
‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో కామెడీ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం, మూడో సినిమా ‘భాయ్’ పరాజయం తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమా ఏదీ మొదలుపెట్టలేదు. తాజాగా ఆయన లవర్ బాయ్ ఆదితో ఓ సినిమాకు సన్నాహాలు చేసుకున్నారు. రేపే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుంది. ఈ సినిమా ద్వారా కొత్త నిర్మాత వెండితెరకు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ప్రస్తుతం ‘గరమ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! గరమ్ పూర్తైన వెంటనే వీరభద్రం సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. మంచి కామెడీ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా తనకు ఓ కొత్త గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆది నమ్మకంగా ఉన్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సినిమా యూనిట్ రేపు సినిమా లాంచ్ సందర్భంగా తెలియజేసే అవకాశం కనిపిస్తోంది.