సమీక్ష : మాస్క్ – బొక్క బోర్లా పడ్డ సూపర్ హీరో..

సమీక్ష : మాస్క్ – బొక్క బోర్లా పడ్డ సూపర్ హీరో..

Published on Aug 31, 2012 8:20 PM IST
విడుదల తేదీ: 31 ఆగష్టు 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : మిస్కిన్
నిర్మాత : ఎన్.వి ప్రసాద్, పరాస్ జైన్
సంగీతం: కె
నటీనటులు : జీవా, పూజ హెగ్డే

సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి చౌదరి తనయుడిగా తమిళ్ లో అరంగేట్రం చేసిన జీవా ‘రంగం’ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘రంగం’ చిత్రం విజయం సాదించడంతో ఆ తర్వాత జీవా నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి కానీ ఏవీ విజయాలు అందుకోలేదు. అందుకని జీవా ఈ సారి సూపర్ హీరో అవతారమెత్తి ‘మాస్క్’ చిత్రంతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, కె సంగీతం అందించారు. ఈ చిత్రం ఎలా ఉందో చూసేద్దామా..

కథ :

బి.ఎస్.సి డిగ్రీ పూర్తి చేసుకుని నిరుద్యోగి అయిన ఆనంద్ బ్రూస్ లీ (జీవా) కి కుంగ్ ఫూ బాగా తెలుసు మరియు అందరిలాగా రొటీన్ లైఫ్ గడపడం అంటే అతనికి ఇష్టం ఉండదు. కానీ తన ఫ్యామిలీ కోసం సాదారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. విశాఖ పట్నంలో పేరు మోసిన ఒక గ్యాంగ్ ముసుగులు వేసుకుని భారీగా దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళు ఎలాంటి సాక్షా దారాలు దొరక్కుంటా బాగా డబ్బున్న వారి ఇళ్ళల్లో డబ్బు మరియు నగలు దోచుకుంటూ ఉంటారు. ఈ గ్యాంగ్ ని అరికట్టడం కోసం స్పెషల్ ఆఫీసర్ (నాజర్) ని రంగంలోకి దింపుతారు, నాజర్ కూతురైన పూజ హెగ్డే ని చూసి బ్రూస్ లీ ప్రేమలో పడతాడు. ఆమెని అలాగైనా ప్రేమలో పడెయ్యాలని రోజూ రాత్రి ముఖానికి మాస్క్ వేసుకుని ఆమెని ప్రేమించమని వెంతపడుతుంటాడు.

అలా ఒకరోజు రాత్రి పూట అనుకోకుండా తారసపఆడిన దొంగతనం చేసే గ్యాంగ్ లో ఒకరిని పోలీసులకు పట్టిస్తాడు. అది చూసి పూజ బ్రూస్ లీ ని ఇష్టపడుతుంది. కథ సాఫీ గా జరుగుతుంది అనుకున్న సమయంలో బ్రూస్ లీ ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. దాని కోసం మళ్ళీ కుంగ్ ఫూలో కొన్ని కొత్త మెళకువలు నేర్చుకోవాల్సి వస్తుంది. శాస్త్రవేత్త అయిన బ్రూస్ లీ తాత(గిరీష్ కర్నాద్) నుంచి సహాయం తీసుకొని తన సమస్యని ఎలా పరిష్కరించుకున్నాడు? అనేదే మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

నిజ జీవితంలో జీవాకి కుంగ్ ఫూ తెలియడం వల్ల అది సినిమాలో జీవాకి చాలా వరకూ ఉపయోగపడింది. యాక్షన్ సన్నివేశాలలో జీవా ఎనర్జీ చాలా బాగుంది. పూజ హెగ్డే నటన చాలా బాగుంది మరియు ఇంకొంచెం గ్లామర్ గా కనపడితే పెద్ద స్టార్ అవుతుంది. విలన్ పాత్రలో నరైన్ బాగా నటించారు. మంచి నటులైన గిరీష్ కర్నాద్ మరియు నాజర్ లు ఈ చిత్రంలో కూడా మంచి నటనని కనబరిచారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు వి.ఎఫ్ ఎక్స్ సీన్స్ బాగున్నాయి. జీవ మరియు గిరీష్ కర్నాద్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా చాలా నిదానంగా ఉంటూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ అస్సలు ఉండదు. జీవా మరియు పూజ హెగ్డే మధ్య రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోగా సన్నివేశాల్లో ఎమోషనల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. తెలుగులో డబ్బింగ్ చెప్పిన వారి వాయిస్ అంతగా సెట్ అవ్వలేదు. సినిమాలో అక్కడక్కడా ఎత్తు పల్లాలు ఉండటం వల్ల సినిమా అంత ఆసక్తికరంగా ఉండదు. ఈ చిత్రాన్ని డీల్ చేసేంత విషయం డైరెక్టర్ మిస్కిన్ లో లేదు. మామూలు సినీ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ లేనందు వల్ల ఈ చిత్రాన్ని అంత తొందరగా జీర్ణించుకోలేరు.

చివర్లో చెప్పిన సస్పెన్స్ ఎలిమెంట్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘స్పైడర్ మాన్’ మరియు ‘బాట్ మాన్’ చిత్రాల రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఊహించుకొని వెళితే ఖచ్చితంగా నిరుత్సాహంతో బయటికొస్తారు. అన్ని డబ్బింగ్ సినిమాలతో పోల్చుకుంటే తెలుగు నేటివిటీ విషయంలో ఈ సినిమా చాలా ఇబ్బంది పెడుతుంది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ బాగుంది, చాలావరకు యాక్షన్ సన్నివేశాలను సహజంగా చిత్రీకరించారు ఇది కాకుండా చిత్రంలోని విజువల్స్ చాలా బాగా వచ్చాయి. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. ఈ చిత్ర సంగీతం గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు. అక్కడక్కడ వచ్చిన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించారు. మిస్కిన్ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయాడు స్క్రీన్ ప్లే ఇంకా బాగుంటే సినిమా మరోలా ఉండేది.

తీర్పు :

తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకునే అంశాలు మాస్క్ చిత్రంలో లేవు. ఈ చిత్రం నెమ్మదిగా సాగడమే కాకుండా స్టొరీ లైన్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఈ చిత్రంలో రొమాంటిక్ ట్రాక్ కూడా సహాయపడలేదు. కొన్ని కుంగ్ ఫూ యాక్షన్ సన్నివేశాలు మరియు ఉత్తమ సాంకేతిక అంశాలు మాత్రమే ఈ చిత్రంలో చెప్పుకోదగిన అంశాలు. మీరు బ్యాట్ మాన్ మరియు స్పైడర్ మాన్ వంటి చిత్రాన్ని ఊహించుకుని వెళితే ఈ సినిమా మిమ్మల్ని నిరాశ పరచడం తధ్యం..

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

అనువాదం – రాఘవ

Click Here For ‘Mask’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు