తాజా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ కామెంట్స్!

pawan-kalyan
సినిమాల్లో స్టార్‌గా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్, గత ఎన్నికల సమయంలో జనసేన పేరుతో ఓ పార్టీని నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రజల తరపున పోరాడటమే తమ ఎజెండా అని చెబుతూ వచ్చిన పవన్, ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటానని మాటిచ్చారు కూడా. ఇక ఆ మాట ప్రకారమే పలుమార్లు ప్రభుత్వాలపై విమర్శలు చేసిన పవన్, కొద్ది రోజులుగా సైలైంట్ అయ్యారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారంతో రాజకీయం వేడెక్కింది. వాడీ వేడీ విమర్శల పర్వంతో ఈ ఎపిసోడ్ రాజకీయంగా సంచలనంగా మారింది. అయినా పవన్ ఈ విషయంపై ఇప్పటివరకూ ఒక్కసారి కూడా స్పందించలేదు.

కాగా ఈ సాయంత్రం ఇదే విషయమై పవన్ కళ్యాణ్ తన స్టైల్లో ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పరోక్ష విమర్శలు చేయడం విశేషంగా కనిపిస్తోంది. “రాజకీయాలంటే కేవలం ప్రత్యర్థులను ఏరకంగా దెబ్బతీయాలన్న ఆలోచనకే పరిమితం అనుకుంటే.. నల్లజాతి దార్శనికుడు నెల్సన్ మండేలా తనను అవమానించిన వారిపై ప్రతీకారానికి ఒడిగట్టి ఉంటే ఎలా ఉండేది? ఒక గొప్ప లీడర్‌గా ఆయన అలాంటి ఆలోచన చేయలేదు కాబట్టే ప్రజల మధ్య వైషమ్యాలు చెలరేగకుండా ఆపగలిగారు. ప్రస్తుత రాజకీయ నాయకులంతా ఆయన బాటలో ప్రయాణించి, నమ్మి ఓటేసిన జనాలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా” అంటూ తనస్టైల్లో తాజా రాజకీయాలపై పవన్ తన స్పందనను తెలియజేశారు.

Exit mobile version