
టీం ఇండియా కెప్టెన్ ధోని జీవిత కథ ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకెక్కనుంది. క్రికెటర్ సురేష్ రైనా హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించినట్టు గత కొన్ని రోజులుగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాలు ఖండించాయి. హిందీలో సపోర్టింగ్ రోల్స్ లో నటించే ఉద్దేశ్యం చరణ్ కు లేదని తెలిపారు.
తెలుగులో టాప్ 5 హీరోలలో రామ్ చరణ్ ఒకరు. ‘జంజీర్’ ప్లాప్ తర్వాత చరణ్ మరో హిందీ సినిమాకు సంతకం చేయలేదు. 2015 ద్వితీయార్ధంలో చరణ్ హిందీ సినిమా ప్రారంభమవుతుందని సమాచారం. ‘గోవిందుడు అందరివాడేలే’ విజయం తర్వాత చెర్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీను వైట్ల, గౌతమ్ మీనన్ లతో సినిమాలు చేయవలసి ఉంది.