలనుకుంటారు.

అసలు అనామికకి సాయం చేస్తున్న వాళ్ళని చంపుతున్నది ఎవరు? భర్త కోసం వెతికే అనామికను ఎందుకు చంపాలనుకున్నారు? ఉద్యోగం కోసం వచ్చిన అజయ్ శాస్త్రి ఏమయ్యాడు? టెర్రరిస్ట్ అయిన మిలింద్ ఆంజీ కేసుని కేంద్ర హోం మంత్రి ఎందుకు టేకాఫ్ చేయద్దు అంటాడు? అనామిక నిజంగానే అజయ శాస్త్రి కోసం వచ్చిందా? లేక వేరే దేనికోసమైనానా? అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ రెండు ఉన్నాయి అందులో మొదటిది.. సెకండాఫ్ లో సగటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలు మరియు క్లైమాక్స్. సెకండాఫ్ చాలా వేగంగా అనిపించడం వల్ల ఆడియన్స్ సినిమాలో బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక రెండవది.. లీడ్ రోల్ చేసిన నయనతార పెర్ఫార్మన్స్. నయనతార చివరిగా చేసిన అన్ని తెలుగు సినిమాల్లో పెర్ఫార్మన్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమాలే చేసారు. దీనిలో కూడా పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేసింది. అలాగే డైరెక్టర్ రాసుకున్న పాత్రకి పూర్తి న్యాయం చేసింది. లుక్స్ పరంగా కూడా చూడటానికి బాగున్న నయనతార క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే సీరియస్ సీన్ చాలా బాగా చేసింది.

ఈ రెండు విషయాల తర్వాత ఎంఎం కీరవాణి మ్యూజిక్ సినిమాకి ప్రధాన హైలైట్. కీరవాణి తన మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోశాడు. ఇకపోతే నయనతారతో పాటు ట్రావెల్ అయ్యే పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన వైభవ్ నటన పాత్రకి తగ్గట్టు ఉంది. ప్రీ క్లైమాక్స్ లో కేసుని క్లోజ్ చేయడం కోసం తను చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. హర్షవర్ధన్ రాణే ఉన్నది తక్కువసేపే అయినప్పటికీ ఉన్నంతలో చాలా బాగా చేసాడు. అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చేసిన పశుపతి నటన కూడా పాత్రకి తగ్గట్టు ఉంది. సీనియర్ నరేష్, రాజ్ లు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఓవరాల్ గా సినిమా రన్ టైం 2 గంటలే కావడం సినిమాకి మరో ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ ని బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. అందుకే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. అలాగే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ కి వచ్చే మొదటి అనుమానం.. అనామికకి మిలింద్ ఆంజీ విషయం ముందే ఎలా తెలుసు? ఎందుకు తెలుసుకుంది? అనే విషయాన్ని మాత్రం ఆడియన్స్ కి అర్థమయ్యే రీతిలో డైరెక్టర్ చెప్పలేకపోయాడు.

ఇదొక లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ సినిమా కావడంతో ఇందులో సగటు ప్రేక్షకుడు ఆశించే కామెడీ, పాటలు ఏమీ ఉండవు. అలాగే హిందీ వెర్షన్ నుంచి తెలుగు వెర్షన్ కి డైరెక్టర్ చాలా మార్పులు చేసాడు. అందులో కొన్ని బాగున్నాయి కానీ హిందీలో ఉన్న ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్ తీసేయడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వల్ల హిందీ ఆడియన్స్ సినిమా మొదట్లోనే సినిమాకి బాగా కనెక్ట్ అయిపోతారు, కానీ ఇందులో ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్ లేకపోవడం వల్ల దాదాపు ప్రీ ఇంటర్వల్ బ్లాక్ వరకూ సినిమాకి కనెక్ట్ కాలేరు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ వర్క్ అంటే అది ఎంఎం కీరవాణి సంగీతం అనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న పాటలు అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటాయి. సినిమా స్లోగా సాగుతున్నా సినిమాని మాత్రం మరో స్థాయికి తీసుకెళ్ళింది 100కి 100 శాతం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. మ్యూజిక్ తర్వాత చెప్పుకోవాల్సింది., విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ గురించి. సినిమాలో రాత్రి పూట వచ్చే సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆ సీన్స్ ని తీసిన విధానం చాలా రియలిస్టిక్ గా చూడటానికి చాలా బాగుంది.

ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సినిమా ఫస్ట్ హాఫ్ పై కాస్త శ్రద్ధ తీసుకొని రీపీటెడ్ గా అనిపిస్తున్న సీన్స్ ని లేపేసి ఉంటే బాగుండేది. డైలాగ్స్ జస్ట్ ఓకే. ఇక శేఖర్ కమ్ముల కథలో చేసిన మార్పులు కొన్ని బాగున్నాయి. మామూలుగా శేఖర్ కమ్ముల సినిమాల్లో కథనం స్లోగా ఉంటుంది, కానీ ఇది థ్రిల్లర్ సినిమా కాబట్టి ఇంకాస్త స్పీడ్ గా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది. ఇక డైరెక్షన్ పరంగా మాత్రం మంచి మార్కులే కొట్టేసాడు. శేఖర్ కమ్ముల క్లాస్ సినిమాలే కాదు ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు కూడా చేయగలడని చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

శేఖర్ కమ్ముల తీసిన ‘అనామిక’ సినిమా ఉమెన్ యొక్క పవర్ ని చూపించేలా ఉంది. శేఖర్ కమ్ముల అనుకున్నట్టు ‘అనామిక’ పాత్రపై ఆడియన్స్ కి జాలి కంటే, తనలో ఉన్న పవర్ ని ఆడియన్స్ ఫీలవ్వాలి అని చేసిన ఈ ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. హిందీ వెర్షన్ చూసిన వారికి ఈ సినిమా పెద్దగా అనిపించకపోవచ్చు కానీ అది చూడని వారికి మాత్రం సినిమా బాగా నచ్చుతుంది. థ్రిల్లింగ్ గా సాగే సెకండాఫ్, నయనతార పెర్ఫార్మన్స్, ఎంఎం కీరవాణి మ్యూజిక్ హైలైట్స్ అయితే బోరింగ్ ఫస్ట్ హాఫ్, కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. ఓవరాల్ గా మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమా బి,సి సెంటర్ ప్రేక్షకులని ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు