సమీక్ష : టెంపర్ – ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ డ్రామా.!

సమీక్ష : టెంపర్ – ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ డ్రామా.!

Published on Feb 14, 2015 6:20 PM IST
Temper-movie-review విడుదల తేదీ : 13 ఫిబ్రవరి 2015
దర్శకత్వం : పూరి జగన్నాధ్
నిర్మాత : బండ్ల గణేష్
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్

తన అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమా అందించాలనే ఉద్దేశంతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీని కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటూ చేసిన సినిమా ‘టెంపర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ని సరికొత్తగా చూపడానికి చాలా కష్టపడ్డాడు. బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రకాష్ రాజ్, మధురిమ, సోనియా అగర్వాల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. టెంపర్ టీం లోని అందరితో పాటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటున్నారు. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ లో ఉందా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

దయ – వాడికి లేనిదే అది.. ఇక కథలోకి వస్తే.. దయ(ఎన్.టి.ఆర్) అమ్మ నాన్న లేని ఓ అనాధ. పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓ సంఘటన ద్వారా దయకి చిన్నప్పుడే ఏం చేస్తే తన బలుపుకు తగ్గా పోస్ట్ లో ఉంటూనే డబ్బుకు కొదవ ఉండదో అలాంటి ఉద్యోగమే పోలీస్ డిపార్ట్ మెంట్ అని తెలుసుకొని పోలీస్ అవుతాడు. ట్రైలర్ లో చెప్పినట్టు పేరుకే పోలీస్ కానీ ఫుల్లీ కరెప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్ మెంటాలిటీ ఉన్న పోలీస్. డబ్బుకోసం గుండాలతో దోస్తీ చేసే టైపు. వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అయిన దయ అక్కడి గుండాయిజం కి కింగ్ అయిన వాల్తేర్ వాసు(ప్రకాష్ రాజ్) తో లింక్ పెట్టుకొని, వాడు చేసే అక్రమాలకు సపోర్ట్ గా నిలుస్తాడు. అదే టైంలో దయ అందమైన (కాజల్ అగర్వాల్)ని చూసి ప్రేమలో పడతాడు.

అదే టైంలో దయ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అప్పుడే కాజల్ ఆపదలో ఉన్న లక్ష్మీ(మధురిమ)ని ని కాపాడమంటుంది. ఇందులో భాగంగా దయ అన్ని రోజులు దోస్తీ చేసిన ప్రకాష్ రాజ్ కి ఎదురు తిరగాల్సి వస్తుంది. కానీ అలా ఎదురు తిరగడం వలన దయ కొన్ని ఇబ్బందుల్లో పడతాడు., ఆ ఇబ్బందులేమిటి.? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు.? దయ జీవితంలో జరిగిన అనుకోని సంఘటనలు ఏమిటి.? ఆ సంఘటనలకి జ్యోతికి కి ఉన్న సంబంధం ఏమిటి.?అసలు జ్యోతి ఎవరు.? జ్యోతికి – దయకి ఏమన్నా సంబంధం ఉందా.? అనేది మీరు వెండితెరపై దయ గాడి దండయాత్ర చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

సినిమా చూసి బయట వచ్చాక ఆడియన్స్ ని ‘టెంపర్’ అని అడిగితే వచ్చే మూడు మాటలు ఎన్.టి.ఆర్, ఎన్.టి.ఆర్ సిర్ఫ్ ఎన్.టి.ఆర్ అనే చెప్తారు. ఎందుకంటే సినిమా మొత్తం అందరూ ఎన్.టి.ఆర్ మత్తులో ఉండిపోతారు, అలాగే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తన నటనలోని కొత్త కోణాల్ని చూపించాడు. టెంపర్ లో ఎన్.టి.ఆర్ మునుపెన్నడూ చేయని ఓ పాత్ర చేయడమే కాకుండా, ఎన్నడూ కనపడనంత స్టైలిష్ గా, హన్డ్సంగా మరియు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తాడు. ఈ లుక్ చూసి చాలా మంది అమ్మాయిలు ఫిదా అవుతారు. ఇకపోతే సెకండాఫ్ లో పోలీస్ గా పవర్ఫుల్ గా కనిపిస్తాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ చూపిన మానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీలో చూపిన మాడ్యులేషన్ మీరు వేరే గత సినిమాల్లో చూడలేదు. అందుకే ఈ సినిమాలో మీరు ఎక్కువ భాగం ఎన్.టి.ఆర్ నే చూస్తుంటారు. ఓవరాల్ గా దయ సిక్స్ ప్యాక్ లుక్ లో అమ్మాయిలకి కలల రాకుమారిడిగా మారితే, పవర్ఫుల్ దయగా అభిమానుల్లో, చూసే ప్రేక్షకుల్లో టెంపర్ లేపాడు. ఇలా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఒకే పాత్రలో ఎన్.టి.ఆర్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ‘టెంపర్’, ‘ఇట్టాగే రేచ్చిపోదాం’ పాటల్లో ఎన్.టి.ఆర్ డాన్సులు సూపర్బ్ గా ఉంటే, చూలెంగే ఆసుమాలో మాత్రం చాలా స్టైలిష్ స్టెప్స్ వేసాడు. తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు కోరుకునేలా ఎన్.టి.ఆర్ ని కెరీర్లోనే ది బెస్ట్ గా చూపించిన క్రెడిట్ మాత్రం పూరి జగన్నాధ్ మరియు బండ్ల గణేష్ ప్రొడక్షన్ కే దక్కింది.

ఈ సినిమాకి బిగ్గెస్ట్ గ్లామర్ అట్రాక్షన్ అయిన కాజల్ అగర్వాల్ కూడా ఇప్పటి వరకూ తన కెరీర్లో కనపించనంత గ్లామరస్ గా కనిపించింది. సినిమాలో చెప్పుకోదగిన పాత్ర లేకపోయినా ఉన్నంతలో మాత్రం చాలా మోడ్రన్ డ్రెస్సుల్లో కనపడుతూ కుర్రకారులోని టెంపర్ ని లేపింది. ఎన్.టి.ఆర్ – కాజల్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ బాగుంది. హీరోయిన్ తర్వాత చెప్పుకోవాల్సింది పోసాని కృష్ణ మురళి గురించి, ఈ సినిమాకి వన్ అఫ్ ది హైలైట్ అతని పాత్ర. సేకదాఫ్ లో తన పాత్ర చేసే హీరో ఎలివేషన్ అదుర్స్. మెయిన్ విలన్ గా చేసిన ప్రకాష్ రాజ్ పాత్రని కూడా కాస్త డిఫరెంట్ గా డిజైన్ చేసారు. ఈ పాత్రలో అప్పుడప్పుడు కామెడీని పండిస్తూనే హీరోకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. మధురిమ ఈ సినిమాలో హీరోయిన్ కాకపోయినా ఒక కీలక పాత్ర పోషించింది. ఈ పాత్రతోనే కథ మలుపు తిరుగుతుంది. మధురిమ ఎమోషనల్ సీన్స్ లో తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ సీన్ లో అదరగొట్టింది. సోనియా అగర్వాల్, అలీ, తనికెళ్ళ భరణి, సప్తగిరి, సుబ్బరాజులు వారు పాత్రలకు న్యాయం చేసారు.

ఇక సినిమా విషయానికి వస్తే పూరి స్టైల్లో సినిమా స్టార్టింగ్ చాలా వేగంగా ఉంటుంది. అలాగే మొదటి 15 నిమిషాల్లోనే ఆడియన్స్ కి దయ పాత్రని బాగానే కనెక్ట్ చేసాడు. సెకండాఫ్ చాలా పెద్ద హైలైట్ ఈ సినిమాకి.. ఎంతలా అంటే అక్కడ దయ కొడుతుంటే, చూసే వాళ్ళు పక్కన ఆడియన్స్ ని కొట్టేసేంతలా.. ఇంటర్వెల్ బ్లాక్ అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఆ ఎగ్జైట్ మెంట్ తో మొదలైన సెకండాఫ్ లో ఎక్కడా టెంపో తగ్గకుండా కొన్ని అదిరిపోయే ఎపిసోడ్స్ తో ఫుల్ టెంపర్ మీద సినిమా సాగుతుంది. సేకదాఫ్ లో వచ్చే హీరోయిజం ఎలివేట్ చేసే పోలీస్ స్టేషన్ సీన్, కోర్టు సీన్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. పూరి అన్ని సాంగ్స్ ని చాలా స్టైలిష్ గా షూట్ చేసారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కి మైనస్ పాయంట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్.. మొదటి 15 నిమిషాలు ఆసక్తిగా కథలోకి తీసుకెళ్లినా ఆ తర్వాత మాత్రం స్పీడ్ తగ్గింది. ఎంటర్టైన్మెంట్ కి చాలా అవకాశం ఉన్నా కానీ దాన్ని సరిగా వినియోగించుకోలేదు. దాని వల్ల చాలా సీన్స్ రీపీటెడ్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది. కాజల్ సెకెండ్ హాఫ్ లో పాటలకి మాత్రం పరిమితం అయ్యింది. అలాగే సినిమా పరంగా ఎన్.టి.ఆర్ పాత్రలో కొత్తదనం ఉన్నా కథలో మాత్రం చెప్పుకోదగ్గ కొత్తదనం లేదు. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఇది వరకే చూశాం.

సాంకేతిక విభాగం :

ఒక రచయిత కథ రాసుకున్న తర్వాతే ఆ సినిమాలోకి అందరూ వస్తారు కాబట్టి ముందుగా కథ నుంచే మొదలు పెడతా.. వక్కంతం వంశీ స్పెషాలిటీ ఏమిటంటే కథ ఎలా ఉన్నా ఆ సినిమాలో హీరోకి పాత్రకి ఓ కొత్త క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు. అలాంటి న్యూ క్యారెక్టర్ ఎన్.టి.ఆర్ లో కనపడుతుంది. కానీ కథ ఓ సూపర్బ్ అని చెప్పుకునేంత లేదు, ఎందుకంటే ఇలాంటి ఫ్లేవర్ ఉన్న సినిమాలు ఇది వరకే కొన్ని వచ్చాయి. వక్కంతం వంశీ కథకి పూరి జగన్నాధ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం తోడయ్యాయి. స్క్రీన్ ప్లే – ఎప్పటిలానే పూరి మార్క్ స్పీడ్ స్క్రీన్ ప్లే సెకండాఫ్ లో కనపడుతుంది. స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడన్నా లోపం ఉందా అంటే అది ఫస్ట్ హాఫ్, ఎందుకంటే కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. డైలాగ్స్ – వీటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరి మళ్ళీ ఎంతో కసితో రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ఉదాహరణకి ఓ రెండు.. ‘దేశంలో జరిగే ప్రతి అవినీతికి ఈ నోటుపై ఉన్న గాంధీగారే సాక్షి’.. ‘అందరి ముందు అమ్మాయిని రేప్ చేసింది మేమే అని అందరి ముందు ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది, మరి మీకు ఉదయం లోపు మాకు ఉరిశిక్ష వేసే దమ్ము ఉందా.?’. ఇక డైరెక్షన్ పరంగా నటీనటుల్ని చూపించడంలో, వారి నుంచి డిఫరెంట్ పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో, అలాగే కథలోని ఎమోషన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. రైటర్ గా డైరెక్టర్ గా పూరి సక్సెస్ అయ్యాడు.

ఇకపోతే సినిమా మొత్తాన్ని ఒక స్టైలిష్ యాక్షన్ పెయింటింగ్ లా చూపించిన క్రెడిట్ మాత్రం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుకి దక్కింది. ఎన్.టి.ఆర్, కాజల్ ని చాలా స్టైలిష్ అండ్ అందంగా చూపించడమే కాకుండా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి విజువల్స్ పరంగా ఆడియన్స్ కి ఓ కొత్త ఫీల్ కలిగేలా చేసాడు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు హిట్ అయ్యాయి, కానీ ఆ పాటలకి శ్యామ్ కె నాయుడు విజువల్స్, ఎన్.టి.ఆర్ – కాజల్ ల కాంబినేషన్ తోడవడంతో చూడటానికి ఇంకా బాగున్నాయి. ఇక మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యింది. సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో చాలా మెలోడియస్ గా మ్యూజిక్ అందించి, హీరో ఎలివేషన్ సీన్స్ లో ఆడియన్స్ నరాలు జివ్వుమనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్రహ్మ కడలి సినిమా కోసం వేసిన సెట్స్ చాలా బాగున్నాయి. బీచ్ లో వేసిన సెట్ చాలా రియలిస్టిక్ ఫీలింగ్ ని ఇస్తుంది. పూరి రాసుకున్న స్క్రీన్ ప్లేకి ఏ మాత్రం తీసిపోకుండా ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ చేసాడు. సినిమా షూటింగ్ తో పాటే ఎడిటింగ్ చేసినా చాలా పర్ఫెక్ట్ ఎడిటింగ్ చేసాడు.ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ ఎలిమెంట్స్ ఉన్నా అది ఎడిటర్ తప్పు కాదు కాబట్టి ఏమీ అనలేం. ఫైట్ మాస్టర్ విజయ్ ఈ సారి ఎక్కువగా కొడితే గాల్లో లేసేలా కాకుండా చాలా రియలిస్టిక్ గా కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా బాగున్నాయి. సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రకి కూడా అవి బాగా సెట్ అయ్యాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ .. బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ .. నిర్మాతగా బండ్ల గణేష్ లేకపోతే పైన చెప్పిన వారి పనితం అంటా లేనట్టే.. సినిమా విజయం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడని బండ్ల గణేష్ ఈ సినిమాని చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించాడు. చెప్పాలంటే ఇదొక స్టార్ హీరో సినిమా, కానీ చాలా షార్ట్ టైంలో ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసారు, కానీ తన బ్యానర్ నుంచి వచ్చే సినిమాల్లోని క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా, అంతకంటే పెచ్చుగానే ఈ సినిమా విజువల్స్ ఉన్నాయి. ఆయన పడ్డ కష్టానికి, పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువగా టెంపర్ సినిమా ప్రతిఫలాన్ని ఇస్తుంది.

తీర్పు :

నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగే సినిమాని మరియు సినిమాకి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఫుల్ ఎంజాయ్ చేసే సినిమాని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ రూపంలో అందించాడు. ఆడియో లాంచ్ లో చెప్పినట్టుగానే ‘టెంపర్’ తో సూపర్బ్ అనిపించుకొని ఈ నందమూరి నామ సంవత్సరంలో రెండవ సూపర్ హిట్ ని నమోదు చేసాడు. ఈ సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఓ కొత్త ఎన్.టి.ఆర్ ని చూసి థ్రిల్ ఫీలవుతారు. ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే కాకుండా నటనలోని వైవిధ్యాన్ని మరోసారి చూపించాడు. ఎన్.టి.ఆర్ అంటే యాక్షన్ మాత్రమే కాదు స్టైలింగ్ లో కూడా ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఎన్.టి.ఆర్ న్యూ లుక్ విత్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, కాజల్ అగర్వాల్ అల్ట్రా గ్లామరస్ అప్పియరెన్స్, పూరి డైలాగ్స్, హీరోయిజం ని చూపే సీన్స్, ఇంటర్వల్ అండ్ సెకండాఫ్ సినిమాకి హైలైట్ అయితే అక్కడక్కడా బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఓవరాల్ గా కథలో పాత సినిమాల ఫీవర్ కనిపించడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. అన్ని రకాల ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ ఉన్న పర్ఫెక్ట్ పైసా వసూల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘టెంపర్’. చివరిగా ‘టెంపర్’ సినిమా చూసే ప్రతి ఒక్కరిలో ‘టెంపర్’ లేపుద్ది.

123తెలుగు.కామ్ రేటింగ్ : ‘టెంపర్’ చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. మా సమీక్ష చదవండి, సినిమాకి వెళ్ళండి.. కచ్చితంగా మీలోని ‘టెంపర్’ ని టాప్ లేచేలా ఎంజాయ్ చెయ్యచ్చు.

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు