సమీక్ష : సైజ్ జీరో – నవ్వించి ఆలోజింపచేసే కాన్సెప్ట్

సమీక్ష : సైజ్ జీరో – నవ్వించి ఆలోజింపచేసే కాన్సెప్ట్

Published on Nov 29, 2015 8:00 AM IST
size-zero-review

విడుదల తేదీ : 27 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : ప్రకాష్ కోవెల మూడి

నిర్మాత : పరమ్ వి పొట్లూరి

సంగీతం : ఎంఎం కీరవాణి

నటీనటులు : అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్..

అనుష్క అంటే టాలీవుడ్ లేడీ బాక్స్ ఆఫీసు బాద్షా అని చెప్పాలి.. ఈ ఏడాది బాహుబలి, రుద్రమదేవి అనే రెండు పీరియడ్ ఫిల్మ్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనుష్క ఈ సారి తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తూ ఓ మంచి విషయాన్ని చెప్పడానికి చేసిన సినిమానే ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి డైరెక్షన్ లో ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సినిమా ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ ‘సైజ్ జీరో’ చూపిన వినోదమేంటనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సైజ్ జీరో సినిమా మొత్తం చిన్నప్పటి నుంచే బాగా ముద్దుగా బొద్దుగా ఉండే స్వీటీ అలియాస్ సౌందర్య(అనుష్క) చుట్టూ తిరుగుతుంది. స్వీటీ బాగా బొద్దుగా ఉండడం వలన పెళ్లి సంబందాలు సరిగా రావు వచ్చినా తన సైజ్ ని చూసి రిజెక్ట్ చేస్తుంటారు. కానీ అనుష్క మాత్రం తనకోసమూ ఓ రాజకుమారుడు వస్తాడని అంటుంటుంది. అలాగే అభి(ఆర్య) స్వీటీని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తాడు. కానీ స్వీటీ అభిని రిజెక్ట్ చేస్తుంది. కానీ పరిచయం ఉన్న ఫ్యామిలీస్ కావడం వలన స్వీటీ – అభి ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ గా ఉన్న టైంలో స్వీటీ అభిని ప్రేమించడం మొదలు పెడుతుంది. అభి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్.

అభి చేస్తున్న డాక్యుమెంటరీ నచ్చి ఎన్జీవోలో పనిచేసే సిమ్రాన్(సోనాల్ చౌహాన్) అభితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతుంది. ఈ జర్నీలో అభి – సిమ్రాన్ లు ప్రేమలో పడతారు. దాంతో స్వీటీ వారికి దూరంగా వెళ్తుంది. అలాగే తక్కువ టైంలో సన్నగా అవ్వాలని సత్యానంద్(ప్రకాష్ రాజ్) సైజ్ జీరో ట్రైనింగ్ క్లాస్ లో చేరుతుంది. అక్కడే స్వీటీకి సత్యానంద్ చేస్తున్న మోసాల గురించి తెలుస్తుంది. దాంతో సైజ్ జీరో సత్యానంద్ పై యుద్ధం చేయడానికి సిద్దమవుతుంది. ఆ విషయంలో స్వీటీకి అభి, సిమ్రాన్ లు కూడా సపోర్ట్ చేస్తారు. సత్యానంద్ ని ఎలా ఎదిరించింది? సత్యానంద్ మోసాలను ఎలా బయటపెట్టింది? చివరికి స్వీటీ సన్నబడిందా లేదా? అలాగే ఎవరిని పెళ్లి చేసుకుంది? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

మామూలుగానే అనుష్క మంచి హైట్ తో పాటు ఫిజిక్ ని కలిగి ఉంటుంది. అలాగే సూపర్బ్ క్రేజ్ ఉంది. అలాంటి భామ ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఓ సినిమా కోసం ఒక్కసారిగా 20 కేజీల బరువు పెరిగి ఓ సినిమా చేయడం అనేది చాలా గ్రేట్, అందుకే ఈ విషయంలో అనుష్కకి ముందుగా హ్యాట్సాఫ్ చెబుతున్నాం. ఇక సినిమా విషయానికి వస్తే.. సైజ్ సీరో సినిమాని మొదలు పెట్టిన విధానం, అక్కడి నుంచి సినిమాని టేకాఫ్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే మొదటి నుంచి ఇంటర్వల్ వరకూ అనుష్క పాత్రతో ప్రేక్షకుల పెదవులపైన చిరునవ్వుని ఒకే లెవల్లో ఉండేలా చేస్తూ రావడంసినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది.

ఇక ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచిన అనుష్క విషయానికి వస్తే.. స్వీటీ పాత్రలో అనుష్క నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. ఇప్పటి వరకూ అనుష్క చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే ఇదొక్కటే ఒక ఎత్తుగా చెప్పాలి. ఎందుకంటే అనుష్క ఇప్పటి దాకా గ్లామ్ రోల్స్, మహారాణిగా, సీరియస్ గా కత్తులు తిప్పుతూ యుద్దాలు చేసే బరువైన పాత్రలే ఎక్కువగా చేసింది. కానీ మొదటిసారి ఫుల్ లెంగ్త్ కామెడీ మరియి ఎమోషనల్ టచ్ ఉన్న పాత్ర చేసింది. ఎమోషనల్ చేయడం ఓకే కానీ కామెడీ చేయడం అంత ఈజీ కాదు. కానీ అనుష్క మాత్రం ఫస్ట్ హాఫ్ లో తన హావ భావాలతో బాగా నవ్వించింది. అలాగే అనుష్క బొద్దుగా ఉన్నా చూడటానికి మాత్రం క్యూట్ గా ఉంది. మెయిన్ రోల్ చేసిన ఆర్య అనుష్కకి మంచి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. సోనాల్ చౌహాన్ చేసింది కూడా సినిమాకి అవసరం ఉన్న పాత్రలో మంచి నటనని కనబరిచింది. సోనాల్ నటనతో పాటు గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వీరి తర్వాత ముఖ్య పాత్రల్లో నటించిన ఊర్వశి, ప్రకాష్ రాజ్, గొల్లపూడి మారుతి రావు, అడవి శేష్,మాస్టర్ భరత్ లు వారి వారి పాత్రలకి నయం చేసారు. ఇక సినిమా పరంగా మిమ్మల్ని కట్టిపడేసే సీన్స్ గురించి మాట్లాడుకుంటే.. సినిమా మొదట్లోనే అనుష్క పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి ఇంటర్వల్ వరకూ అందరూ నవ్వుతూ తన పాత్రతో ట్రావెల్ అవ్వడం, మధ్య మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు లాస్ట్ క్లైమాక్స్ సీన్ ‘సైజ్ జీరో’కి మేజర్ హైలైట్స్. ఇక చివరగా ఒక మెయిన్ స్టేజ్ లో నాగార్జున, రానా, బాబీ సింహా, జీవ, తమన్నా, హన్సిక, శ్రీ దివ్య, మంచు లక్ష్మీలు చేసిన అతిధి పాత్రలు సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సెకండాఫ్.. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో అనుష్క పాత్రని బాగా డెవలప్ చేసి చూపించేసాడు.. దాంతో సెకండాఫ్ లో చెప్పడానికి ఏమీ లేకుండా పోయింది. అందుకే సెకండాఫ్ మొత్తాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ కి సెకండాఫ్ కి అస్సలు సంబంధం లేదే అని ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ విషయంలో చాలా కేర్ తీసుకొని ఎమోషనల్ గా అన్నా చెప్పడానికి ట్రై చేసి ఉండాలి. లావుగా ఉన్న అనుష్క క్వాలిటీస్ చూసి ఎవరు పెళ్లి చేసుకుంటారా అన్నదే మెయిన్ పాయింట్. కావున కథనంలో వీరిదగ్గర ఎలాంటి ట్విస్ట్ లు లేవు. కాబట్టి చూసే ఆడియన్స్ లో కథ- కథనం అనేవి ఎలాంటి ఆసక్తిని కలిగించవు.

వీటితో పాటు సినిమా నేరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఆ స్లోనెస్ తెలియకపోయినా సెకండాఫ్ లో మాత్రం బాగా తెలిసిపోతుంది. పాయింట్ ని మనం చెప్పేసినా ఎంటర్టైనింగ్ గా చిఎన్మా ఉంటే బోరింగ్ లేదా రొటీన్ అనే ఫీలింగ్ ని పోగొట్టచ్చు.. కానీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువనే చెప్పాలి. బ్రహ్మానందం, భరత్, అలీలను కామెడీ పరంగా సరిగా వాడుకోలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ. ఇకపోతే పాటలు పెద్దగ అవసరం లేదు. అలాగే రన్ టైం 131 నిమిషాలే అయినా బాగా ఎక్కువ లెంగ్తీ సినిమా చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ టీం చాలా విషయాల్లో సైజ్ జీరో సినిమాకి బాగా హెల్ప్ అయ్యారు. లావుగా ఉన్న అనుష్కని నిరవ్ షాహ్ చూపిన విధానం సింప్లీ సూపర్బ్. అనుష్క అంత బొద్దుగా ఉన్న ఎక్కడా ఎబ్బెట్టుగా కనిపించదు. అలాగే సినిమాలో విజువల్స్ అన్నీ చాలా కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండడమే కాకుండా సినిమాలోని కంటెంట్ మూడ్ కి సింక్ అయ్యేలా ఉన్నాయి. ఈ విజువల్స్ కి సౌండింగ్ తో ప్రాణం పోసాడు ఎంఎం కీరవాణి. పాటలన్నీ బాగున్నాయి, అలాగే అవి చూడటానికి ఇంకా బాగున్నాయి. వీటికంటే మించి ఆయన ఇచ్చిన రీ రికార్డింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్ అయితే చాలా కూల్ అండ్ ప్లెజంట్ ఫీల్ ని తెప్పిస్తాయి. ఎడిటర్ ప్రవీణ్ పూడి కొన్ని షాట్స్ ని షార్ప్ గా ఎడిట్ చేసారు, కానీ సెకండాఫ్ ని మాత్రం బాగా సాగదీసేసారు.

అనుష్క సైజ్ ని రెప్రజెంట్ చేస్తూనే చూడటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతి చేసిన కాస్ట్యూమ్స్ బాగా సెట్ అయ్యాయి. కిరణ్ డైలాగ్స్ బాగున్నాయి. అక్కడక్కడ డబుల్ మీనింగ్ అర్థాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ‘సైజ్ జీరో’కి కథ – కథనం అందించింది కనిక కోవెలమూడి. కనిక రియల్ లైఫ్ లో సఫర్ అవుతున్న ఓ పాత్రని చూసి అనుష్క పాత్రని డిజైన్ చేయడం బాగుంది. కానీ పూర్తి కథా విస్తరణని చాలా రెగ్యులర్ గా రాసుకోవడం, సెకండాఫ్ ని ట్రాక్ తప్పేలా రాసుకున్నారు. ఇక కథనం విషయంలో అయితే చాలా బేసిక్ రూల్ ఫాలో అయ్యారే తప్ప కథనాన్ని ఆసక్తికరంగా చెప్పడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్ గా ఫస్ట్ హాఫ్ పరంగా సూపర్ సక్సెస్ అయ్యాడు, కానీ సెకండాఫ్ లో ఆ ఫీల్ ని కారీ చేయలేకపోయాడు. ఇక పరమ్ వి పొట్లూరి నిర్మాణ విలువలు మాత్రం భారీగా అనిపిస్తాయి.

తీర్పు :

టాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన అనుష్క చేసిన ‘సైజ్ జీరో’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే క్లాస్ సినిమాగా నిలిచిపోతుంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే వారిని కాస్త నిరాశాపరచవచ్చు. కానీ ఈ సినిమా గురించి తెలుసుకొని వచ్చిన వారు మాత్రం ఫస్ట్ హాఫ్ పరంగా ఎంటర్టైన్ అయ్యి సెకండాఫ్ లో కొన్ని ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యి ఓవరాల్ గా డీసెంట్ ఫిల్మ్ చూసాం అనే ఫీలింగ్ తో బయటకి వస్తారు. అనుష్క లుక్ అండ్ పెర్ఫార్మన్స్, ఎంటర్ టైనింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయితే కథనం, సెకండాఫ్ మేజర్ మైనస్ పాయింట్స్. బి, సి సెంటర్స్ లో అటు ఇటుగా ఉన్నా మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్స్ లో బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఓవరాల్ గా థియేటర్స్ కి వెళ్ళిన వారు నిరుత్సాహపడకుండా ఓ మంచి మూవీ చూసాం అన్న ఫీలింగ్ తో బయటకి వచ్చే సినిమానే ఈ ‘సైజ్ జీరో’

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు