
సూపర్ స్టార్ మహేష్ బాబు – సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఇప్పటివరకూ కేవలం ఒక్క సినిమాయే వచ్చింది. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూడగా, ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఆ సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలన్నీ మంచి హిట్‌గా నిలవడమే కాక, మహేష్ కెరీర్లో ఓ సరికొత్త స్టైల్ ఆల్బమ్‌గా నిలిచింది. మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ తాజాగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన ‘శ్రీమంతుడు’ సినిమా కోసం సెట్ అయింది.
మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీమంతుడు సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక జూలై 18న హైద్రాబాద్‌లో వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే! దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలతో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా ఈ సందర్భంగా విడుదల కానుంది. ఇక శ్రీమంతుడు ఆల్బమ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలుండగా, ఆరు పాటలకూ రామ జోగయ్య శాస్త్రి సంగీతాన్ని సమకూర్చారు. మహేష్ సినిమా ఫార్మాట్లానో అన్ని రకాల పాటలూ ఈ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక ‘1 నేనొక్కడినే’తో మహేష్ సినిమా ఆల్బమ్‌కు కొత్త రూపాన్నిచ్చిన దేవీ, ‘శ్రీమంతుడు’ విషయంలో కూడా అదే కొత్తదనాన్ని చూపారని సమాచారం. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున శ్రీమంతుడు విడుదల కానున్న విషయం తెలిసిందే!