సమీక్ష : స్కై ఫాల్ – బాండ్ చిత్రం కాని బాండ్ చిత్రం

సమీక్ష : స్కై ఫాల్ – బాండ్ చిత్రం కాని బాండ్ చిత్రం

Published on Nov 1, 2012 4:43 PM IST
విడుదల తేదీ: 01నవంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు :సామ్ మెండిస్
నిర్మాత : మైఖేల్ జి. విల్సన్, బార్బారా బ్రోకలీ
సంగీతం : థామస్ న్యూమాన్
నటీనటులు : డానియల్ క్రెగ్, బెరెనైస్ మార్లోహే


డానియల్ క్రెగ్ జేమ్స్ బాండ్ గా వస్తున్న మూడవ సినిమా ‘స్కై ఫాల్’. ఈ సినిమా భారీ అంచనాలతో భారీ ఎత్తున ఇండియాలో ఈ రోజు విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో డానియల్ క్రెగ్ తో పాటు జేవియర్ బార్డెం, రాల్ఫ్ ఫిన్నెస్ ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ మెండిస్ దర్శకత్వం వహించిన స్కై ఫాల్ (లోకం చుట్టిన వీరుడు) ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ పేరు ఎం.ఐ 6, దీనికి హెడ్ ఎమ్ (జూడి డెంచ్). ఈ ఎం.ఐ 6 కి సంబందించిన ఒక హార్డ్ డిస్క్ ని విలన్ కాజేస్తాడు. ఆ హార్డ్ డిస్క్ లో టెర్రరిస్టులను కనిపెట్టడానికి పనిచేసే సీక్రెట్ ఏజెంట్స్ వివరాలన్నీ అందులో ఉంటాయి. ఈ సారి ఈ సినిమాలో విలన్ వేరే ఫారిన్ కి సంబందించిన వారు కాదు. ఎం.ఐ 6 లో పని చేసిన ఒక ఏజెంట్ అయిన రౌల్ సిల్వా (జేవియర్ బార్డెం) నే వారికి వ్యతిరేకంగా మారి స్వతహాగా ఎం.ఐ 6 హెడ్ ఎమ్ ని టార్గెట్ చేస్తాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎమ్ తన సీక్రెట్ ఏజెంట్ అయిన బాండ్ 007 ని రంగంలోకి దింపుతుంది. ఆ విలన్ ని బాండ్ ఎలా ఆపాడు? అతని దగ్గర నుండి హార్డ్ డిస్క్ సాదించాడ లేదా అనే విషయాన్ని తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో డైలాగ్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి, అలాగే ఎంతో బాగా డ్రామాని నడిపించారు. సినిమాలోని పాత్రలను బాగా తీర్చిదిద్దారు మరియు పాత చిత్రాల తరహాలో రహస్య విశేషాలను చేదించే డ్రామాగా ఈ బాండ్ సినిమాని తీర్చిదిద్దారు. డానియల్ క్రెగ్ జేమ్స్ బాండ్ లాగా అద్భుతమైన నటనను కనబరిచారు. నా పరంగా డానియల్ క్రెగ్ నటన పాత జేమ్స్ బాండ్ సర్ సియాన్ కన్నెరిని తలపించేలా ఉంది అనిపించింది. మిగతా బాండ్ చిత్రాలతో పోల్చుకుంటే జూడి డెంచ్ ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రని పోషించారు. సినిమా మొత్తం కూడా ఎమ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. రాల్ఫ్ ఫైన్నెస్ మంచి నటనను కనబరిచారు. జేవియర్ బార్డెం విలనిజం చాలా తెలివిగా ఉంటుంది. సినిమాలో అతను తన కండ బలం కంటే బుద్ది బలంతోనే తన పనులు చేసుకుంటూ వెళ్తుంటాడు, అలాగే చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తాడు. సినిమాలో బాగా నచ్చే కొన్ని సన్నివేశాలు ఏమిటంటే సినిమా మొదట్లో వచ్చే బైక్ చేస్, కథలో ట్విస్ట్ చెప్పేటప్పుడు మరియు క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

నాకు ఈ బాండ్ సినిమా గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది అసలు బాండ్ తరహా సినిమానే కాదు. ఒక సీక్రెట్ ఏజెంట్ తో నడిచే చక్కని డ్రామా మాత్రమే అందులో ఎలాంటి అనుమానము లేదు. కానీ మన మదిలో జేమ్స్ బాండ్ అనగానే మెలిగే అంశాలు ఏమిటి? అందమైన వయ్యారి భామలి, రకరకాల కార్లు, అదిరిపోయే లోకేషన్స్, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు మరియు కొత్తరకమైన గాడ్జెట్స్ గుర్తొస్తాయి. ఇలాంటివి ఏమీ మీకు ‘స్కై ఫాల్’ సినిమాలో కనిపించవు. సినిమా అక్కడక్కడా చాలా నిదానంగా అనిపిస్తుంది. బాండ్ సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలను ఆశించి వచ్చిన వారికి ఈ సన్నివేశాలు బాగా బోర్ కొట్టేలా చేస్తాయి. జేవియర్ బార్డెం పరిచయం చాలా భయంకరంగా చూపించినప్పటికీ తర్వాత అంత ఇదిగా ఆ పాత్రని చూపించలేదు. అతను ఎంతో సులువుగా ఎం.ఐ 6 భవనానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సన్నివేశాలు చూడటానికి వాస్తవంగా లేవు. ఎం.జి.ఎం ఈ సినిమా నిర్మించేటప్పుడు కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందులను ఎదుర్కున్నారు. అందువల్ల సినిమాలో అంత గ్రాండ్ లుక్ కూడా ఉండదు.

సాంకేతిక విభాగం :

రోజేర్ డీకిన్స్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. సినిమా స్కాట్లాండ్ కి మారిన తర్వాత అతని పనితనం ఏంటో మనకు తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బాగా ఉండాల్సింది. అడేలే అందించిన టైటిల్ సాంగ్ చాలా బాగుంది. థామస్ నేపధ్య సంగీతం కూడా బాగుంది. ఒక సీక్రెట్ ఏజెంట్ డ్రామా సినిమాని ఆసక్తికరంగా తీయడంలో డైరెక్టర్ సామ్ మెండిస్ విజయం సాదించాడు కానీ ఒక బాండ్ సినిమాని తీయడంలో మాత్రం విఫలమయ్యారు

తీర్పు :

మీరు ‘స్కై ఫాల్’ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకి వెళితే మంచి సీక్రెట్ ఏజెంట్ డ్రామా చూసాం అన్న భావన వస్తుంది. జేమ్స్ బాండ్ పాత తరహాలో ఎలాంటి గాడ్జెట్స్ వాడకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు. డైరెక్టర్ సామ్ మెండిస్ బాండ్ సినిమాని వాస్తవానికి దగ్గరగా తీసారు. కానీ కొన్ని సన్నివేశాలు బోర్ కొడతాయి. సినిమా బాగున్నప్పటికీ బాండ్ సినిమాల్లో ఉండే వాణిజ్య విలువలు, చేజ్ లు ఎక్కువగా లేనందువల్ల ఈ సినిమా బాండ్ అభిమానులను నిరాశాపరిచేలా ఉంటుంది. మాకు మా బాండ్ కావాలి.

123తెలుగు.కాం రేటింగ్ : 3/5

అనువాదం : రాఘవ(Rag’s)

Click Here For ‘Skyfall’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు