సమీక్ష : “మహంకాళి”ని కాళీ మాత కరుణించలేదు..

సమీక్ష : “మహంకాళి”ని కాళీ మాత కరుణించలేదు..

Published on Mar 10, 2013 2:00 AM IST
mahankali2 విడుదల తేదీ : 8 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : జీవిత రాజశేఖర్
నిర్మాత : యేలూరు సురేందర్ రెడ్డి, ఎ. పరంధామ రెడ్డి
సంగీతం : చిన్నా
నటీనటులు : రాజశేఖర్, మధురిమ…

సినిమా మొదలు బెట్టి చాలా కాలమైనప్పటికీ పలు సార్లు టెక్నికల్ విభాగంలో మార్పులు రావడం, ఆ తర్వాత ఫైనాన్సియల్ గా కాస్త ఇబ్బందులు ఎదుర్కున్న ‘మహంకాళి’ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాంగ్రీ యంగ్ మాన్ డా. రాజశేఖర్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించిన ఈ సినిమాకి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు. యేలూరు సురేందర్ రెడ్డి, ఎ. పరంధామ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి చిన్నా సంగీతం అందించగా మధురిమ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే పలుసార్లు పోలీస్ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రాజశేఖర్ ‘మహంకాళి’ సినిమా ‘అంకుశం’ అంత పెద్ద హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు. ఇంతకీ ఈ మహంకాళి సినిమా ఎలా ఉంది, డా.రాజశేఖర్ ఈ సినిమా పై పెట్టుకున్న ఆశలను నెరవేర్చిందో లేదో ఇప్పుడు చూద్దాం…

కథ :

హైదరాబాద్లో ఎన్ని మారినా పాతబస్తీలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని, ఎంతోమంది టెర్రరిస్టులకు ఆతిధ్యం ఇస్తోందనే వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. హర్షద్ భాయ్(ప్రదీప్ రావత్) దుబాయ్ లో నివసిస్తూ హైదరబాద్లో తన అనుచరులైన జయక్క(నళిని), లడ్డూ లను ఉపయోగించుకొని దందా నడుపుతుంటాడు. మర్డర్లు సెటిల్ మెంట్లే కాక టెర్రరిజం పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలతో చేతులు కలిపి హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ లు చేస్తుంటాడు. లోకల్ లో నాయక్ భాయ్(వేణు గోపాల్) హోం మినిస్టర్ సుదర్శన్ రెడ్డి సపోర్ట్ తో(జీవ) హర్షద్ గ్యాంగ్ ని లేపేసి తనే డాన్ అవుదామనుకుంటూ ఉంటాడు. ఇలా సిటీలో పెరిగిపోతున్న అరాచకాలను ఆపడానికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ మహంకాళి(డా. రాజశేఖర్) ని రంగంలోక్ దింపుతాడు. దోషులను చట్టానికి అప్పగించి, వారిని జైల్లో కూర్చో బెట్టి మేపడం కంటే అక్కడికక్కడే చంపేయడమే న్యాయం అని నమ్మే వ్యక్తి మహంకాళి.

అదే టైంలో కొంతమంది పలుకుబడి, పేరున్న వ్యక్తులు సినిమా హీరోయిన్ అయిన తనీషా(మధురిమ)ని టార్చర్ పెడుతుండడంతో ఆ కేసును మహంకాళి డీల్ చేసి ఆమెను రక్షిస్తాడు. అది చూసిన తనీషా మహంకాళితో ప్రేమలో పడుతుంది. ఇలా సాగిపోతున్న టైములో కమీషనర్ ఆనంద రావు(చలపతి రావు), జయక్క హర్షద్ భాయ్ తో కలిసి అన్యాయంగా మహంకాళి పై కొన్ని కేసులు మోపి జైల్లో పెడతారు. అలా జైలు పాలైన మహంకాళి ఎలా బయటకి వచ్చాడు? బయటకి వచ్చిన మహంకాళి హర్షద్ భాయ్, నాయక్ భాయ్ లను ఎలా అంత మొందించాడు? ఈ రివెంజ్ లో మహంకాళి ఎవరెవరిని పోగొట్టుకున్నాడు అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ పవర్ఫుల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో మంచి నటనని కనబరిచాడు. ఆయన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రకి తగ్గట్టే సాయి కుమార్ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. మధురిమ నటన కంటే గ్లామర్ తోనే ఎక్కువ ఆకట్టుకోవడానికి ట్రై చేసింది, కానీ ఆమె స్క్రీన్ పై చాలా తక్కువ టైం కనపడుతుంది. అలాగే సెకండాఫ్ లో ఈ పాట అవసరమా, అసలు ఆ సాంగ్ వినడానికి బాలేదు అనే అంశాలు పక్కన పెడితే ఐటెం సాంగ్లో కౌష మాత్రం తన అందచందాలతో ముందు బెంచ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. విలనిజం చూపించే సీన్లు లేకపోయినా అరుపులు, చాలెంజింగ్ డైలాగ్స్ చెప్పే విషయంలో విలన్స్ అయిన ప్రదీప్ రావత్, వేణుగోపాల్ లు బాగానే నటించారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే సాగిపోతుంది, అలాగే సెకండాఫ్ లో హీరో – విలన్ మధ్య వచ్చే ఎయిర్ పోర్ట్ సీన్, క్లైమాక్స్ సీన్ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చకపోయినా ముందు బెంచ్ వారికి మాత్రం బాగానే నచ్చుతుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో చెప్పాలనుకున్న లైన్ కొత్తదేమీ కాదు. ఈ సినిమా స్టొరీ లైన్ ఇంచుమించు గతంలో గోపీచంద్ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘గోలీమార్’ స్టొరీ లైన్ లానే ఉంటుంది. ఈ స్టోరీని డీల్ చెయ్యడంలో జీవిత రాజశేఖర్ పూర్తిగా సక్సెస్ కాలేక పోయింది. ఫస్ట్ హాఫ్ ఎలాగోలా లాగించేసినా సెకండాఫ్ ని డీల్ చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. సెకండాఫ్ మొత్తం ఊహించే విధంగా ఉంటుంది. సెకండాఫ్ మొత్తం సస్పెన్స్ గా తీయాలనుకున్నారు కానీ అలా తీయలేక ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు. రాజశేఖర్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకి అతి పెద్ద మైనస్. రాజశేఖర్ నుంచి ఆశించే ఫైట్స్ ఇందులో ఎక్కువ ఉండవు, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అనడం వల్ల ఎక్కువభాగం గన్ పట్టుకొని కాల్చుడమే ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో ప్వవర్ఫుల్ గా ఉండే రాజశేఖర్ పాత్ర సెకండాఫ్ లో చాలా నీరసంగా ఉంటుంది. అలాగే రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసాడు ఈ సినిమా కూడా మరో ‘అంకుశం’ లాగా ఉంటుంది అని ఊహించి వెళితే మాత్రం మీకు పూర్తి నిరాశే ఎదురవుతుంది.

కథానుసారం విలన్ ని చాలా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ అలా హైలైట్ చెయ్యకుండా సింపుల్ గా హీరోని తన గ్యాంగ్ లో కలిసిపొమ్మనడం బతిమాలుకోవడం, ఎంత సేపూ హీరోని మీరు కేక, సూపరు అనడం వల్ల సినిమాలో ఇద్దరు విలన్లు ఉన్నప్పటికీ విలనిజం కరువైంది. డి.సి.పి కృష్ణరావు(వినోద్ కుమార్) పాత్ర ఎందుకు పెట్టారో అసలు అర్ధం కాలేదు, వినోద్ కుమార్ పాత్ర వాళ్ళ సినిమాకి ఏ మాత్రం ఉపయోగం లేదు. అలాగే రాజశేఖర్ అమ్మగా చేసిన అన్నపూర్ణ పాత్రని ఎలాంటి కారణం లేకుండా చంపేశారు. తల్లి పాత్రని చంపేస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారేమో డైరెక్టర్ కానీ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోగా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. క్లైమాక్స్ లో ఖచ్చితమైన ముగింపు ఇవ్వలేదు. సినిమాలో ఉన్న మూడు పాటలు సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడలేదు కానీ అందరిలా 6 పాటలు పెట్టి ప్రేక్షకులకు మరీ చిరాకు తెప్పించకుండా మూడుపాటలతోనే సరిపెట్టేసినందుకు డైరెక్టర్ కి థాంక్స్ చెప్పుకోవాలి. సినిమాలో జల్లెడ వేసి వెతికినా మీకు నవ్వుకోవడానికి ఒక్క సీన్ కూడా దొరకదు. ఎంటర్టైనింగ్ ఏమీ లేకపోవడం ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్.

సాంకేతిక విభాగం :

జీవిత రాజశేఖర్ కొన్ని కొన్ని సీన్స్ తీయడంలో బాగా సక్సెస్ అయినప్పటికీ సినిమా మొత్తంగా ప్రేక్షకులను రంజింపచేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. డా. రాజశేఖర్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. సినిమాటోగ్రఫీ కథకి సరిపోయేలా ఉంది. సినిమాలో పాటలు తక్కువ అలాగే సినిమా నిడివి ఎక్కువ కావడం వల్ల ఎడిటర్ సినిమాని అక్కడక్కడా ట్రిమ్ చేస్తే బాగుండేది, ముఖ్యంగా సెకండాఫ్. చిన్నా అందించిన పాటలు గురించి మాట్లాడుకోవడం వదిలేస్తే, హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్, అలాగే కొన్ని ఎన్ కౌంటర్ సీన్స్ లో అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

తీర్పు :

రోటీన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ స్టొరీతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండాఫ్ మరీ స్లోగా, ఊహించే విధంగా ఉంటుంది. రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్నాడని భారీ అంచనాలతో పోతే మాత్రం మీరు బాగా నిరాశకు గురవుతారు. కొన్ని సీన్స్ ని సి క్లాస్ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు, కానీ ఎ క్లాస్, బి క్లాస్ ఆడియన్స్ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టే ఈ సినిమా ఆడుతుందో లేదో తెలుస్తుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5

రాఘవ

Click Here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు