
‘టెంపర్’ విజయంతో జోష్ మీదున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ వెంటనే మరో మాస్ కమర్షియల్ సినిమా కాకుండా, తన స్టైల్లోనే జ్యోతిలక్ష్మీ పేరుతో ఓ డిఫరెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఛార్మీ హీరీయిన్‌గా నటించడంతో పాటు నిర్మాణంలోనూ భాగం పంచుకొని చేసిన ఈ సినిమా జూన్ 5న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పూరీ జగన్నాథ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించడం, మంచి ఆసక్తి రేకెత్తించే ట్రైలర్ చూసాక సాధారణంగానే అభిమానులు ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు.
ఇక ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తన ఫ్రెండ్స్‌కు చూపించగా వాళ్ళ వద్ద నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందట. ఇక పూరీ గురువు రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా తన ట్విట్టర్‌లో జ్యోతిలక్ష్మీపై వరుస ట్వీట్లు చేసి సినిమాపై ట్వీట్ల వర్షం కురిపించాడు. ఒక సోషల్ మెసేజ్‌ని కమర్షియల్ ఫార్మాట్‌లో మంచి స్టోరీతో చెప్పడం ఈ సినిమాకు హైలైట్ అని వర్మ అన్నాడు. ఛార్మీ జ్యోతిలక్ష్మీగా తన కెరీర్లో బెస్ట్ యాక్టింగ్ ఈ సినిమాలో చేసిందని వర్ప చెప్పుకొచ్చాడు. సత్యదేవ్ చాలా సహజంగా నటించాడని, అతడిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవడం మరో ప్లస్ అని రామ్ గోపాల్ వర్మ జ్యోతిలక్ష్మీపై ప్రశంసలు గుప్పించాడు.