సమీక్ష: సత్యగ్యాంగ్ – అర్థం కావడం కష్టమే

సమీక్ష: సత్యగ్యాంగ్ – అర్థం కావడం కష్టమే

Published on Apr 7, 2018 10:40 AM IST
Satya Gang movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 6, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సాత్విక్ ఈశ్వర్, ప్రత్యూష, హర్షిత సింగ్

దర్శకత్వం : ప్రభాస్

నిర్మాతలు : ఎమ్. మహేష్ ఖన్నా

సంగీతం : జెబి, ప్రభాస్

సినిమాటోగ్రఫర్ : అడుసుమిల్లి విజయ్ కుమార్

ఎడిటర్ : నందమూరి హరి

స్క్రీన్ ప్లే : సిద్ద యోగి క్రియేషన్స్

సిద్ద యోగి క్రియేషన్స్ బ్యానర్ పై సాత్విక్ ఈశ్వర్, ప్రత్యూష, హర్షిత సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. ప్రభాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అనాథలైన రాజ్ (సాత్విక్ ఈశ్వర్) అతని స్నేహితుడైన సత్య కలిసి సత్య గ్యారేజ్ ను నడుపుతూ అనాథలకు సహాయం చేస్తుంటారు. వాళ్లలో రాజ్ అక్కిని, సత్య సంజుని ప్రేమిస్తారు. అలా ప్రేమ కథ నడుస్తుండగా సిటీలో ఒక గ్యాంగ్ తిరుగుతూ హత్యలు చేస్తూ ఉంటుంది.

ఆ హత్య కేసులన్నీ రాజ్, సత్యలపై పడుతాయి. పోలీసులు వాళ్ళను అరెస్ట్ కూడ చేస్తారు. అసలు హత్యలు చేస్తున్న గ్యాంగ్ ఎవరు, వాళ్లకు రాజ్, సత్యలకు సంబంధం ఏమిటి, చివరికి నేరస్తులను పోలీసులు ఎలా పట్టుకున్నారు, రాజ్ అనాథలను వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ఎలాంటి సొల్యూషన్ కనుగొన్నారు అనేదే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మెచ్చుకోదగిన అతి కొద్ది అంశాల్లో అనాథలను వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి దర్శకుడు చెప్పిన చూపిన సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఆచరణలో కష్టతరమైనదే అయినా కూడ ఇలా చేస్తే కొంతమంది అనాథల జీవితాలైనా బాగుపడతాయి కదా అనే ఆలోచన కలుగుతుంది.

ఇక సినిమాలోని రెండు పాటలని ఫారిన్ లొకేషన్లో కొంత అందంగానే చిత్రీకరించారు. కథలోని కీలకమైన మలుపు కొంత థ్రిల్ కలిగిస్తుంది. అలాగే అనాథల జీబితాలు ఎంత బాధాకరంగా ఉంటాయో వివరించే పాట కూడ బాగుంది. ఐపీఎస్ ఆఫీసర్ గా సీనియర్ నటుడు సుమన్ నటన, అతని పాత్ర చిత్రీకరణ చిత్రీకరణ రెండూ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రతి పది నిముషాలకు ఒక బలహీనత కనిపిస్తూనే ఉంటుంది. సీనియర్ నటులు సుమన్, జీవ, షఫీల నటన మినహా మిగతా వేరెవ్వరి నటన ఆకట్టుకోలేకపోయింది. చాలా మంది నటీ నటులు కనీసం డైలాగ్స్ చెప్పడానికి కూడ తడబడ్డారు. సినిమాలో హీరో ఎవరనే అంశం మీద స్పష్టత రావడనికి చాలా సమయమే పట్టింది.

దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా అతనేం చెప్పాలకున్నాడో చివరి 5 నిముషాల్లో తప్ప మరెక్కడా అర్థంకాదు. ఇక సినిమా కథనమైతే క్రమశిక్షణ లేకుండా నడిచింది. చాలా సన్నివేశాల మధ్యన కంటిన్యుటీ మిస్సయింది. ప్రాపర్టీస్ వాడకం విషయంలో కూడ చాలా లోపాలు కనిపిస్తాయి. మొదటగా క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఆరంభమైన కథ మధ్యలో లవ్ ట్రాక్ ఎక్కి ఆ తరవాత మళ్ళీ క్రైమ్ జానర్లోకి ప్రవేశించి చివరి 5 నిముషాల్లో సోషల్ ఎలిమెంట్ తో ముగిసి ఏ అంశాన్నీ పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయలేక చతికిలపడింది.

ఇద్దరు హీరోయిన్లు ఉన్నా వాళ్లకు కథతో అస్సలు సంబంధం ఉండదు. సినిమాలో టేకింగ్ పరంగా మెచ్చుకోదగిన సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడ కనబడలేదు. ప్రతి సీన్ ఏదో చేశాం, తీశాం అన్నట్టే అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రభాస్ ఒక 5 నిముషాల సామాజిక సందేశాన్ని వినిపించడానికి రెండు గంటలపాటు ప్రేక్షకుడికి బోర్ కొట్టించే సినిమా తీశారు. ఒక గమ్యం లేని కథకు పట్టులేని కథానాన్ని జోడించి ఆయన చేసిన ప్రయత్నం చాలా వరకు విఫలమైంది. సినిమా మొత్తంలో ఆయన క్రియేట్ చేసిన సుమన్ పాత్ర, చెప్పిన చిన్నపాటి మెసేజ్ మాత్రమే కొంత పర్వాలేదనిపించాయి.

జెబి, ప్రభాస్ ల సంగీతం ఏమంత గొప్పగా లేదు. అడుసుమిల్లి విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ సాదాసీదాగా ఉంది. సరిగాలేని ఎడిటింగ్ వలన కంటిన్యుటీ లోపించింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఫారిన్లో చేసిన రెండు పాటలు కొంత చూడాలనిపించేలా ఉన్నాయి.

తీర్పు :

‘సత్యగ్యాంగ్’ పేరుతో అసలు ఏ తరహా సినిమానో పూర్తి క్లారిటీ లేకుండా ప్రేక్షకుల మధ్యకి వచ్చిన ఈ సినిమా ఫలితం తారుమారైంది. సుమన్ పాత్ర, సినిమా చివరి 5 నిముషాల్లో చెప్పబడిన సామాజిక సందేశం ఈ చిత్రంలో ఆకట్టుకోగా ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, తీరు తెన్నులులేని కథనం, పరిణితిలేని నటీనటుల నటన ప్రేక్షకుడ్ని విసిగిస్తాయి. మొత్తం మీద చెప్పాలంటే సినిమా చూసేవాళ్లకు ఈ సత్యగ్యాంగ్ అసలెందుకో వాళ్ళ లక్ష్యం ఏమితో అర్థం కావడం కష్టమనే చెప్పాలి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు