సమీక్ష : డేవిడ్ – ముడిపడని డేవిడ్ ల కథ

సమీక్ష : డేవిడ్ – ముడిపడని డేవిడ్ ల కథ

Published on Feb 15, 2013 5:20 PM IST
david విడుదల తేదీ : 15 ఫిబ్రవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : బిజోయ్ నంబియార్
నిర్మాత : బిజోయ్ నంబియార్, శారదా త్రిలోక్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం : అనిరుద్, ప్రశాంత్ పిళ్ళై, రెమో, మాట్టీ పాణి, మోడరన్ మాఫియా – ప్రామ్ పదూర
నటీనటులు : విక్రమ్, జీవా, టబు, లారా దత్తా, నాజర్..

తెలుగులో పేరున్న తమిళ హీరోలు విక్రమ్, జీవా హీరోలుగా తమిళంలో తెరకెక్కిన సినిమా ‘డేవిడ్’. ఫిబ్రవరి 1న తమిళంలో విడుదలైన ఈ సినిమాని డబ్ చేసి ఈ రోజు తెలుగులో రిలీజ్ చేసారు. రెండు జీవితాలు ఒకే పేరు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో టబు, లారా దత్తా, నాజర్ కీలక పాత్రలు పోషించారు. బిజోయ్ నంబియార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ తో కలిసి బిజోయ్ నంబయార్, శారదా త్రిలోక్ నిర్మించారు. ఇంతకీ ఈ ఇద్దడి డేవిడ్ ల కథ ఏందో, సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఇది ఒకరితో ఒకరికి సంబంధం లేని ఇద్దరి డేవిడ్ ల కథ. మొదటగా 1999 సంవత్సరం నాటి డేవిడ్(జీవా) గురించి – ముంబైలో తన మధ్య తరగతి కుటుంబంతో నివసించే డేవిడ్ ఒక గిటారిస్ట్. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ త్రిలోక్ తో కలిసి వరల్డ్ టూర్ వెళ్లి స్టేజ్ షోలు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. తన తండ్రి నాజర్ ఒక చర్చి ఫాదర్ అందరికీ సాయం చెయ్యాలనే మనస్తత్వం. అలాంటి తరుణంలో డేవిడ్ కి ఆఫర్ వస్తుంది, అదే సమయంలో ఎమ్మెల్యే మాలతీ దేవి(రోహిణి హత్తంగది) తన స్వలాభం కోసం డేవిడ్ ఫాదర్ దేశ ద్రోహి అని మతపరమైన అల్లర్లు సృష్టిస్తుంది. ఆ మత అల్లర్లలో నష్ట పోయిన తన పరువుని కాపాడుకోవడం కోసం డేవిడ్ ఏమి చేసాడు? చివరికి అతను ఫేమస్ గిటారిస్ట్ అయ్యాడా లేక ఇంకేమన్నా అయ్యాడా అనేదే మొదటి డేవిడ్ కథ.

2010 సంవత్సరంలో జరిగే రెండవ డేవిడ్ విషయానికొస్తే – గోవాలో చేపలు పట్టుకునే డేవిడ్ (విక్రమ్) పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయి ముహూర్తం టైంలో వేరోకనితో లేచి పోతుంది. ఆ భాధలో తాగుడికి అలవాటైన డేవిడ్ కి పీటర్(నిషాన్), ఫ్రెన్నీ(టబు) మంచి ఫ్రెండ్స్. ఒక రోజు పీటర్ తను ప్రేమించిన రోమ(ఇషా శర్వాణి)ని పరిచయం చేస్తాడు. డేవిడ్ అనుకోని కారణాల వల్ల ఆమెని ప్రేమిస్తాడు. ఆమెకి డేవిడ్ తన ప్రేమని చెప్పడానికి ఏమేమి చేసాడు. ఇంతకీ ఆమెని పెళ్లి చేసుకున్నాడా? లేక ఫ్రెండ్ కోసం తన ప్రేమని చంపుకున్నాడా? అనేది రెండవ డేవిడ్ కథ. ఒకరి జీవితాలతో మరికరికి సంబంధం లేకపోయినా ఈ ఇద్దరు డేవిడ్ లు సినిమా చివర్లో ఎందుకు కలిశారు? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

కాస్త ఫన్నీగా, కాస్త ట్రాజెడీగా ఉండే తాగుబోతు పాత్రలో విక్రమ్ నటన బాగుంది. విక్రమ్ ఎపిసోడ్ సినిమాకి ప్లస్ పాయింట్. ‘ఊసరవెళ్లి’ సినిమాలో లాగా చనిపోయిన వాళ్ళ నాన్నతో విక్రమ్ మాట్లాడే సీన్స్ బాగున్నాయి. యంగ్ గిటారిస్ట్ పాత్రలో, అలాగే సెంటిమెంట్ సీన్స్, ఒక ఫైట్ సీక్వెన్స్ లో జీవా నటన బాగుంది. చర్చి ఫాదర్ పాత్రలో నాజర్, మసాజ్ పార్లర్ ఓనర్ ఫ్రెన్నీ పాత్రల్లో టబు వారి పాత్రలకు న్యాయం చేసారు. చెవిటి, మూగ అమ్మాయిగా చేసిన ఇషా శర్వాణి చాలా అందంగా ఉంది. యాక్షన్, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ‘శివం’ సాంగ్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొత్తం మీద ఇదీ కథ అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం ఈ మూవీ మేజర్ మైనస్. సినిమా నిడివి తక్కువ, అలాగే సినిమాలో కథ లేనప్పుడు స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని మాయ చేయాలనుకున్నప్పుడు సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా ఇచ్చే ఒకటి అరా ట్విస్ట్ లని ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. అవేమిలేకపోగా సినిమా కూడా నత్తనడకలాగా నిధానంగా ఉండటం సినిమాకి మరో మైనస్. ఉన్న ఒక్క ట్విస్ట్ కథలో త్వరగానే రివీల్ చేయడం వల్ల క్లైమాక్స్ ఏమిటి అనేది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. డైరెక్టర్ ఎంచుకున్న కథలోనే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ ని సినిమాని తీసేటప్పుడైనా సరిచేసుకోవాల్సింది. రెండు జీవితాలు ఒకే పేరు అని అనుకున్న డైరెక్టర్ చివర్లో వాళ్ళిద్దరి మధ్య లింక్ పెట్టాలనుకున్నాడు కానీ దాన్ని సరిగ్గా ముడిపెట్టలేకపోయాడు.

సినిమా సెకండాఫ్ లో వచ్చే జీవా ఫైట్ ఒకటి, విక్రమ్ స్టొరీలో వచ్చే కొన్ని సీన్స్ తప్పితే సినిమాలో చూడటానికి ఏమీ ఉండవు. జీవా స్టొరీలో చాలా చోట్ల అసలు లింక్స్ ఉండవు. ముంబైలో పెద్ద విలన్ అన్న వాడి దగ్గరకి వచ్చి నలుగుర్ని కొట్టేసి, విలన్ దగ్గర నుంచి తనకి కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవడం, ఎమ్మెల్యే మీద చాలా సింపుల్ గా అటాక్ చేయడం లాంటి సీన్స్ చాలా సిల్లీగా ఉంటాయి. డబ్బింగ్లో కూడా ఓ బ్లండర్ మిస్టేక్ జరిగింది అదేమిటంటే చర్చి ఫాదర్(నాజర్) దేశ ద్రోహం చేస్తున్నాడని అతన్ని శిక్షించడానికి ఎమ్మెల్యే మాలతీ దేవి వస్తే ఎమ్మెల్యే జిందాబాద్ అనాల్సింది పోయి డబ్బింగ్లో జరిగిన లోపం వల్ల ఫాదర్ జిందాబాద్ అంటుంటారు. అది చూసిన ఆడియన్స్ అదేంది ఫాదర్ జిందాబాద్ అంటున్నారు కానీ ఫాదర్ నే కొడుతున్నారనే డైలమాలో పడతారు.

ఈ సినిమాలో విక్రమ్, జీవా ఉన్నారు కదా భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, అదిరిపోయే లోకేషన్స్ లో సాంగ్స్, గుడ్ కామెడీ, మధ్యలో ఓ రొమాంటిక్ ట్రాక్ లాంటివి ఉంటాయి కదా అనుకోని పోతే మీకు పూర్తి నిరాశే ఎదురవుతుంది.

సాంకేతిక విభాగం :

రత్నవేలు, పి.ఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా గోవాలోని కొన్ని ప్రదేశాలను బాగా చూపించారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ ఓకే , ఇంకొంచెం ఆసక్తి కరంగా ఉండటం కోసం కొన్ని సీన్స్ లేపేసి ఉంటే బాగుండేది. అనిరుద్, ప్రశాంత్ పిళ్ళై, రెమో, మాట్టీ పాణి, మోడరన్ మాఫియా – ప్రామ్ పదూర అందించిన సంగీతంలో రెండు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

తీర్పు :

‘డేవిడ్’ చాలా నిధానంగా, బోరింగ్ గా, టేకింగ్ కూడా అంతంతమాత్రంగా ఉండే సినిమా. విక్రమ్, జీవా ఉన్నారు కదా అని థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకులకి నిరాశే ఎదురవుతుంది. వారి గత సినిమాల్లో లాగా ఈ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ లు, సూపర్బ్ సాంగ్స్, గుడ్ కామెడీ లాంటివి ఏమీ ఉండవు. అలాగే సినిమాలో ఇద్దరి డేవిడ్ ల మధ్య లింక్ కూడా కుదరలేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

Rag’s

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు