
అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఈ మధ్యే స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా థాయ్‌లాండ్‌కు షిఫ్ట్ అయింది. ఇక సినిమా గురించి మరిన్ని విశేషాలను తెలియజేస్తూ అభిమానులకు అఖిల్ ఓ లేఖ రాశారు.
చిన్నప్పట్నుంచీ హీరో అవ్వాలని తాను కన్న కలలు త్వరలో నిజం కాబోతున్నాయని, ఇప్పటికే సినిమా సగం షూటింగ్ పూర్తైందని, సినిమాలో కీలకంగా వచ్చే సన్నివేశాల చిత్రీకరణకు థాయ్‌లాండ్ వెళుతున్నామని అఖిల్ ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అక్కినేని వంశంలో మూడో తరంలో పరిచయమవుతోన్న అఖిల్ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రూపొందుతున్నట్లు నితిన్, వి.వినాయక్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే!
ఇక తనపై కురిపిస్తున్న ప్రేమకు, చూపిస్తున్న ఉత్సాహానికి అభిమానులకు ఈ సందర్భంగా అఖిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా అభిమానులతో టచ్‌లోనే ఉంటానని, సినిమా రిలీజ్‌కు ముందే అభిమానులను ఓసారి కలిసి ముచ్చటించే ఆలోచనలో ఉన్నట్లు అఖిల్ అక్కినేని లేఖలో పేర్కొన్నారు.